iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 67 – ప్రాణాలు తీసే ప్రేమ

లాక్ డౌన్ రివ్యూ 67 – ప్రాణాలు తీసే ప్రేమ

లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి ప్రేక్షకులు ఓటిటికి అలవాటు పడిన వేళ స్టార్లు సైతం వెబ్ సిరీస్ లు, యాంథాలజిల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అందులోనూ పేరు మోసిన డైరెక్టర్లు సైతం వీటిని తీసేందుకు ముందు రావడం రాబోయే కొత్త ట్రెండ్ ఏంటో చెప్పకనే చెబుతోంది. వెండితెరపై కమర్షియల్ భాషలో చెప్పేందుకు సాధ్యపడని సున్నితమైన అంశాలను వీటిలో స్పృశించే ప్రయత్నం గొప్పగా చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సిరీస్ పావ కధైగల్(పాపపు కథలు). మరి బాగా తెలుసున్న తారాగణం నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఇది నాలుగు కథల సమాహారం. అన్ని నలభై నిమిషాల లోపే ముగుస్తూ మొత్తం నిడివి రెండున్నర గంటల లోపే ఉండటంతో ఒకేసారి పూర్తి చేయొచ్చు. మొదటి కథ 80 దశకంలో ఓ పల్లెటూరిలో ఉండే హిజ్రాది. తను మనసు పడిన వాడు తన చెల్లిని ప్రేమించాడని తెలుసుకుని ఆ జంట కోసం తన ప్రాణం సర్వం త్యాగం చేసేందుకు సిద్ధపడతాడు. రెండో కథలో పరువు కోసం పాకులాడే ఓ తండ్రి స్వంత కూతురిని చంపుకుంటే మరో బిడ్డ తెలివిగా అతనికి బుద్ది చెబుతుంది.

మూడో కథలో పన్నెండేళ్ళ అమ్మాయి మానభంగానికి గురైతే ఆ తల్లితండ్రులు పడే క్షోభ కళ్ళకు కడుతుంది. నాలుగో కథలో కులాంతర వివాహం చేసుకున్న కూతురిని వెలివేసిన నాన్న శ్రీమంతం సాకుతో ఇంటికి పిలిచి ఏం చేశాడన్న పాయింట్ మీద సాగుతుంది. ప్రతి కథలోనూ ఊహించని ఓ మలుపు ఉంటుంది. అంతర్లీనంగా ఆలోచింపజేసే సందేశం కూడా పొందుపరిచారు. చాలా తక్కువ నిడివి కథాంశాలు కాబట్టి పూర్తిగా వాటిని వివరించడం భావ్యం కాదని చెప్పడం లేదు

నటీనటులు

పావై కధైగల్ కు ప్రధాన బలం క్యాస్టింగ్. సంఖ్య తక్కువైనా అందరూ ఇమేజ్ ఉన్న వాళ్ళనే ఎక్కువగా తీసుకోవడంతో ప్రతి ఎపిసోడ్ కు నిండుతనం వచ్చింది. ముందుగా చెప్పుకోవాల్సి వస్తే సాయి పల్లవి ధైర్యాన్ని మరోసారి మెచ్చుకోవాలి. క్రేజీ పాత్రలతో దర్శక నిర్మాతలు వెంటపడుతుంటే కేవలం అరగంట ఎపిసోడ్లో ముక్కు మొహం తెలియని యాక్టర్ పక్కన గర్భిణిగా నటించి శబాష్ అనిపించుకుంది. ఆమె తండ్రిగా ప్రకాష్ రాజ్ కూడా ఎక్కువ సంభాషణలు లేకుండా మనసులోనే క్రూరత్వాన్ని దాచుకున్న వ్యక్తిగా మెప్పించారు. తానే దర్శకత్వం వహించిన ఎపిసోడ్ లో గౌతం మీనన్ నటన పరంగానూ మంచి మార్కులు తెచ్చుకున్నారు.

చాలా గ్యాప్ తర్వాత మాజీ హీరొయిన్ సిమ్రాన్ కు ఈడొచ్చిన పిల్లల తల్లిగా మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. మునుపటి చార్మ్ లేకపోయినా పాత్ర డిమాండ్ కు తగ్గట్టు చాలా సహజంగా నటించేసింది. రెండో ఎపిసోడ్ లో డ్యూయల్ రోల్ చేసిన అంజలి కూడా ప్రశంసలకు అర్హురాలే. అవసరం లేకపోయినా ఓ సీన్ లో కొంత బోల్డ్ గా ఎందుకు చూపించారో. ఆమె తండ్రిగా పదం కుమార్ కూడా సూపర్ గా చేశాడు. బాలీవుడ్ నటి కల్కి కుచిన్ బాగా చేసింది. హిజ్రాగా చేసిన కాళిదాస్ జయరాం పర్ఫెక్ట్ ఛాయస్. శంతను భాగ్యరాజ్ తదితరులు చాలా సహజంగా ఆయా పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోయారు

డైరెక్టర్ అండ్ టీం

పరువు – ప్రేమ – హత్య ఈ మూడు అంశాల చుట్టూ నలుగురు అభిరుచి కలిగిన దర్శకులు ఒకే తరహాలో డీల్ చేసిన తీరు పావ కథైగల్ లోని మెయిన్ హై లైట్. ఆకాశం నీ హద్దురాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర తీసిన హిజ్రా ఎపిసోడ్ లో ఎమోషన్స్ ని చూపించిన తీరు బాగుంది. లైన్ సింపుల్ గానే అనిపించినప్పటికీ ఒక రకమైన టెంపో మైంటైన్ చేస్తూ నడిపించిన తీరు ఫైనల్ గా ఓకే అనిపిస్తుంది. అంజలి ద్విపాత్రాభినయం చేసిన రెండో ఎపిసోడ్ డైరెక్ట్ చేసిన విగ్నేష్ శివన్ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా కొత్త తరహా టేకింగ్ తో అలరిస్తాడు. ఎక్కువ సాగతీత అనిపించకుండా సాగిన ట్రాక్ ఇదే.

ఇటీవలి కాలంలో యాక్టర్ గానూ మెప్పిస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ డీల్ చేసిన వామగళ్ కథ కూడా డిఫరెంట్ గా ఉంది. షాకింగ్ అనిపించే ట్విస్ట్ తో క్లైమాక్స్ ని ముగించడం ఊహించనిది. తల్లితండ్రుల మానసిక ఆందోళన పతాక స్థాయికి చేరితే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణాలకు దారి తీస్తాయో బాగా చూపించారు. విచారణ, అసురన్ ఫేమ్ వెట్రిమారన్ హ్యాండిల్ చేసిన చివరి ఎపిసోడ్ లో పైన చెప్పిన మూడు కథలంత బలం లేకపోయినప్పటికీ సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ కు దాన్ని గట్టెక్కించారు. నిజ జీవిత కథ ఆధారంగా జరిగిందని ముందే చెప్పేశారు కాబట్టి కల్పనలకు అవకాశం లేకపోయింది.

దీనికి సాంకేతిక బృందం సమిష్టి కృషి బాగుంది. మధ్యలో స్లో ఎమోషన్ తో సాగే పాటలు ఫ్లోకి అడ్డుపడుతూ అవసరం లేదనిపించినప్పటికీ దర్శకుల కోణంలో ఎమోషన్ పండాలంటే వీటి సహాయం తీసుకోక తప్పదని వాటిని పొందుపరిచారు. జస్టిన్ ప్రభాకర్ తదితరులు సమకూర్చిన సంగీతం, తేని ఈశ్వర్-గణేష్ రాజవేలు-జొమోన్ టి జాన్ ఛాయాగ్రహణం చక్కగా సాగింది. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్ లో రాజీ పడలేదు. భారీ బడ్జెట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ డిమాండ్ చేయకపోయినా క్యాస్టింగ్, అవుట్ డోర్ న్యాచురల్ లొకేషన్స్ కోసం పెట్టిన ఖర్చు తెరమీద కనిపిస్తుంది.

కంక్లూజన్

యాంథాలజి అనేది విడి కథల కలయిక కాబట్టి మొత్తంగా ఎలా ఉందనే తీర్పు ఖచ్చితంగా ఇవ్వలేం. కాకపోతే ఓ విభిన్న ప్రయత్నంగా సమాజాన్ని ఇప్పటికీ పీడిస్తున్న పరువు హత్యలు, చావులను థీమ్ గా తీసుకుని ఈ దర్శకులు చేసిన ఈ వెబ్ సిరీస్ ఓసారి చూడదగినదే. బాగా డిస్ట్రబ్ చేసే ట్విస్టులను తట్టుకోగలిగితేనే ఇది ఓ మోస్తరుగా నచ్చుతుంది. అలా కాకుండా ఎంటర్ టైన్మెంట్ ని కోరుకుని కథనం వేగంతో పరుగులు పెట్టాలని చూసేవాళ్లకు మాత్రం నిరాశ తప్పదు. ఒక్కటి మాత్రం నిజం. బిగ్ స్క్రీన్ కున్న పరిమితులను ఓటిటి చక్కగా వాడుకుంటోంది. దానికి సాయి పల్లవి, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, సిమ్రాన్ లాంటి వాళ్ళు ఇందులో ఒక భాగం కావడంతో రాబోయే సరికొత్త ట్రెండ్ కు బలమైన శ్రీకారంగా కనిపిస్తోంది.

పావ కథైగల్ – ఆలోచింపజేసే పరువుకథలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి