iDreamPost

MLAను వరించిన అదృష్టం.. లాటరీలో ఏకంగా రూ.7.5 కోట్ల ఫ్లాట్‌

  • Published Aug 16, 2023 | 11:30 AMUpdated Aug 16, 2023 | 11:30 AM
  • Published Aug 16, 2023 | 11:30 AMUpdated Aug 16, 2023 | 11:30 AM
MLAను వరించిన అదృష్టం.. లాటరీలో ఏకంగా రూ.7.5 కోట్ల ఫ్లాట్‌

ఈమధ్య కాలంలో కొందరి విషయంలో జీవితం చివరి దశలో ఉంది అనుకున్న వేళ.. అదృష్టం లాటరీ రూపంలో వరించి.. క్షణాల వ్యవధిలో నిరుపేదలను.. కోటీశ్వరులగా మార్చిన సంఘటనలు అనేకం చూశాం. మన దగ్గర కేరళలో ఇలా బంపరాఫర్‌ లాటరీలు నిర్వహిస్తుండగా.. ఇక విదేశాల్లో.. వందలు, వేల కోట్ల రూపాయల లాటరీలు నిర్వహిస్తుంటారు. ఇక గత కొంత కాలంగా ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన భారతీయలు.. భారీ లాటరీలు గెలుచుకున్న సంఘటనలు చూశాం. ఇక తాజాగా మరో వ్యక్తిని లాటరీ వరించింది. అతడు సామాన్యుడో, నిరుపేదో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సారి లాటరీ వరించిన వ్యక్తి ఓ ఎమ్మెల్యే. అది కూడా కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్‌ రూపంలో. మరి ఇంతకు ఎవరా ఎమ్మెల్యే అంటే..

మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేను ఈ అదృ‍ష్టం వరించింది. లాటరీలో భాగంగా సదరు ఎమ్మెల్యే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్లాట్‌ను గెలుచుకున్నారు. దీని విలువ కోట్ల రూపాయలు ఉంది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ) నిర్వహించిన లాటరీలో.. జల్నా జిల్లాలోని బద్నాపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ కుచే ఫ్లాట్‌ గెలుచుకున్నారు. సుమారు 1531 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ ఫ్లాట్ ముంబైలోని ఫ్లాట్ టార్డియోలోని క్రెసెంట్ టవర్‌లో ఉంది. ఇక దీని విలువ అక్షరాల 7.78 కోట్ల రూపాయలు.

లాటరీలో ఫ్లాట్ గెలుచుకోవడం పట్ల ఎమ్మెల్యే నారాయణ్ కుచే ఆనందం వ్యక్తం చేశారు. ఈ లాటరీలో ఫ్లాట్ రావడంతో.. ముంబై నగరంలో ఇల్లు ఉండాలనే తన కల నెరవేరిందని తెలిపారు. ముంబైలో తనకు ఇల్లు లేకపోవడంతో మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహించే లాటరీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఫ్లాట్ గెలిచినప్పటికి.. దాన్ని సొంతం చేసుకునేందుకు లోన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు నారాయణ్‌ కుచే.

క్రెసెంట్ టవర్ వద్ద ఉన్న ఈ ఫ్లాట్‌ను అధిక ఆదాయ వర్గాలైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ సభ్యులకు రిజర్వ్ చేశారు. ఇక ఈ ఫ్లాట్‌ కోసం నారాయణ్ కుచేకు మరో పోటీదారుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్ మాత్రమే ఉండటం విశేషం. ఇ‍క లాటరీలో నారాయణ్ కుచేనే అదృష్టం వరించింది. 2023 లో ప్రకటించిన హౌసింగ్ అథారిటీ లాటరీ విజేతలను ఎంహెచ్‌ఏడీఏ సోమవారం వెల్లడించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడే ఉన్నారు.

ఇక ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 4082 ఇళ్లకు లాటరీ నిర్వహించారు. ఇందులో 2790 ఇళ్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించగా.. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద మరో 1947 ఫ్లాట్లు కేటాయించారు. ఇక మిగిలిన వాటిలో తక్కువ ఆదాయం కలిగిన వర్గాల వారికి 1034 ఫ్లాట్లు కేటాయించారు. అలానే మధ్య ఆదాయ వర్గానికి 139.. అధిక ఆదాయం కలిగి ఉన్న వర్గాలకు 120 ఫ్లాట్లు రిజర్వ్ చేశారు. 4082 ఫ్లాట్లకు సంబంధించి 1,20,144 దరఖాస్తులను స్వీకరించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి