iDreamPost

ఏడుగురు ఆడపిల్లలు.. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ తండ్రి ఎందరికో ఆదర్శం

  • Published Feb 20, 2024 | 11:07 AMUpdated Feb 20, 2024 | 11:07 AM

ఆడపిల్ల అంటే భారమని భావించే తల్లిదండ్రులకు ఈ తండ్రి ఆదర్శప్రాయుడు. ఏడుగురు ఆడపిల్లలను చక్కగా పెంచి ప్రయోజకులన్ని చేశాడు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సాహించాడు. ఆ వివరాలు..

ఆడపిల్ల అంటే భారమని భావించే తల్లిదండ్రులకు ఈ తండ్రి ఆదర్శప్రాయుడు. ఏడుగురు ఆడపిల్లలను చక్కగా పెంచి ప్రయోజకులన్ని చేశాడు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సాహించాడు. ఆ వివరాలు..

  • Published Feb 20, 2024 | 11:07 AMUpdated Feb 20, 2024 | 11:07 AM
ఏడుగురు ఆడపిల్లలు.. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ తండ్రి ఎందరికో ఆదర్శం

అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా ఆడపిల్ల అంటే భారంగా భావించే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. వరుసగా రెండో సారి ఆడపిల్ల పుడితే.. అబ్బా మళ్లీ అమ్మాయేనా అనుకునే వారు కోకొల్లలు. మరి మగ పిల్లలు ఊరికే అలా గాలికి పెరుగుతారో ఏంటో అర్థం కాదు. ఎవరు పుట్టినా సరే వారిని పెంచి, పెద్ద చేసేందుకు ఒకేరకమైన ఖర్చు. పైగా అమ్మాయిలను ప్రోత్సాహిస్తే వారు అబ్బాయిలకు ధీటుగా రాణిస్తారు. ఇందుకు మన కళ్ల ఎదురుగానే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నా సరే.. ఆడపిల్ల అంటే భారంగా భావించేవారు అనేక మంది ఉన్నారు. అదిగో అలాంటి వారికి ఈ తండ్రి ఆదర్శం. ఏడుగురు ఆడపిల్లలు పుట్టినా ఆ తండ్రి బాధపడలేదు. పైగా వారిని చదువు విషయంలో ఎంతో ప్రోత్సాహించాడు. అమ్మాయిలు కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము కానీయలేదు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆ వివరాలు..

బిహార్‌లోని సరన్‌ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్‌ సింగ్‌ పిండి మిల్లులో కార్మికుడిగా పని చేసేవాడు. ఆయనకు కూడా మగ పిల్లాడు అంటే పిచ్చి. అలా అని ఆడపిల్లలు అంటే చిన్న చూపేంలేదు. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌కు మొదటి సంతానంగా ఆడపిల్ల పుడితే.. మహాలక్ష్మి జన్మించింది అని సంతోషించాడు. రెండో సంతానంలో కొడుకు పుట్టాలని కోరుకున్నాడు. కానీ మరోసారి కుమార్తె జన్మించింది. అలా వారసుడి కోసం ఎదురు చూస్తూ.. ఏడుగురిని కన్నాడు. అందరూ ఆడపిల్లలే. అయినా ఏమాత్రం నిరాశపడలేదు రాజ్‌కుమార్‌ సింగ్‌. ఆడపిల్లలైతే ఏం తక్కువ.. వారికి చదువు చెప్పించి.. వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా పెంచితే చాలని భావించాడు.

అనుకున్నట్లుగానే.. ఏడుగురు ఆడపిల్లలని ఉన్నత చదువులు చదివించాడు. అంత ఖర్చు చేసి ఆడపిల్లలను చదివించడం ఎందుకు.. అంటూ చుట్టుపక్కల వారు ఎంత భయపెట్టినా.. ఎగతాళి చేసినా.. రాజ్‌కుమార్‌ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎవరూ ఏమనుకున్నా తన బిడ్డలను వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రయోజకులను చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అమ్మాయిలు కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.

రాజాసింగ్‌ ఏడుగురు కుమార్తెలు కూడా పోలీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. పెద్ద కుమార్తె బిహార్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించగా.. రెండో కూతురు ఎస్‌ఎస్‌బీలో ఉద్యోగం చేస్తుంది. మూడో కుమార్తె సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా చేస్తుండగా.. నాల్గవ కుమార్తె క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌గా, ఐదో కూతురు ఎక్సైజ్‌ శాఖలో, ఆరో బిడ్డ బిహార్‌ పోలీస్‌ శాఖలో కానిస్టుబల్‌గా, ఏడో కుమార్తె రైల్వే శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది.

ఏడుగురు కుమార్తెలు జన్మించినా.. ఏమాత్రం బాధపడకుండా.. వారిని బాగా చదివించి.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా ప్రోత్సాహించిన రాజా సింగ్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇన్నాళ్లు ఏడుగురు ఆడపిల్లలు.. వారికి చదువేందుకు.. పెళ్లిళ్లు ఎలా చేస్తావ్‌ అన్న ఇరుగుపొరుగు వారే.. ఇప్పుడు అతడిని మెచ్చుకుంటున్నారు. ఆడపిల్ల అంటే భారం అని భావించే తల్లిదండ్రులకు రాజా సింగ్‌ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి