iDreamPost

జగన్‌ కీలక నిర్ణయం… వైఎస్సార్‌ చేయూత పథకంలో భారీగా పెరిగిన లబ్ధిదారులు

జగన్‌ కీలక నిర్ణయం… వైఎస్సార్‌ చేయూత పథకంలో భారీగా పెరిగిన లబ్ధిదారులు

నిబంధనలను సరళతరం చేస్తూ, విధివిధానాల్లో లోపాలను సవరిస్తూ వీలైనంత మేరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నట్లు తాజాగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం బట్టి తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగన్న చేదోడు, జగన్న వసతి దీవెన వంటి నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 75 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 75 వేల రూపాయలు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ఈ పథకానికి ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఈ పథకానికి అమోదముద్ర వేస్తూనే మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక వస్తున్న వారికి ఈ పథకం వర్తించదంటూ ప్రారంభంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వితంతువులు, వికలాంగులు, ఒంటిరి మహిళలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వైఎస్సార్‌ చేయూత పథకం విధివిధానాల వల్ల వీరందరూ ఈ పథకానికి అనర్హలవుతున్నారు. ఈ నేపథ్యంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని వితంతులు, వికలాంగులు, ఒంటిరి మహిళలకు కూడా ఈ పథకం వర్తింపజేయాలి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీర్మానించారు.

తాజా నిర్ణయంతో ఈ పథకానికి అదనంగా 8 లక్షల మంది అర్హులవుతున్నారు. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీరించారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులు, వికలాంగులు, ఒంటిరి మహిళలు కాకుండా మిగతా వారు 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తాజాగా అర్హులయ్యే 8 లక్షల మందితో కలవడం ద్వారా ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని పేద మహిళలు 25 లక్షల మందికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ప్రజల జీవనప్రమాణాలు పెంపొందించే లక్ష్యంతో జగన్‌ ప్రవేశపెడుతున్న పథకాల జాబితాలో మరికొద్ది రోజుల్లో వైఎస్సార్‌ చేయూత కూడా చేరబోతోంది.

ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ ఈ పథకం ప్రకటించడం వెనుక ఓ చరిత్ర ఉంది. రోజు వారీ జీవనం సాగించేందుకు అవసరమైన వనరులు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని పేద కుటుంబాల్లో మహిళలు ఓ పక్క ఇంటి పని మరో పక్క కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పురుషుడుతో కలసి పోషిస్తుంటారు. పిల్లలు, కుటుంబ బాధ్యలతో వారు అలసిపోతున్నారు. 40 ఏళ్లు వచ్చే సరికి వారిలో శక్తి తగ్గిపోయి వృద్ధుల మాదిరిగా వారి పరిస్థితి తయారవుతోంది. పని ఎక్కువ, సరైన పౌష్టికాహారం లేక తక్కువ వయస్సులోనే వారు తనువు చాలిస్తున్నారు. అందుకే వారి సంక్షేమం కోసం 45 ఏళ్లకే ఫించన్‌ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు.

అయితే ఈ పథకంపై విమర్శలు, వ్యంగ్యోక్తులు వచ్చాయి. 45 ఏళ్లకే ముసలోళ్లు అయిపోయారా..? అనే వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపించాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూనే మహిళలకు మేలు చేయాలని జగన్‌ సంకల్పిచారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్‌ చేయూత పథకం అమలు పొందుపరిచారు. పింఛన్‌ బదులు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ త్వరలో నెరవేరబోతోంది. 25 లక్షల పైచిలుకు మహిళలకు ఏడాదికి దాదాపు 5 వేల కోట్ల రూపాయలు అందనున్నాయి. నాలుగేళ్లలో దాదాపు 20 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి