iDreamPost

ఇక్కడి వారి అప్పుకు.. చైనాతో లింకు..!!

ఇక్కడి వారి అప్పుకు.. చైనాతో లింకు..!!

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌.. ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్‌నాలెడ్జి ఉన్నవారెవరికైనా బాగా పరిచయం అవుతున్నాయి. ఎటువంటి ష్యూరిటీ లేదు, సిబిల్‌.. గిబిల్‌.. స్కోర్‌ అంటూ ఎటువంటి బాదర బంధీలు ఉండవు.. యాప్‌ డైన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకోండం, అలా ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు అది అడిగిన వివరాలన్నీ ఇచ్చేయడం.. అంతే మీ అక్కౌంట్లోకి డబ్బులు వచ్చిపడిపోతాయి. ఇంత వేగంగా ఇంటి పక్కనే ఉండి, మనమేంటో తెలిసిన వారు కూడా డబ్బులు అప్పుగా ఇవ్వడం ఆసాధ్యం. కానీ ఆన్‌లైన్‌ యాప్స్‌లో మాత్రం సాధ్యమవుతోంది.

యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే క్రమంలో వారడిగేది మాత్రం కాంటాక్ట్స్‌ నెంబర్ల వివరాలు, పాన్, ఆధార్‌కార్డు వివరాలు మాత్రమే అడుగుతాయి. అప్పు పుట్టేస్తుందన్న ఆశతో ఈ వివరాలు ఇవ్వడం సదరు వ్యక్తులకు పెద్ద విషయంగా తోచదు. నీతో ఎవ్వరూ మాట్లాడనుకూడా మాట్లాడరు, నువ్వెవర్నీ కూడా నేరుగా చూడను కూడా చూడవు.. కానీ అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్‌ మాత్రం ఖచ్చితంగా అప్లై అవుతుందండోయ్‌.. ఇలా పొందిన అప్పుపై వడ్డీ ఎంత శాతం అంటే మాత్రం ఖచ్చితంగా అప్పు పొందిన వాళ్ళకు కూడా తెలీదు. దీనిని లెక్కేస్తే నిపుణులే నోరెళ్ళబెడుతున్నారు. అక్షరాలా 36శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్టుగా తేలింది. అంటే సాధారణంగా జాతీయ బ్యాంకుల్లో సైతం రిస్కు ఎక్కువగా ఉండే రుణాలకు కూడా 13.5శాతాన్ని మించి వడ్డీని వాసూలు చేయవు. ఆ బ్యాంకుల దృష్టిలో రుణ గ్రహీతల నుంచి వసూలు చేసేది ఇదే అత్యధిక వడ్డీ. కానీ ఆన్‌లైన్‌ యాప్‌లలో మాత్రం 36శాతం అంతకు మించి వడ్డీలను వసూలు చేస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఈ వడ్డీకి అగ్రిమెంట్‌ ఛార్జీలు, వారి శార్ధం ఛార్జీ, పిండాకూడు ఛార్జీలు.. అదనంగా ఉంటాయన్నమాట.

ఈ మొత్తం వ్యవహారం సామాన్యుడికి దాదాపు అర్ధం కాదనే చెప్పాలి. ఒక్కసారి రుణ గ్రహీత వివరాలు వారికి చేరాక, ఇక వీరి జుట్టు సదరు యాప్‌ల వారి చేతులోకి చేరుతుందన్నమాట. ఇలా పొందిన రుణం తీర్చలేక నానా పాట్లు పడుతున్నవారు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లోనే ఉంటారని ఒక అంచనా. అప్పు తీర్చకపోతే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే ముందు మీరిచ్చిన అనుమతి మేరకు సదరు యాప్‌ పొందిన కాంటాక్ట్స్‌ నంబర్లకు రుణగ్రహీత ఇమేజ్‌ను దెబ్బతీస్తూ అనేక మెస్సేజ్‌లను ఈ యాప్‌లు పంపించడం ప్రారంభిస్తాయి. దీంతో మనస్థాపం చెంది గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

దీనిని బట్టే లోన్‌యాప్‌ల అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎంత వ్యాపారం అయినప్పటికీ లోను అడిగిన వారి స్థోమతను బట్టి మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. బ్యాంకులు తీసుకునే కనీస జాగ్రత్తలు ఆ బ్యాంకుకే కాకుండా, అప్పుతీసుకున్న వారిని కూడా ఒకరకంగా కాపాడతాయనే చెప్పాలి. కానీ ఇలా యాప్‌ల ద్వారా రుణాలు పొందిన వారి భద్రత మాత్రం దైవాదీనంగా మారిపోతుందని వీటి భారిన పడ్డవారు చెబుతున్నారు. నిర్ణీత సమయంలో అప్పు తీర్చకపోతే సదరు యాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్, వాళ్ళుతిట్టే తిట్లు ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయంటున్నారు.

అయితే ఇలా అడిగిందే తడవుగా ఉదారంగా అప్పులిచ్చేస్తున్న ఈ యాప్‌ల మూలాలన్నీ చైనాకు చెందిన సర్వర్ల ద్వారానే నడుస్తున్నాయన్నది తీవ్రంగా ఆందోళన కల్గిస్తోన్న అంశంగా నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రుణ వ్యవహారాలు సైతం ఆర్బీఐ నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే జరగాలి. ఇందుకు విరుద్ధంగా జరిగితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా జరిగే వ్యవహారాలకు మాత్రం ఆర్బీఐ నిబంధనల పరిధిలో లేకుండా జరగడం గమనార్హం. ఇక్కడి వారి అవసరాన్ని ఆసరగా తీసుకుని విదేశీ శక్తులు ఈ విధంగా మనదేశ వాసుల కష్టాన్ని దోచుకునే ప్రక్రియకు బీజం వేస్తున్నాయంటున్నారు. ఇటువంటి యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. అయినప్పటికీ ఇదే మాత్రం సరిపోదంటున్నారు. ఒక యాప్‌ను అడ్డుకుంటే పేరు మార్చుకుని మరో రూపంలో ఇది ప్రజల ముందుకు వచ్చేస్తోందని వివరిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎంత మంది తమ జీవితాలను ఈ యాప్‌ల పాల్జేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి