iDreamPost

తల్లి తదనంతరం గోల్డ్ ఎవరికి చెందుతుంది ? కూతురికా? కోడలికా?

అమ్మ తదనంతరం ఆమె బంగారం ఎవరికి చెందుతుంది? కూతురికా? కోడలికా? చట్టం ఏం చెబుతుంది? మన పెద్దలు ఏం చెబుతారు?

అమ్మ తదనంతరం ఆమె బంగారం ఎవరికి చెందుతుంది? కూతురికా? కోడలికా? చట్టం ఏం చెబుతుంది? మన పెద్దలు ఏం చెబుతారు?

తల్లి తదనంతరం గోల్డ్ ఎవరికి చెందుతుంది ? కూతురికా? కోడలికా?

తల్లి తదనంతరం.. అసలు ఈ మాట మాట్లాడుకోవడమే ఒక పెద్ద పాపం. తల్లి బతికుండగా ఆమె ఒంటి మీద ఉన్న బంగారం, ఆమె దాచుకున్న డబ్బు ఏదైనా ఉంటే ఇవన్నీ ఎవరికి చెందుతాయి? కోడలు ఉంటే కోడలికా? లేక కూతురు ఉంది కాబట్టి కూతురికా? ఇలాంటి లెక్కలు వేసుకోవడం తప్పే. అయినప్పటికీ ఇప్పుడున్న ఆర్థిక వైకల్య పరిస్థితికి దీని మీద అవగాహన పెంచుకోవడం తప్పని పరిస్థితి. అమ్మ బంగారం, అమ్మ దాచుకున్న డబ్బు నాకే చెందుతుంది అని కూతురికి, కోడలికి మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. 

ఆర్థిక పరిస్థితి నిజంగా బాగుంటే ఈ ప్రశ్న రాదు, రాకూడదు. కానీ ఆర్థిక స్థితి బాలేని వారు మాత్రం తన తల్లి బంగారం తనకు దక్కుతుందా లేదా అనే విషయం గురించి తెలుసుకోవాలి. అలానే కోడళ్ళు కూడా తమ అత్తగారి బంగారం తనకే దక్కుతుందా? లేదా? అనేది తెలుసుకోవాలి. తల్లి మరణానంతరం ఆమె బంగారం కూతురికి చెందుతుందా? లేక కోడలికి చెందుతుందా? ఈ సందేహాన్ని చట్టం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం.. అలానే మానవత్వ కోణం.. మూడు రకాలుగా చూడాల్సి వస్తుంది. మొదటగా చట్ట ప్రకారం చూసుకుంటే.. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లి బంగారం చెందుతుంది. కొడుకులు, కూతుర్లు ఎంతమంది ఉంటే అంతమంది వారసులకూ ఆమె బంగారం మీద హక్కు ఉంటుంది. పొలం, స్థలం, ఇల్లు వంటి ఆస్తుల్లో సగం వాటా కొడుకుతో పాటు సమానంగా కూతురికి కూడా చెందుతుందని చట్టం చెబుతుంది. అలానే బంగారం విషయంలో కూడా సగం వాటా కూతుర్లకు ఉంటుంది. 

ఇక సాంప్రదాయ కోణంలో ఆలోచిస్తే.. వృద్ధాప్యంలో తల్లికి సేవ చేసేది కొడుకు, ఆమె భార్య కాబట్టి అత్తగారి బంగారం ఆమె మరణం తర్వాత కోడలికి చెందుతుందని పెద్దలు చెబుతారు. అంటే అత్తగారిని బాగా చూసుకుంటే అత్తగారి బంగారం మీద కోడలికి హక్కు ఉంటుంది. అయితే కూతురుకి ఎందుకు చెందాడు అని అనడానికి ఒక కారణం ఉంది. కూతురికి డబ్బు, ఆస్తి, అలానే బంగారం కట్నంగా ఇస్తారు. కాబట్టి తల్లి దగ్గర మిగిలిన బంగారం మరలా కూతురుకి ఇవ్వడం ఎందుకు అని పెద్దలు అంటారు. కూతురికి కాకుండా కోడలికి ఇస్తే బాగుంటుందని అంటారు. పైగా అత్తగారితో పాటు కలిసి ఉండేది కోడలే కదా. అందుకే ఆమె బంగారం కోడలికే చెందాలనే నియమం సాంప్రదాయంగా వస్తుంది.

సాంప్రదాయం ప్రకారం వెళ్తే.. కూతురికి తల్లి బంగారం మీద హక్కు అనేది ఉండదు. అయితే కొంతమంది మాత్రం తల్లి బంగారం ఆమె అనంతరం కూతురికే చెందాలని అంటారు. ఇంకొంతమంది అయితే కూతురికి, కోడలికి ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని చెబుతారు. అయితే ఇద్దరికీ ఇవ్వాలా? లేక నచ్చిన వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆమె ఇష్టమే. ఈ విషయంలో కూతురైనా, కోడలు అయినా ఆమె ఇష్టాన్ని గౌరవించాలని అంటారు. అయితే ప్రస్తుతం పిల్లలు తమని పట్టించుకోవడం లేదని.. చివరి దశలో తమను చూసిన వారికే బంగారం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలా అనుకోవడం తప్పేమీ కాదు. కూతురికి, కోడలికి బంగారం సమానంగా పంచేసి.. కొడుకు దగ్గరే మిగిలిన జీవితం గడిపితే కొడుకు అన్యాయం అయిపోతాడుగా. కొడుకు ధనవంతుడు అయితే ఈ ఆలోచనే రాదు. కానీ ఏ కూలి పని చేసుకునే వ్యక్తో, లేక ఏ చిరుద్యోగో అయితే పాపం అతనికి నష్టమే కదా. అందుకే తనని కొడుకు బాగా చూసుకుంటే బంగారం కోడలికి ఇస్తుంది.

కాబట్టి ఈ విషయంలో కూతుర్లు చట్ట ప్రకారం అమ్మ బంగారాన్ని సాధించుకుంటామని కోర్టు మెట్లెక్కడం కరెక్ట్ కాదు. కూతురి ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక తల్లి బంగారం మీద ఆశ పడకూడదు. బతకడానికి ఇబ్బంది లేదన్న పరిస్థితుల్లో కూడా ఆశ పడకూడదు. కోడలేమీ బయట వ్యక్తి కాదు కదా, సోదరుడి భార్యే అన్న ఆలోచన ఉంటే ఏ గొడవా ఉండదు. ఒకవేళ కొడుకు, కూతురు ఇద్దరి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఆ తల్లి ఇద్దరికీ ఆ బంగారం ఇస్తే బాగుంటుంది. అప్పుడు కొడుకు, కూతురు ఇద్దరూ తల్లిని చూడాలి. తల్లిదండ్రులని పట్టించుకోని వారికి వారి ఆస్తిని పంచుకునే హక్కు లేదు. ఆ బంగారం ఎవరు తీసుకుంటే వారు ఖచ్చితంగా తల్లిని చూడడం ధర్మం. 

ఇక మూడవది, మానవత్వ కోణం. మానవత్వ కోణంలో ఆలోచిస్తే.. ఈ బంగారం, డబ్బు, ఆస్తులు ఇవేమీ శాశ్వతం కాదు. ఆర్థిక పరిస్థితి బాగున్నా, బాగోలేకున్నా.. ఎలా ఉన్నా సరే అమ్మే ముఖ్యం, ఆ అమ్మే ఒక బంగారు గని అనుకుంటే కొడుకు గొప్పోడు అవుతాడు. అత్తగారు అయితే ఏమైంది.. తల్లి తర్వాత తల్లే కదా అని అనుకుంటే ఆ అల్లుడు గొప్పోడు అవుతాడు. మాకు బంగారం కంటే బంధాలే ముఖ్యం అని ఆడబిడ్డ (కూతురు/కోడలు) అనుకుంటే ఆమెను మించిన అష్టలక్ష్మి ఇంకెవరుంటారు. లక్ష్మీదేవి ఉన్న చోట గొడవలు ఉండవు. మహాలక్ష్మి అంటే మంచి మనసు. జన్మనిచ్చారు కాబట్టి పరిస్థితులు బాగున్నా, లేకున్నా తల్లిదండ్రులను చూడడమనేది ధర్మం. పిల్లల్ని సమానంగా చూడని తల్లిదండ్రులైనా, సమానంగా ఆస్తి పంచని తల్లిదండ్రులైనా సరే జన్మనిచ్చిన బంధానికి ఏమీ ఆశించకుండా వారి రుణం తీర్చుకోవడం ఉత్తముల లక్షణం. రుణ బంధాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తే కలహాలు ఉండవు. కల్మషం లేకుండా జీవిస్తే జీవితాలు బాగుంటాయి. మరి  ఈ విషయంలో ఒక కోడలిగా, ఒక కూతురిగా మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి