iDreamPost
android-app
ios-app

ఆ టీమిండియా బౌలర్​ ను చూసి ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకున్నా: సాంట్నర్

  • Author Soma Sekhar Published - 09:00 AM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Published - 09:00 AM, Tue - 10 October 23
ఆ టీమిండియా బౌలర్​ ను చూసి ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకున్నా: సాంట్నర్

వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తన జోరును కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాకిచ్చిన కివీస్ తాజాగా పసికూన నెదర్లాండ్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 99 పరుగుల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ మ్యాచ్ లో డచ్ టీమ్ పనిపట్టాడు కివీస్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్. తన స్పిన్ మాయాజాలంతో నెదర్లాండ్స్ టీమ్ ను కాకవికలం చేశాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ 2023లో ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు ఈ కివీస్ ఆల్ రౌండర్. అయితే తాను ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడానికి కారణం ఓ టీమిండియా బౌలర్ అని, ఇండియా పిచ్ లపై అతడి బౌలింగ్ ను తీక్షణంగా పరిశీలించేవాడినని చెప్పుకొచ్చాడు.

మిచెల్ సాంట్నర్.. కివీస్ స్టార్ ఆల్ రౌండర్ గా జట్టుకు అమోఘమైన సేవలు అందిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇటు బ్యాట్ తో అటు బాల్ తో రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ లో లీడింగ్ వికెట్(7) టేకర్ గా కొనసాగుతున్నాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇటు బ్యాట్ తో కూడా కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే తాను బౌలింగ్ అద్భుతంగా చేయడానికి కారణం ఏంటో వెల్లడించాడు ఈ కివీస్ ఆల్ రౌండర్. టీమిండియా పిచ్ లపై ఎలా బౌలింగ్ చేయాలో రవీంద్ర జడేజాను చూసి నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సాంట్నర్.

భారత పిచ్ లపై జడేజా బౌలింగ్ చేసే విధానాన్ని దగ్గరగా పరిశీలించానని, ఇది తనకు ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు సాంట్నర్. అదీకాక ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా పనికొస్తుందని తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జట్టులో విల్ యంగ్(70), రచిన్ రవీంద్ర(51), టామ్ లాథమ్(53) అర్ద సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో కొలిన్ అకెర్ మన్ 69 పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 5 వికెట్లతో చెలరేగాడు.