iDreamPost

లక్ష్యం ప్లస్ లవ్ వెరసి సక్సెస్ – Nostalgia

లక్ష్యం ప్లస్ లవ్ వెరసి సక్సెస్ – Nostalgia

సాధారణంగా ప్రేమకథలో నీతి పాఠాలు లేదా జీవితంలో లక్ష్యాలను అందుకోవాలని చెప్పే సినిమాలు తక్కువ. ఎంతసేపు పెద్దల అడ్డంకులు, ప్రేమజంట వాళ్ళను ఎదిరించడాలు, క్లైమాక్స్ లో వాళ్ళు ఒక్కటి కావడం ఇవే ఉంటాయి. అలా కాకుండా ప్రతి యువకుడి లైఫ్ లో ఒక గోల్ ఉండాలని, దాన్ని అందుకునేందుకే ప్రేమ దోహదపడాలని చెప్పే కథాంశంతో రూపొందిన సినిమానే మనసిచ్చి చూడు. దాని విశేషాలు చూద్దాం. 1998లో నిర్మాత ఎడిటర్ మోహన్ దగ్గరికి దర్శకుడు సురేష్ వర్మ ఒక కథను తీసుకొచ్చారు. అప్పటికి అతను తీసింది ఒక సినిమా. జెడి చక్రవర్తితో సీరియస్ సబ్జెక్టుతో చేసిన ‘మృగం’ టెక్నికల్ గా పేరు తెచ్చింది కానీ కమర్షియల్ గా ఫ్లాపే.

రివర్స్ లో ప్రొడ్యూసర్ గా ఎడిటర్ మోహన్ అది మంచి స్వింగ్ లో ఉన్న సమయం. ‘బావ బావమరిది’తో మొదలుపెడితే చిరంజీవి ‘హిట్లర్’ దాకా ఆయన ఫ్లాపు చూసింది లేదు. యావరేజ్ అనుకున్నవి కూడా లాభాలు ఇచ్చేవి. అందుకే ఆయన బ్యానర్ ఎంఎల్ ఆర్ట్స్ అలా బయ్యర్ల దృష్టిలో ఒక మంచి బ్రాండ్ గా నిలిచింది. అలాంటి సంస్థ సురేష్ వర్మకు ఛాన్స్ ఇవ్వడం ఏమిటా అని అనుకున్నారందరూ. కానీ మోహన్ గారు ట్రాక్ రికార్డు చూడలేదు. సబ్జెక్టులో దమ్ము కనిపిస్తోంది. అందుకే ఆలస్యం చేయకుండా ఓకే అన్నారు. హీరో హీరోయిన్లుగా నవీన్ వడ్డే, రాశిలను ఎంపిక చేసుకున్నారు. కీలక పాత్రలకు రవితేజ, ప్రకాష్ రాజ్, సుహాసిని, శ్రీహరి తదితరులను ఎంచుకున్నారు. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా డిమాండ్ పీక్స్ లో ఉన్న మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.

పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయగా రాజేంద్ర కుమార్ సంభాషణలు సమకూర్చారు. చిన్నప్పుడే ఇష్టపడి తనను ప్రేమించిన యువకుడికి ఓ అమ్మాయి హితబోధ చేసి అతని టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా గమ్యం వైపు నడిపించడం అనే పాయింట్ యూత్ కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యింది. రవితేజ రియల్ ఎనర్జీ బయటికి వచ్చింది కూడా ఇందులోనే. ప్రకాష్ రాజ్ డైలాగులు బాగా పేలాయి. టైటిల్స్ నుంచి ఎండ్ కార్డు దాకా ఎమోషన్స్, లవ్, మ్యూజిక్ అన్నీ బాలన్స్ అయ్యేలా సురేష్ వర్మ తీర్చిదిద్దిన తీరు మనసిచ్చి చూడుని సూపర్ హిట్ చేసి వంద రోజుల దాకా నడిపించాయి. 1998 నవంబర్ 27న రాశి మరో సినిమా కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మితో పాటు రిలీజై నవీన్ వడ్డేకు రెండో చిత్రంతోనే కెరీర్ బెస్ట్ ఇచ్చింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి