iDreamPost

భూ రికార్డుల ప్రక్షాళనకు వేగంగా అడుగులు

భూ రికార్డుల ప్రక్షాళనకు వేగంగా అడుగులు

రీ సర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)కు అండగళ్‌కు మధ్య ఏపీలో భూ విస్తీర్ణం లెక్కలో దాదాపు ముప్పైమూడున్నర లక్షల ఎకరాలకు పైగా తేడా ఉంది. అంటే ఇప్పటి వరకు రెవిన్యూ రికార్డులకు ప్రామాణికంగా తీసుకుంటున్న ఆర్‌ఎస్‌ఆర్‌ కంటే ఇన్ని లక్షల ఎకరాల భూమి రికార్డుల్లోకి అదనంగా ఎక్కేసిందన్నమాట.

అమ్మకందారులు, కొనుగోలుదారుల పేరిట రీ ఎంట్రీలు నమోదు చేయడం దగ్గర్నుంచి, తల్లిదండ్రుల పేరిట రికార్డులు అలాగే ఉండి పిల్లల పేరిట కొత్తగా భూ రికార్డులు పుట్టుకురావడం వరకు దీనికి పలు కారణాలను రెవిన్యూ అధికారులు గుర్తించారు. అయితే వీటిని సరి చేసి స్వచ్ఛమైన రికార్డులను రూపొందించడం అత్యంత క్లిష్టమైన అంశం కాబట్టి పలు ప్రభుత్వాలు దీనిని యథాతథంగానే కొనసాగించేస్తున్నాయి. కానీ రోజురోజుకూ అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క రికార్డులు తప్పుల తడకగా ఉండడం, మరో పక్క ఎప్పటికప్పుడు సరి కొత్త రెవిన్యూ రికార్డులు పుట్టుకు వస్తుండడంతో వివాదాల పరిష్కారం తలనొప్పిగా మారుతోంది. చిన్నచిన్న రికార్డు లోపాలకు కూడా ఏళ్ళ తరబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.

దీంతో ఏపీ ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టింది. ప్రతి శనివారం సంబంధిత మండల తహసీల్దార్‌ తన పరిధిలోని రెవిన్యూ గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించాలని సీయం జగన్‌ ప్రభుత్వం నిర్దేశించింది. కోవిడ్‌ కారణంగా ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగినప్పటికీ తిరిగి ఇటీవలే మళ్ళీ మొదలైంది. ఈ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ముందుగా ప్రభుత్వ భూములను గుర్తిస్తారు. ఆ తరువాత పిటీషన్లు ఉన్న భూములను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలా దశల వారీగా చేపడుతున్న ఈకార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ఇప్పటికే పలు భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇందుకు అవసరమైన సర్వేయర్లను కూడా కొత్తగా ప్రభుత్వం నియమించింది. ప్రతి గ్రామసచివాలయం పరిధిలోనూ ఇక్కో సర్వేయర్‌ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు.

అయితే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో, ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనదైన భూమి కోసం ఏ విధంగా దరకాస్తు చేసుకునేందుకు తాపత్రయపడతామో? మనది కాని భూమి మన పేరిట నమోదైతే దానిని అంతే ఉదారంగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలోనే వివాదాలకు కారణాలేర్పడుతున్నాయంటున్నారు క్షేత్రస్థాయి రెవిన్యూ సిబ్బంది.

లోతైన పరిశీలన తరువాత ప్రధానంగా రెవిన్యూ అధికారులు రికార్డుల విషయంలో పలు సమస్యలను గుర్తించారు. వీటిలో ప్రధానాంశాలను ఇప్పుడు రికార్డుల స్వచ్ఛీకరణలో పరిష్కరిస్తున్నారు.

1) భూమితో సంబంధం లేని వ్యక్తి పేరు / విస్తీర్ణం నమోదై ఉండడం.

2) అమ్మకందారు/ కొనుగోలు దారులు ఇద్దరి పేర్లు నమోదై ఉండడం.

3) ఆర్‌ఎస్‌ఆర్‌ డైగ్లాట్‌నందు విస్తీర్ణం, హక్కుదారులు/ అనుభవదారుల పేర్లు సక్రమంగా నమోదు కాకపోవడం.

4) అడంగళ్‌లో అదనంగా వేరే సర్వే నంబరు నమోదైపోవడం.

5) తనది కాని భూమి తన ఖాతాలో నమోదైపోవడం.

6) మాన్యువల్‌ 1బీ/ పట్టాదారు పాసుపుస్తకంలో భూమి నమోదై ఉండి. ప్రస్తుత వెబ్‌లాండ్‌నందు సదరు భూమి వివరాలు నమోదుకాకపోవడం.

7) సర్వే నెంబరు నందు వెబ్‌ల్యాండ్‌లో విస్తీర్ణం తక్కువగా నమోదుకావడం.

8) అడంగళ్‌లో సర్వే నెంబరు నమోదు కాకపోవడం.

9) నోషనల్‌ ఖాతా ఉండి పట్టాదారునిగా, అనుభవదారునిగా ఒకే వ్యక్తి పేరు ఉండడం.

10) నోషనల్‌ ఖాతా ఉండి, భూమి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి పేరు అడంగళ్‌లో నమోదైనప్పుడు.

11) పట్టాదారు పాసు పుస్తకంలో ఖాతానెంబరు ఉండి వెబ్‌ల్యాండ్‌ అడంగళ్‌నందు నోషనల్‌ నెంబరులో సర్వే నెంబరు ఉన్నప్పుడు.

12) పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు నమోదులో తేడాలు.

13) ఒక వ్యక్తికి ఒక గ్రామంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెవిన్యూ ఖాతాలు ఉంటే సరి చేసుకోవాలి.

14) వచ్చిన పేరు/విస్తీర్ణం వివరాలే మళ్ళీ నమోదైన పక్షంలో.

15) చనిపోయిన పట్టాదారుల రికార్డులో నమోదైపోయిన పక్షంలో వారిని తొలగించి వారి వారసుల పేరున మ్యుటేషన్‌ చేయడం.

16) రిజిస్ట్రేషన్‌ ద్వారా భూమిని పొందినప్పటికీ అడంగళ్‌లో వారి పేరున మ్యుటేషన్‌ జరక్కపోతే మ్యుటేషన్‌ చేయడం.

17) అసైన్డ్‌ భూమి పొందినప్పటికీ ప్రస్తుతం వెబ్‌లాండ్‌ నందు పేర్లు నమోదు లేకపోవడం.

18) ఆధార్, మొబైల్‌ నంబరు, ఖాతా నంబరు నమోదులో పొరపాట్లు సరిచేయడం.

18) పట్టాదారుని కాలమ్‌లో పేర్లు నమోదు కాకుండా ‘‘శ్రీ’’ లేదా ‘‘రావు’’ వంటి పేర్లను మాత్రమే నమోదు చేసినట్టేయితే వాటిని సరి చేయడం.

19) రికార్డుల్లో పేర్లు తప్పు పడితే వాటిని సరిచేయడం.

20) అనుభవ స్వభావం తప్పుగా నమోదైతే వాటిని సరిచేస్తారు. అంటే ఆర్‌ఎస్‌డీ, కొనుగోలు, స్వంతం, వీలునామా, వారసత్వం, అగ్రిమెంటు తదితర స్వభావాల

తప్పులు కూడా మార్పు చేసుకోవచ్చు.

21) భూమి వర్గీకరణ (మాగాణి, మెట్ట) వివరాల్లో తేడాలుంటే సరిచేస్తారు.

ఇందుకోసం రైతులు తమ భూమికి సంబంధించి తమ వద్ద ఉన్న పత్రాలను రెవిన్యూ సిబ్బందికి సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా తహసీల్దార్‌ సమక్షంలోనే ఈ వివరాలన్నీ ఇస్తున్నందున పనులు వేగంగా పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందించారు. రికార్డుల ప్యూరిఫికేషనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఏళ్ళ తరబడి ఎదుర్కొంటున్న భూ రికార్డుల సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ప్రజలకు ఉచితంగా దక్కుతోంది. ఎన్నికల వేళ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు భూ సమస్యల పరిష్కారం వైపు తొలి అడుగు వేశారు. ఈ స్వచ్ఛీకరణ తర్వాత వచ్చే జనవరి నుంచి భూముల రీ సర్వే చేయనున్నారు. అయితే ప్రస్తుతం చేస్తున్న రికార్టుల స్వచ్ఛీకరణతోనే మెజారిటీ సమస్యలు తీరునున్నాయి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి