iDreamPost

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన నిమ్మగడ్డ, స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన నిమ్మగడ్డ, స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉల్లంఘించారు. ఏకపక్షంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే ఏపీ హైకోర్ట్ ఆదేశాలున్నప్పటికీ ఆయన ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వంతో చర్చించి, సామరస్య పూర్వకంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో పాటుగా వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ద శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్ ఈ సీతో మంతనాలు జరిపారు. ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యం, యూకే స్ట్రెయిన్ పరిస్థితిని వెల్లడించారు. అయినప్పటికీ వారి భేటీ ముగిసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ కొత్త షెడ్యూల్ సిద్ధం చేయడం విశేషంగా మారింది.

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ మూడేళ్లుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కాలేదు. అయినప్పటికీ నాటి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ కనీసం స్పందించిన దాఖలాలే లేవు. చివరకు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంది. అయితే అనూహ్యంగా దేశంలో కొన్ని చోట్ల కరోనా కేసులు నమోదయ్యాయయనే కారణం చూపించి అనూహ్యంగా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారు. ఈ విషయంలో ఎస్ఈసీ తీరుని సుప్రీంకోర్ట్ సైతం తప్పుబట్టింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది.

ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం పరిస్థితిని ఎస్ఈసీ దృష్టికి తెచ్చింది. కోర్టులో కూడా పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కోర్టు మాత్రం ప్రభుత్వంతో మంతనాలు జరిపి ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలనే రీతిలో సంకేతాలు ఇచ్చింది. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్పింది. అయినప్పటికీ నిమ్మగడ్డ కోర్టు ఆదేశాలను, ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణోలకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.

రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేసేందుకు సంకల్పించారు. పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ను విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. వాటికి సంబంధించి జనవరి 23,27,31 ,ఫిబ్రవరి 4 న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. ఎస్ ఈ సీ ఏకపక్ష నిర్ణయంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. మరోసారి ఏకపక్షంగా ఎస్ఈసీ వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి