iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 42 – బ్లడ్ క్లాస్

లాక్ డౌన్ రివ్యూ 42 – బ్లడ్ క్లాస్

బాలీవుడ్ లో డైరెక్ట్ రిలీజులతో పాటు సదరు డిజిటల్ సంస్థలే నిర్మిస్తున్న ఇండిపెండెంట్ సినిమాల తాకిడి ఉధృతంగా ఉంటోంది. ఈ క్రమంలో వచ్చిందే క్లాస్ అఫ్ 83. గత నెల ఓటిటి డెబ్యు చేసిన స్టార్ కిడ్ అభిషేక్ బచ్చన్ తరహాలో ఇప్పుడు బాబీ డియోల్ కూడా సీన్లోకి వచ్చేశాడు. ఇతను మొదటిసారి చిన్నితెరపై కనిపించిన మూవీ ఇదే. హై ఇంటెన్స్ మాఫియా కం పోలీస్ యాక్షన్ డ్రామాగా ట్రైలర్ నుంచే అంచనాలు పెంచుకున్న ఈ 98 నిమిషాల ఎంటర్ టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఈ స్టోరీ పూర్తిగా 80వ దశకంలో సాగుతుంది. పోలీస్ అకాడెమిలో డీన్ గా పనిచేసే విజయ్ సింగ్(బాబీ డియోల్)క్యాంపులో ఉన్న ఐదుగురు ట్రైనీ పోలీసులను ఎంచుకుని ముంబైని వణికిస్తున్న డాన్ కలేస్కర్ ని అతని గ్యాంగ్ ని తుదముట్టించే లక్ష్యంతో వాళ్ళకు శిక్షణ ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళు పోస్టింగ్ వచ్చాక ఎన్కౌంటర్ల పేరుతో ఒక్కొక్కళ్ళను చంపడం మొదలుపెట్టి నగర ప్రక్షాళన చేస్తారు. అయితే కలేస్కర్ కు ముఖ్యమంత్రి మద్దతు కూడా ఉండటంతో విజయ్ సింగ్ అనుకున్నవి పక్కదారి పడతాయి. అమాయకులైన కొందరు వ్యాపారులు ఈ యజ్ఞంలో బలవుతారు. ఇక లాభం లేదని ముల్లుని ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని అనుసరించి తన స్టూడెంట్స్ తో కలిసి విజయ్ సింగ్ కొత్త ప్లాన్ వేస్తాడు. అదేంటి, పోలీసులకు కనీసం ఫోటో కూడా దొరక్కుండా ఎక్కడో ఉన్న కలేస్కర్ ఎలా తిరిగి వచ్చాడు, ఆ తర్వాత ఏం జరిగిందన్నది స్క్రీన్ మీద చూడాలి

నటీనటులు

బాబీ డియోల్ లోని నటుడిని కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ముఖ్యంగా ఇలాంటి సీరియస్ పాత్రల్లో అతను ఎంత బాగా ఒదిగిపోతాడో గతంలోనే చాలా సార్లు చూశాం. ఇందులో వయసు మళ్ళిన పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా తన స్టామినాకు తగ్గ పాత్రను డిజైన్ చేయకపోవడం దర్శకుడి తప్పే. చాలాసేపు బాబీ నిర్లిప్తంగా కనిపిస్తాడు. భార్య తాలూకు విషాదం వల్ల అతను అలా మారాడని చూపించినప్పటికీ దానికి తగ్గ బలమైన ఎమోషన్ స్క్రీన్ ప్లేలో లేకపోవడంతో అదంతా పేలవంగా మారిపోయింది.

దీంతో బాబీ డియోల్ నిస్సహాయంగా కృత్రిమ హావభావాలు ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అతను గర్వంగా చెప్పుకునే సినిమా అయితే కాదు. ఇక ఇతని కంటే ఎక్కువ సేపు కనిపించే ఐదుగురు పోలీసులుగా కనిపించిన నటులు పర్వాలేదు అనిపించారు. క్యాస్టింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఒకరిద్దరు తప్ప ఆ రోల్స్ కి కావాల్సిన ఫోర్స్ ఎవరిలోనూ కనిపించదు. కీలకమైన విలన్ పాత్రలకు సైతం ఏదో మొక్కుబడిగా ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. విశ్వజిత్ ప్రధాన్ తప్ప మిగిలినవాళ్ళందరూ కొత్తవాళ్లు కావడంతో పాటు అనుభవలేమి తోడవ్వడంతో ఎవరూ మనకు రిజిస్టర్ కారు. ఇందులో ప్రధానమైన మైనస్ ఇదే

డైరెక్టర్ అండ్ టీమ్

ముంబై మాఫియా మీద అద్భుతమైన పుస్తకాలు రాసిన హుసేన్ జైదీ పుస్తకం ఆధారంగా దర్శకుడు అతుల్ సబర్వాల్ ఈ క్లాస్ అఫ్ 83ని రాసుకున్నాడు. సంఘంలోని అరాచక శక్తులను తన పరిధిలో ఏమి చేయలేక అసలు హీరో నిస్సహాయంగా మారినప్పుడు ఇతర పాత్రలతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనేది కొత్త పాయింట్ కాదు. సుభాష్ ఘాయ్ కర్మలో దిలీప్ కుమార్, అంతిమతీర్పులో కృష్ణంరాజులు చేసింది ఇదే. కాకపోతే అవన్నీ కమర్షియల్ సూత్రాలను మర్చిపోకుండా స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని హిట్లుగా మార్చినవి.

కానీ క్లాస్ అఫ్ 83ని రా అండ్ బోల్డ్ గా చెప్పాలనుకున్న అతుల్ ప్రయత్నం బ్యాడ్ రైటింగ్ వల్ల వాటి చెంతకు చేరలేకపోయింది. కేవలం 98 నిమిషాల నిడివిలో మొదటి అరగంట కథ ఎంతకీ ముందుకు సాగదు. అవసరం లేని ప్రహసనాలతో, సన్నివేశాలతో గడిచిపోతుంది. ఆ ఐదుగురికి పోస్టింగ్ వచ్చాక కథ పరుగులు పెట్టాలి. కానీ అక్కడక్కడా తప్ప మొత్తం ఎగుడు దిగుడుగా సాగుతుంది. ఇలాంటి నేపథ్యంతో వచ్చిన సినిమాల్లో ఇప్పటిదాకా సత్య, ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై, సర్కార్, షూట్ ఫుట్ ఎట్ లోఖండ్ వాలా లాంటివి ల్యాండ్ మార్క్ మూవీస్ గా నిలిచిపోయాయి. దీన్ని కూడా అదే కోవలో చేర్చాలన్న అతుల్ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. పఠాన్ ని హత్య చేసే సీన్, క్లైమాక్స్ కు ముందు భాగం తప్ప మిగిలినదేదీ ఒరిజినల్ బుక్ స్థాయిలో లేవు.

హుసేన్ జైదీ రాసిన పుస్తకంలోని అసలు ఆత్మను సినిమాటిక్ గా మార్చే ప్రయత్నంలో రైటింగ్ టీమ్ చేసిన పొరపాట్లకు తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇదేదో కొత్తగా థ్రిల్లింగ్ గా ఉందనిపించకుండా ఎన్నో చూశాం కదా అనిపించేలా క్లాస్ అఫ్ 83 సాగింది. ముఖ్యంగా ఇలాంటి జానర్ సినిమాలను విపరీతంగా ఇష్టపడే వాళ్లకు సైతం యావరేజ్ కన్నా ఓ మెట్టు కిందే అనిపిస్తుంది తప్ప అంతకన్నా ఇంప్రెషన్ ని కలగజేయదు. ఫైనల్ గా థియేటర్లలో మిస్ అయిపోయి ఇలాంటి సినిమాలు ఇంట్లోనే చూసే అవకాశం ఇచ్చినందుకు లాక్ డౌన్ కు థాంక్స్ చెప్పక తప్పదు

గుప్త్ లాంటి ఆల్ టైం మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన విజు షా ఇచ్చిన సంగీతం చాలా చప్పగా సాగింది. పాటలు లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఇచ్చాడు. మారియో పోలిజాక్ ఛాయాగ్రహణం పర్వాలేదు. అప్పటి రెట్రో లుక్ ని చూపించడం కోసం పాత సినిమాల ఫుటేజీను తీసుకుని కలర్ రీమాస్టరింగ్ చేయడమనే టెక్నిక్ అంతగా పండలేదు. మానస్ మిట్టల్ ఎడిటింగ్ అక్కడికే చాలా కష్టపడి లెన్త్ ని సాధ్యమైనంత కోత వేసింది కానీ అయినా కూడా ల్యాగ్ అనిపిస్తే అది తన తప్పు కాదు. షారుఖ్ ఖాన్ బ్యానర్ రెడ్ చిల్లీస్ నిర్మాణ విలువలు జస్ట్ ఓకే కానీ ప్రొడక్షన్ కన్నా ముందు స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది

కంక్లూజన్

ఇప్పటికే లెక్కలేనన్ని మాఫియా బ్యాక్ డ్రాప్ పోలీస్ యాక్షన్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు క్లాస్ అఫ్ 83లో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి మెచ్చుకోవడానికి ఏమి లేదు. మంచి పుస్తకాన్ని ఓ సాధారణ కాప్ మూవీగా మార్చిన దర్శకుడి పనితనం మీద అసహనం తప్ప. కథనంలో శ్రద్ధ తీసుకుని అవసరం లేని హంగులను పక్కనపెట్టి ఇంటరెస్టింగ్ గా దీన్ని తీర్చిదిద్ది ఉంటే ఇది ఖచ్చితంగా బాబీ డియోల్ కి బెస్ట్ డిజిటల్ ఎంట్రీ అయ్యేది. కానీ ఆ అవకాశం అతుల్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు బుక్ చదవకపోతే గంటన్నర సమయాన్ని ఎలాంటి కండీషన్లు లేకుండా దీని కోసం ఖర్చు పెట్టండి. లేదా జైదీ బుక్కుని ఇంకోసారి చదువుకుని రిలాక్స్ అవ్వండి

క్లాస్ అఫ్ 83 – లాస్ అఫ్ టైం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి