iDreamPost

చంద్రబాబుకు కొడాలి నాని బంపరాఫర్‌

చంద్రబాబుకు కొడాలి నాని బంపరాఫర్‌

నా ఇల్లు – నా సొంతం.. నా స్థలం నాకు ఇవ్వాలి అంటూ టిడ్కో ఇళ్ల కేటాయింపుపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని బంపరాఫర్‌ ఇచ్చారు. పూర్తయిన రెండు లక్షల ఇళ్లు, 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు టీడీపీ నేతలు కోర్టుల్లో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. కేసులు వేసి స్టే తెచ్చిన తప్పులను ఒప్పుకుని ఆ స్టేలను తీసేయిస్తే.. వచ్చే నెల 21వ తేదీనే ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని నాని స్పష్టం చేశారు.

30 లక్షల ఇళ్ల పట్టాలు సహా రెండు లక్షల ఇళ్లను పేదలకు ఒకేసారి పంపిణీ చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తే చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారని నాని మండిపడ్డారు. గంటకు కోట్ల రూపాయల ఫీజు తీసుకునే లాయర్లను పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని కొడాలి విమర్శించారు. చంద్రబాబు తన హాయంలో ఒక్క ఇళ్లు కూడా పేదలకు ఇవ్వలేదని, తాము ఇస్తుంటే మాత్రం అడ్డుకునేందుకు 25 కోట్ల రూపాయలు లాయర్ల ఫీజులకు ఖర్చు చేశారని మండిపడ్డారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని నాని కొనియాడారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే బాబుకు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాలలో ముస్లిం ఆటో డ్రైవర్‌ కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హుందాగా రాజకీయాలు చేయాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి