iDreamPost

పరిపాలనా రాజధానికి మావోయిస్టుల ముప్పు

పరిపాలనా రాజధానికి మావోయిస్టుల ముప్పు

రాజధాని వికేంద్రీకరణ చర్చ మొదలైనప్పటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వాదన చేస్తున్నారు. పెట్టుబడులు, అభివృద్ధి లాంటి వాదనలు దాటి ఇప్పుడు విశాఖ సురక్షితం కాదనే స్థాయికి వెళ్ళారు.

ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిపాలన రాజధాని విశాఖపట్టణంలో పెడితే రక్షణ సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువ అని గతంలో అరకు ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపారని చెప్పారు.

రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించటానికి విశాఖ సురక్షితం కాదనే స్థాయికి వెళ్ళి వాదిస్తున్న అచ్చం నాయుడు రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతాడని మరోసారి నిరూపించాడు.

ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం దాదాపు శూన్యం, దళాల కదలికలు లేవు. అసలు ఒక నగరాన్ని ముట్టడించే శక్తి మావోయిస్టులకు ఎప్పుడు లేదు. విశాఖ గురించి మాట్లాడుతున్న అచ్చం నాయుడు హైదరాబాద్ కు సమీపంలో జరిగిన నాటి మంత్రి మాధవరెడ్డి హత్య, హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన IPS అధికారి ఉమేష్ చంద్ర హత్య గురించి మర్చిపోయినట్లున్నాడు.

అమరావతి ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోట. అమరావతికి సమీపంలోని గురజాల నియోజకవర్గం “గుత్తికొండ బిలం” లో నక్సల్ మొదటి సమావేశం జరిగింది, ఆ సమావేశానికి కాను సన్యాల్ కూడా హాజరయ్యాడు. వైయస్సార్ హయాంలో నక్సల్స్ తో జరిగిన చర్చల కోసం అడవుల నుంచి బయటకు వచ్చిన రామకృష్ణ తదితర నాయకులు ఇదే గుత్తికొండ వద్ద బహిరంగ సమావేశం పెట్టారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ పైన కూడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నక్సల్స్ దాడి చేశారు.

ఇవన్నీ గత సంఘటనలు, ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడా కూడ బలంగా లేరు. తెలంగాణా ఏర్పడితే మావోయిస్టులు బలపడతారు అని చేసిన ప్రచారం ఈ రోజు విశాఖకు మావోయిస్టుల ముప్పు ఉందన్న అచ్చం నాయుడు నాటాలకు ఏ మాత్రం తేడా లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి