iDreamPost

బుచ్చయ్యే కాదు.. వారసుడూ కనిపించడం లేదు..!

బుచ్చయ్యే కాదు.. వారసుడూ కనిపించడం లేదు..!

రాజమహేంద్రవరం పార్లమెంటు కేంద్రమైన రాజమహేంద్రవరం నగరం నుంచి తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయాన్ని సొంత పార్టీ నాయకులే ప్రధానంగా చెప్పుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబుకంటే సీనియర్‌గా చెబుతుంటారు. పార్టీ జనరల్‌ సెక్రటరీగా కూడా ఉన్నారు. అలాగే సివిల్‌సప్లైస్‌ మంత్రిగా కూడా పనిచేసారు. పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.

గుంటూరు ప్రాంతానికి చెందిన బుచ్చయ్యచౌదరి వ్యాపారం నిమిత్తం రాజమహేంద్రవరానికి వచ్చి.. ఇక్కడ రాజకీయాల్లో స్థిరపడ్డారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచీ టీడీపీలో ఉన్న బుచ్చయ్యచౌదరి సిటీ నుంచే అత్యధికంగా గెలుపొందారు. అయితే రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నుంచి రూరల్‌కు మారారు. రూరల్‌ నియోజకవర్గంలోని పరిస్థితుల దృష్ట్యా 2014లో దాదాపు 18వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో తనదైన రీతిలో చక్రం తిప్పారనే చెప్పాలి. అప్పట్లో గోదావరి పుష్కరాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

సిటీలో ఉన్న టీడీపీ నాయకులందరితోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరించే గోరంట్ల రెండు నియోజకవర్గాల్లోనూ తనదే పెత్తనం అంటూ నేరుగానే చెబుతుండేవారు. 2019లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన త్రిముఖ పోటీలో పదివేల మెజార్టీతో మరోసారి రూరల్‌ నుంచి గట్టెక్కేయగలిగారు. అయితే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో అధికారంలోకొచ్చింది. దీంతో అప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్న ఆయన అసలు రూరల్‌ నియోజకవర్గ ప్రజల ముఖమే చూడడం లేదంటున్నారు. 2019 ఎన్నికల తరువాత మూణ్ణాలుగు సార్లు మినహా అసలు నియోజకవర్గం ఛాయయలకే రాకపోవడంతో సొంత పార్టీ నాయకులు కూడా ఆయన్ను ఎమ్మెల్యేగా మర్చిపోయే స్థితికి చేరుకున్నారు.

Also Read : తోట వర్సెస్‌ వేగుళ్ల – రసవత్తరంగా మండపేట రాజకీయం

గోరంట్లకు టీడీపీ హాయంలో మంత్రి పదవి రాకపోవడంతో అలకబూని నేరుగా చంద్రబాబుపైనే విమర్శలకు కూడా దిగారు. పార్టీలో సైతం ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రత సారీ బుచ్చయ్యచౌదరి తన పాత్రను పోషిస్తూనే ఉంటారు. అసెంబ్లీలో ఏకంగా అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ తరపున బుచ్చయ్యను కూడా గట్టిగానే వాడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చిన్నన్నకు న్యాయం జరగలేదని బుచ్చయ్య అభిమానులు నొచ్చుకుంటూనే ఉంటారు.

పార్టీ అధినేత చంద్రబాబే జూమ్‌.. ట్విట్టర్‌ అంటూ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తనకెందుకులే అనుకున్నారో ఏమో బుచ్చయ్యచౌదరి సైతం అదే దారిన ప్రయాణిస్తున్నట్టున్నారు. అడపాదడపా మీడియాతో ముచ్చట్లు, సోషల్‌ మీడియాలో పోస్టులు తప్పితే పార్టీ కార్యక్రమాలు గానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన వంతు పాత్ర పోషిస్తున్న దాఖలాలు గానీ లేవు. దీంతో అసలు భవిష్యత్తులో బుచ్చయ్యచౌదరి రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా? అన్న అనుమానాలు కూడా టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇప్పటికే తన రాజకీయ వారసుడిగా తమ్ముడి కుమారుడు డా. గోరంట్ల రవికిరణ్‌ను ప్రకటించారు. వారసుడి ప్రకటన, 75 సంవత్సరాల వయస్సు నేపథ్యంలోనే ప్రజలకు, పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారని సరిపెట్టుకుందామనుకున్నా.. వారసుడిగా ప్రకటించిన డా. రవికిరణ్‌ కూడా బైటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. బుచ్చయ్యచౌదరి రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటే.. ఆయన వారసులు, ఆయన స్థాయిలో నియోజకవర్గంలో పట్టునిలుపుకోగలరా? అన్న అనుమానాలను పెంచుతోంది. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Also Read : ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి