అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. ఇక ఈ ఘనలు సోషల్ మీడియాలో పదే పదే రావడంతో.. సదరు వ్యక్తులు తప్పు చేసినట్లుగా ప్రజలు భావించే అవకాశం ఉంది. దీంతో ఇలాంటి ఘటనపై క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి సెలబ్రిటీలకు, పొలిటికల్ లీడర్లకు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వచ్చింది. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని స్పందించారు. భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకు, గిరిజన సమాజానికి మంత్రి తలసాని శుక్రవారం క్షమాపణలు చెప్పారు.
ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై స్పందించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆ రోజు సంఘటనతో ఎవరి మనోభావాలు అయిన దెబ్బతింటే వారికి క్షమాపణలు చెబుతున్నా అంటూ మంత్రి తలసాని తెలిపారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే? ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ కోసం కేటీఆర్ రావడంతో.. ఎక్కువ రద్దీ ఏర్పడింది. ఈ రద్దీలో ఓ వ్యక్తి మంత్రి తలసాని కాలు తొక్కడంతో.. అతడిని పక్కకు తోశారు తలసాని. ఆ వ్యక్తి ఎవరో కాదు.. భైంసా అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ రాజేష్ కుమార్. ఇక ఈ విజువల్స్ పదే పదే మీడియాలో రావడంతో.. దీనిపై స్పందించి.. రాజేష్ బాబుకు, గిరిజన సమాజానికి క్షమాపణలు చెప్పారు.
ఈ ఘటనపై తలసాని మాట్లాడుతూ..”స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ రోజు రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడు. దాంతో నా కాలుకు గాయమై రక్తమెుచ్చింది. ఆ సందర్భంగానే నేను ఆ వ్యక్తిని నెట్టి వేశాను. ఆ తర్వాత అతడు భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలియడంతో.. వెంటనే అతడికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను. నేను ఎప్పుడూ ఏ కులాన్ని తక్కువ చేయలేదు. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలను ముందుండి చేస్తాను. బేషజాలకు పోవాల్సిన పరిస్థితి ఇది కాదని, ఈరోజు జరిగిన ఘటనపై వాళ్ల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని మరోసారి కోరుతున్నా” అంటూ చెప్పుకొచ్చారు మంత్రి తలసాని. కాగా.. ఈ విషయాన్ని కావాలనే కొంత మంది పదే పదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదికూడా చదవండి: BIG BREAKING: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత!