iDreamPost

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం.. పోలీసుల అదుపులో నిందితుడు

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం.. పోలీసుల అదుపులో నిందితుడు

గంజాయి, డ్రగ్స్ దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారులు. వీటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చినప్పటికి పూర్తి స్థాయిలో అడ్డుకోలేక పోతున్నారు. మాదక ద్రవ్యాల మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికి కొందరు డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఇళ్లల్లోనే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారు. ఇదే రీతిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచి పోలీసులకు దొరికిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

డ్రగ్స్ వాడకం, రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికి కొందరు వ్యక్తులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ఘనుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్‌కు చెందిన హైదర్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద గంజాయి మొక్కలను పెంచుతున్నడు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయి సాగు చేస్తున్నాడు. సుమారు 31 గంజాయి మొక్కలను పెంచుతున్నడు.

అయితే ఈ విషయం ఏదోవిధంగా పోలీసుల వద్దకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు హైదర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో హైదర్ ఇంట్లోనే గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ మొక్కలను ధ్వంసం చేసి గంజాయి సాగు చేస్తున్న హైదర్ ను అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామ చేసి గంజాయి మొక్కలను అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి వాడినా, రవాణా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి