ఆటల్లో కొత్త ప్లేయర్లు అరంగేట్రం చేసినప్పుడు ఎవరూ అంతగా ఫోకస్ చేయరు. ఒకవేళ ఆయా ఆటగాళ్లు అంతకుముందు బాగా ఆడి ఇంటర్నేషనల్ లెవల్లోకి ఎంట్రీ ఇస్తుంటే మాత్రం అందరిలోనూ కాస్త ఆసక్తి ఉంటుంది. అదే పెద్దగా తెలియని ఆటగాడు ఆడుతున్నాడంటే మాత్రం పట్టించుకోరు. కానీ రిటైర్మెంట్ విషయంలో మాత్రం అందరిలోనూ బాగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ బాగా ఆడి, తమ గేమ్‌తో అందర్నీ మెప్పించిన వాళ్లు ఆటకు గుడ్‌బై చెబుతుంటే ఎవరూ తట్టుకోలేరు. అది ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్.. ఇలా ఏ ఆటనైనా కానివ్వండి. దేశానికి సేవలు అందించి, ఆటకు వన్నె తెచ్చిన ప్లేయర్ల నిష్క్రమణ అందరికీ బాధను మిగులుస్తుంది.
టాలెంట్‌తో ఇన్నాళ్లూ అలరించి మంచి పేరు తెచ్చుకున్న ప్లేయర్లు గేమ్ నుంచి తప్పుకుంటే ఫ్యాన్సే కాదు సీనియర్ ఆటగాళ్లు, విశ్లేషకులు కూడా బాధపడటం కామనే. ఇదిలా ఉంటే.. శ్రీలంక స్టార్ బ్యాటర్ ఒకరు రిటైర్మెంట్ ప్రకటించారు. లంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలతో పాటు 26 టీ20లు ఆడిన లాహిరు తిరిమన్నె అనూహ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇన్నాళ్లూ తాను ఎంతో నిబద్ధతతో దేశానికి ప్రాతినిధ్యం వహించానని.. ఇది చాలా కష్టమైన నిర్ణయం అని ఈ సందర్భంగా తిరిమన్నె అన్నాడు. రిటైర్ అవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఈ బ్యాటర్ చెప్పుకొచ్చాడు.
అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న తిరిమన్నె.. దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటనేది త్వరలోనే చెబుతానని పేర్కొన్నాడు. ఇంటర్నేషనల్ కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ తిరిమన్నె కృతజ్ఞతలు తెలిపాడు. 13 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఇక, 33 ఏళ్ల తిరిమన్నె మూడు ఫార్మాట్లలో కలిపి 5,543 రన్స్ చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లోనూ అద్భుతంగా రాణించిన ఈ స్టార్ బ్యాటర్ 6,007 రన్స్ చేశాడు. వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మంచి అనుభవం ఉన్న తిరిమన్నె తీసుకున్న ఈ నిర్ణయం లంక జట్టుకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
Lahiru Thirimanne announces his retirement from cricket.
We wish him all the best for his new journey. pic.twitter.com/TygWD5iwzg
— CricTracker (@Cricketracker) July 22, 2023