iDreamPost

మందుబాబులపై ‘మమతా’నురాగం

మందుబాబులపై ‘మమతా’నురాగం

లాక్ డౌన్ మద్యం ప్రియుల పాలిట శాపంగా మారింది. చుక్క వేయనిదే రోజు ప్రారంభం కానీ వారికి, రోజు ముగియని వారికి చుక్కలు చూపిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయలు, మందుల దుకాణాలు మినహా మిగతా అన్ని వ్యాపార, వ్యవహారాలకు లాక్ డౌన్ వర్తిస్తోంది. ఫలితంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి.

మద్యానికి అలవాటు పడిన మందుబాబులు మందు ను కూడా నిత్యావసర వస్తువుల జాబితాలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది మత్తు దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. మానసిక వైద్యశాలలు మందు బాబుల తో కిక్కిరిసిపోతున్నాయి. బ్లాక్ మార్కెట్, మద్యం దుకాణాల్లో దోపిడీలు జరిగాయి. ధర ఎంతైనా సరే చుక్క మందు కోసం ఖర్చు చేసేందుకు మద్యం ప్రియులు సిద్ధమవుతున్నారు.

మద్యం ప్రియుల బాధలను అర్థం చేసుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి కష్టాలను తీర్చే నిర్ణయం తీసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మందు బాబులపై కనికరం చూపారు. మద్యాన్ని ఆన్లైన్ లో విక్రయించేందుకు అనుమతులు మంజూరు చేశారు. సీఎం మమతా నిర్ణయంతో కష్ట కాలంలో అంతో ఇంతో ఆదాయం రావడంతో పాటు మద్యం ప్రియుల బాధలు తగ్గనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మందు కావాలని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే.. 2 గంటల నుంచి 5 గంటల వరకు మద్యం డీలర్లు సరఫరా చేస్తారు.

కేరళలో కూడా మందుబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. మద్యం దొరక్క కొంతమంది ఆత్మహత్య చేసుకోవడంతో కేరళ సర్కారు స్పందించింది. మద్యం తాగకపోతే ఉండలేమని.. డాక్టర్ వద్ద ధ్రువీకరణ పత్రం తీసుకువచ్చిన వారికి మద్యం విక్రయిస్తామని షరతు విధించింది. ఈ నెల 14 వ తేదీతో లాక్ డౌన్ విధించి మూడు వారాలు అవుతుంది. దీన్ని మరి కొన్ని రోజులు పొడిగించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం లో ఇతర రాష్ట్రాలలో కూడా మందును ఆన్లైన్ విక్రయాల ద్వారా అందుబాటులోకి తేవాలన్న డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి