iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 28 – లా

లాక్ డౌన్ రివ్యూ 28 – లా

సౌత్ లో ఓటిటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆలస్యం చేసిన శాండల్ వుడ్ నుంచి ఎట్టకేలకు మొదటి సినిమా ‘లా’ డిజిటల్ రిలీజ్ అందుకుంది. స్టార్ క్యాస్టింగ్ ఉన్న మూవీ కానప్పటికీ ప్రమోషన్ మెటీరియల్ చూశాక ఇదేదో ఆసక్తి కలిగించేలా ఉన్న కోర్ట్ డ్రామా అనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. దానికి తోడు టైటిల్ లోనే క్లియర్ గా ఉద్దేశమేంటో చెప్పడంతో ఇలాంటి జానర్ చిత్రాలను ఇష్టపడే వారు ఓ లుక్ వేసేలా చేసింది. మరి లా తన మీద పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

లా స్టూడెంట్ నందిని(రాగిణి ప్రజ్వల్)ఓ రాత్రిపూట కారు చెడిపోయి నిర్మానుష్యంగా రోడ్డు మీద ఉండగా ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడతారు. వాళ్ళు వెళ్ళిపోయాక నందిని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. కానీ స్పందన లేకపోవడంతో ఫేస్ బుక్ లో తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేస్తుంది. ఇది కాస్తా సంచలనంగా మారడంతో ప్రభుత్వం దీని విచారణ కోసం స్పెషల్ ఆఫీసర్ పార్థసారధి బ్రహ్మ(హెబ్బాలే కృష్ణ)ను నియమిస్తుంది.

అతను ఈ అఘాయిత్యానికి పాల్పడింది పెద్ద కుటుంబాలకు చెందిన కమలేష్(లిఖిత్), కాంతి(ఇమ్రాన్), భండారి(మధు)లుగా గుర్తించి చట్టం ముందు దోషులుగా నిలబెడతాడు. అయితే నిందితుల తరఫున ప్రముఖ లాయర్ శ్యామ్ ప్రసాద్(రాజేష్ నటరంగా) రంగంలోకి దిగడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిజంగా నందిని మీద రేప్ జరిగిందా, వాళ్ళను మీద నేరాన్ని ఎలా ఋజువు చేయించగలిగిందన్నదే అసలు స్టోరీ

నటీనటులు

డెబ్యూతోనే పెద్ద పాత్ర దక్కించుకున్న రాగిణి ప్రజ్వల్ గొప్పగా పెర్ఫార్మ్ చేయలేదు కానీ ఉన్నంతలో జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. నటన విషయంలో కొంత శిక్షణ ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా సన్నివేశాల్లో అనిపిస్తుంది. మంచి అందం, కళ ఉన్నప్పటికీ ఇలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు టైమింగ్ అండ్ ఎమోషనల్ బాలన్స్ చాలా ముఖ్యం. కానీ రాగిణి ఎక్స్ ప్రెషన్లు చాలా చోట్ల బ్లాంక్ గా ఉండటంతో తనతో ఆశించిన స్థాయిల్లో కనెక్ట్ కాలేకపోతాం. సీరియస్ సీన్లోనూ, బరువైన సన్నివేశంలోనూ ఒకే రకమైన అవుట్ ఫుట్ ఇవ్వడం రాగిణికున్న మెయిన్ మైనస్. ఇది మెరుగుపడకపోతే వీక్ స్క్రిప్ట్స్ లో తాను మరింత తేలిపోయే ప్రమాదం ఉంది. హీరో ఉండని ఇలాంటి కథల్లో మొత్తం తన భుజాల మీదే ఉందని రాగిణి గుర్తించి ఉంటే బాగుండేదేమో.

క్రిమినల్స్ తరఫున వకీలుగా నటించిన రాజేష్ నటరంగా తన సీనియారిటీతో పాత్రను నిలబెట్టాడు. కథలో కీలకంగా నిలిచే ముగ్గురు కుర్రాళ్లకు నటన పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు. విచారణాధికారిగా చేసిన హెబ్బాలే కృష్ణ తన ఉనికిని చాటుకున్నారు. జడ్జ్ గా ముఖ్యమంత్రి చంద్రు లేట్ ఏజ్ లోనూ తన వాడి తగ్గలేదని నిరూపించారు. తెలుగు వాళ్లకూ పరిచయమున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అచ్యుత్ కుమార్ ది గొప్ప పాత్ర కాదు కానీ అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయాడు. చంద్రముఖి పూజారిగా మనకు తెలిసున్న అవినాష్ ఏదో మొక్కుబడిగా కనిపిస్తారు తప్ప తనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ఇతర పాత్రల్లో నాగరాజ్ మూర్తి, మండ్య రమేష్ అక్కడక్కడా అవసరానికి మించి కొంచెం ఓవర్ చేశారు. హీరోయిన్ స్నేహితురాలిగా సిరి ప్రహ్లాద్ పర్వాలేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు రఘు సమర్థ్ ‘లా’ను ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలను కాన్సెప్ట్ గా తీసుకుని మంచి కోర్ట్ అండ్ క్రైమ్ డ్రామాగా తీర్చిదిద్దాలన్న ఆలోచన బాగుంది కానీ దానికి తగ్గ బలమైన కథనం రాసుకోవడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ గ్యాంగ్ రేప్ కు గురైతే దాని తాలూకు ఎమోషన్ కానీ సానుభూతి కానీ మనం ఎక్కడా ఫీలవ్వలేదంటే అది ముమ్మాటికీ స్క్రీన్ ప్లే లోపమే. చాలా సేపు పాత్రలు ఏదో మొక్కుబడిగా ప్రవర్తిస్తూ ఉంటాయి.

అంత సీరియస్ ఇష్యూ తెరమీద జరుగుతున్నా దాని తాలూకు ఫీల్ ఎక్కడా కనెక్ట్ కాదు. చాలా చిన్న లైన్ ని రెండు గంటల సేపు ఆసక్తికరంగా చెప్పాలన్న ఉద్దేశంతో రఘు చేసిన ప్రయత్నం బాగుంది కానీ ఇంకొంచెం స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టి ఉంటే ఇది ఖచ్చితంగా డీసెంట్ వాచ్ క్యాటగిరీలో పడేదే. అలా అని పూర్తిగా తీసిపారేసేది కాకపోయినా థియేటర్లో కాకుండా ఇంట్లోనే చూసినందుకు మాత్రం ఉరట కలుగుతుంది. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసేంత కంటెంట్ ఇందులో లేదు.

వాసుకి వైభవ్ సంగీతం పర్వాలేదు. ఉన్న ఒక్క పాటా ఫార్వార్డ్ చేసేందుకు ప్రేరేపిస్తుంది. ఇంపాక్ట్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వైభవ్ ఇవ్వలేకపోయారు. సుగ్నాన్ ఛాయాగ్రహణం బాగుంది. లో బడ్జెట్ లో డీసెంట్ అవుట్ ఫుట్ వచ్చేలా చక్కని పనితనం చూపించాడు. శ్రీకాంత్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నప్పటికీ ఇంకొంచెం ల్యాగ్ తగ్గించి ఉంటే బాగుండేది. స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నిర్మాణం గురించి చెప్పాల్సింది ఏమి లేదు. పెద్దగా ఖర్చు లేకుండా ఒకరిద్దరు తప్పించి అందరూ కొత్త మొహాలతో పని కానిచ్చేయడంతో ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ గా బయటపడ్డారు.

కంక్లూజన్

క్రైమ్ తో నడిచే కోర్ట్ డ్రామాలు పండాలంటే బలమైన మలుపులు, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. లాలో ఇవి చాలా మటుకు మిస్ అయ్యాయి. ఒక గ్యాంగ్ రేప్ ని ఋజువు చేయించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడమనే పాయింట్ లో కొత్తదనం లేనప్పటికీ తన టేకింగ్ తో మెప్పించాలనుకున్న దర్శకుడు రఘు సమర్ద్ ప్రయత్నం పూర్తి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సెకండ్ హాఫ్ కొంత వేగంగా సాగినప్పటికీ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే అంశాలు అంతగా లేకపోవడంతో లా ఎలాంటి ప్రత్యేకత లేకుండా నిలిచిపోయింది. ఇంకొంచెం టైట్ గా కథనం ఉంటే మంచి ఛాయస్ గా నిలిచేది. అయినప్పటికీ చేతిలో సమయం, ప్రైమ్ లో చందా ఉంది అనుకుంటే లా మీద లుక్ వేయొచ్చు. కాకపోతే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా సుమా.

చివరి మాట

లా – అంతా ‘లా’స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి