iDreamPost

టీడీపీ ఓటమికి కారణాలు చెప్పిన ఎమ్మెల్యే కరణం బలరాం

టీడీపీ ఓటమికి కారణాలు చెప్పిన  ఎమ్మెల్యే కరణం బలరాం

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రకాశం జిల్లా సీనియర్‌ నేతల్లో ఒకరు. గడచిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం కరణం బలరాం.. టీడీపీ దూరంగా ఉంటున్నారు. అధికార పార్టీలో ఆయన అధికారికంగా చేరకపోయినా.. సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆయన కుమారుడు, 2014 ఎన్నికల్లో అద్దంకిలో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం వెంకటేష్‌కు వైసీపీ కండువా కప్పించారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కన్నా రాజకీయాల్లో సీనియర్‌ అయిన కరణం బలరాం గడచిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. చంద్రబాబు చెప్పే దానికి చేసేదానికి పొంతన లేకపోవడంతో నమ్మకం కోల్పోయారని కరణం బలరాం అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకుడికి ప్రజల నమ్మకం గెలుచుకోవడం, దాన్ని నిలుపుకోవడం ముఖ్యమన్నారు. ఐడేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఎప్పుడూ అప్పటి ప్రతిపక్షనేతపై విమర్శలు చేశారని కరణం పరోక్షంగా చెప్పారు. ఎప్పుడూ ఎదుటివాడిని విమర్శించే పనిలో ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదన్నారు. ఈ విషయం చంద్రబాబుకు చెప్పినా కూడా ఆయన తలకెక్కించుకునే పరిస్థితులు అప్పట్లో లేవన్నారు. ఇలాంటి పంథాలో వెళ్లడం వల్లనే గడచిన ఎన్నికల్లో ఫలితం అలా వచ్చిందని కరణం బలరాం వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆలోచన చేసుకోవాలని కరణం హితవు పలికారు. పార్టీ యంత్రాంగంలో అసంతృప్తులు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలన్నారు. పార్టీ మారిన తర్వాత విమర్శలు చేయడం తన నైజం కాదన్నారు. కానీ వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు, రెండేళ్ల కిందటే వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావాల్సి ఉందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జిల్లాకు నష్టం జరిగిందన్నారు. సీఎం జగన్‌ అధికారం చెపట్టిన తర్వాత మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే చాలా హామీలు అమలు చేశారని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి