iDreamPost

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు కారణం ఎవరో చెప్పిన మద్రాస్‌ హైకోర్టు

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు కారణం ఎవరో చెప్పిన మద్రాస్‌ హైకోర్టు

తగ్గిందనుకున్న మహమ్మారి మళ్లీ విజృంభింస్తోంది. లక్షకు దగ్గరగా కేసులు వస్తేనే అమ్మో.. అనుకున్నాం.. ఇప్పుడు ఏకంగా రోజుకు మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. విజృంభజన, ఉధృతి.. ఇలా అనేక పేర్లు అయిపోయాయి. ఇప్పుడు కరోనా సునామీ అంటున్నాం. రేపు ఏ పేరుతో కరోనా వ్యాప్తిని వర్ణించాలో తెలియని పరిస్థితి.

అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు..? జాగ్రత్తలు పాటించని ప్రజలా..? కరోనాను లైట్‌ తీసుకున్న ప్రభుత్వాలదా..? ఎన్నికల పేరుతో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి సూపర్‌స్రైడర్లుగా మారిన రాజకీయ పార్టీలు, వాటి నేతలదా..? రాజకీయ నాయకులను కట్టడి చేయని ఎన్నికల సంఘానిదా..? అనే చర్చ కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం మద్రాస్‌ హైకోర్టు ద్వారా లభించింది. కరోనా సెకండ్‌వేవ్‌కు కేంద్ర ఎన్నికల సంఘమే కారణం అంటూ మద్రాస్‌ హైకోర్టు తేల్చింది. తమిళనాడులో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది.

తమిళనాడులో కరోనా వ్యాప్తికి కేంద్ర ఎన్నికల సంఘమే కారణం అంటూ తేల్చిన మద్రాస్‌ హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్‌ కేసులు ఎందుకు పెట్టుకూడదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారం పేరుతో రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే ఎందుకు నిలువరించలేదని ప్రశ్నించింది. బహిరంగ సభలు, ర్యాలీల వల్లనే కరోనా వ్యాప్తి పెరిగిందని తేల్చింది. రాజకీయ పార్టీలు ఇలా చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘం చోద్యం చూస్తోందా అంటూ కూడా మండిపడింది. వచ్చే నెల 2వ తేదీన కౌంటింగ్‌కు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ముందుగా బ్లూ ప్రింట్‌ ఇవ్వాలని ఆదేశించింది. కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా.. కౌంటింగ్‌ చేపడితే.. ఎన్నికలనే రద్దు చేస్తూ ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది మద్రాస్‌ హైకోర్టు.

మద్రాస్‌ హైకోర్టు తమిళనాడును దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా.. దేశంలో ఎన్నికలు జరిగిన ఇతర ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి. ఏప్రిల్‌ 11–24వ తేదీల మధ్య తమిళనాడులో 1,39,513 కొత్త కేసులు నమోదు కాగా.. కేరళలో 2,16,982 కేసులు పాండిచ్చెరిలో 8,534, పశ్చిమ బెంగాల్‌లో 1,17,563, అస్సాంలో 15,731 నూతన కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు ఏడో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29వ తేదీన చివరిదైన 8వ విడత పోలింగ్‌ జరగాల్సి ఉంది. వీటితోపాటు పలు రాష్ట్రాలలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా కరోనా కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతిలోని ప్రతి డివిజన్‌లోనూ కేసులు నమోదు కావడంతో.. నగరాన్ని కోవిడ్‌ కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఉప ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెల్లడికానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి