iDreamPost

భారత్ ను వణికిస్తున్న రాకాసి మిడతలు.. తెలుగు రాష్ట్రాలకు కూడా డేంజర్

భారత్ ను వణికిస్తున్న రాకాసి మిడతలు.. తెలుగు రాష్ట్రాలకు కూడా డేంజర్

కరోనా వైరస్ కష్ట కాలంలో భారత్ ను మరో డేంజర్ వణికించేస్తోంది. అదేమిటంటే రాకాసి మిడతల దాడి ఒక్కసారిగా ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఉత్తరాధి రాష్ట్రాలకే పరిమితమైన ఈ రాకాసిమిడతల దాడి తొందరలో దక్షిణాధి రాష్ట్రాలకు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపైన కూడా జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ అయిన ఓ సినిమాలో పాకిస్ధాన్ నుండి మిడతలను తెప్పించి దేశంలోని పంటలను నాశనం చేయించేందుకు విలన్ ప్లాన్ చేస్తాడు గుర్తుందా ? సరిగ్గా అలాంటి దాడే ఇపుడు దేశంలోని పంటలపై మొదలైంది.

రాకాసి మిడతల దాడి ఈ మధ్యనే కొత్తగా మొదలైంది. కాకపోతే సినిమాలో చూపినట్లుగా పాకిస్ధాన్ నుండి ఎవరో పంపగా మొదలైన సమస్య కాదు. ఆఫ్రికా ఖండంలోని ఇధియోపియా, సోమాలియా నుండి ఈ మిడతలు దాడి చేస్తున్నాయి. మనకు లాగే పాకిస్ధాన్ కూడా మిడతల దాడిలో బాగా దెబ్బతింటోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే మామూలుగా మొదలయ్యే సమస్యకన్నా ఇపుడు ముందే మొదలైపోయింది. దీని వల్ల లక్షలాది ఎకరాల్లో వేసిన పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి.

ఇప్పటికే ఉత్తరాధిలోని రాజస్ధాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో వేసిన లక్షలాది హెక్టార్ల పంటలు దెబ్బతినేశాయి. కోట్లాది మిడతలు కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఎగురుకుంటూ ఎంతదూరమైనా ప్రయాణిస్తాయి. అవి వస్తున్నపుడు చూడటానికే సినిమాలో సీన్ లాగ భయంకరంగా ఉంటుంది. ఇదే పద్దతిలో పై రాష్ట్రాల్లో దాడి చేశాయి. రాజస్ధాన్, మధ్యప్రదేశ్ లోని సుమారు 35 జిల్లాల్లో అన్నీ పంటలను మిడతలు ధ్వసం చేసేశాయి. రాజస్ధాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోని సుమారు 2.10 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలోని పంటలు నాశనమైపోయాయని అంచనా. ఒక్క రాజస్ధాన్ లో మాత్రమే సుమారు 5 లక్షల హెక్టార్లలోని పంటలను మిడతలు తినేశాయి.

మిడతల దాడి చేసినపుడు పళ్ళాలు, డబ్బాలు, కంచాలు ఇలా ఏది దొరికితే దాంతో శబ్దాలు చేసి వాటిని తరిమేయటమే ఏకైక మార్గం. ట్రాక్టర్ స్ప్రేయర్లు, ఫైర్ ఇంజన్లను ఉపయోగించి మందులను పిచికారి చేయటం ద్వారా కూడా మిడతలను తరిమేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఈసారి మాత్రం ద్రోన్లను ఉపయోగించటం ద్వారా ఆకాశంలోనుండే మిడతలను తరిమేసే మందులను పిచికారి చేయటానికి ప్రభుత్వాలు రెడీ అయ్యాయి. ఉత్తరాధి రాష్ట్రాల్లోని పంటలను నాశనం చేస్తున్న ఈ రాకాసి మిడతలు తొందరలోనే తెలుగు రాష్ట్రాలపైకి దాడి చేయవచ్చని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఎవరికీ అర్ధం కావటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి