iDreamPost

మణిపూర్‌లో మరో దారుణం.. మహిళపై BSF జవాన్‌ లైంగిక వేధింపులు!

  • Published Jul 26, 2023 | 12:38 PMUpdated Jul 26, 2023 | 12:49 PM
  • Published Jul 26, 2023 | 12:38 PMUpdated Jul 26, 2023 | 12:49 PM
మణిపూర్‌లో మరో దారుణం.. మహిళపై BSF జవాన్‌ లైంగిక వేధింపులు!

మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య రాజుకున్న వివాదం ఎంతటి అకృత్యాలకు దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. అల్లరి మూకలు మహిళలపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత వారిని నగ్నంగా ఊరేగిస్తూ.. దారుణ హింసాకాండకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ అమానుష ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, మణిపూర్‌ సీఎం స్పందించారు. జరిగిన దారుణం చూసి తమ గుండె ముక్కలయ్యిందని.. ఇందుకు బాధ్యులైన ఎవ్వరిని వదిలిపెట్టమని తెలిపారు. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ అమానుష చర్య మరవకముందే మరో దారుణం వెలుగు చూసింది. ఈ సారి ఏకంగా జవాన్‌ ఒకరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

ఈ సంఘటన ఒక కిరాణా స్టోర్‌లో చోటు చేసుకుంది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్‌.. అదే స్టోర్‌లో ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె చేయి పట్టుకుని లాగడమేకాక.. ఒంటి మీద చేయి వేసి అసభ్యంగా తాకుతూ ఆమెని ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె అతడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇక వీడియోలో ఉన్న వ్యక్తి సైనిక దుస్తులు ధరించి.. చేతిలో ఇన్సాస్‌ రైఫిల్‌ పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో జనాలు దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులే అనుకుంటే ఆఖరికి జనాలను కాపాడాల్సిన జవాన్‌లు కూడా మహిళలతో ఇలా ప్రవర్తించడం దారుణం అని కామెంట్స్‌ చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వీడియో వైరల్‌ అవ్వడం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో.. అధికారులు దీనిపై స్పందించారు. సదురు ఉద్యోగిని స​స్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు. ఇక ఈ ఉద్యోగిని బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సతీష్‌ ప్రసాద్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ జూలై 20న మణిపూర్‌ రాజధాని, ఇంఫాల్‌లోని ఒక పెట్రోల్‌ పంప్‌ సమీపంలోని దుకాణంలో చోటు చేసుకుంది. నిందితుడిని సస్పెండ్‌ చేసి.. అతడిపై కేసు నమోదు చేశాం అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి