iDreamPost

ఇచ్చినమాట ప్రకారం వారినే రాజ్యసభకు ఎంపిక చేసిన కేసీఆర్

ఇచ్చినమాట ప్రకారం వారినే రాజ్యసభకు ఎంపిక చేసిన కేసీఆర్

టీఆరెస్ రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఖరారయ్యింది. టీఆరెస్ తరపున సీనియర్ నేత కే.కేశవరావు (కేకే ), మాజీ అసెంబ్లీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి లను రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈసారి తెలంగాణ నుండి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ రెండు స్థానాలను టీఆరెస్ సునాయాసంగా కైవసం చేసుకోనుంది. శనివారంతో రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ ముగియనుండటంతో, రాజ్యసభ స్థానాల కోసం అధికార టీఆరెస్ లో గట్టిపోటీ నెలకొని ఉండడంతో ఎట్టకేలకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఇరువురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. దీనితో టీఆరెస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యే అభ్యర్థులెవరనే ఉత్కఠతకి తెరపడింది.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన కే.కేశవరావు (కేకే ), కేఆర్ సురేష్ రెడ్డి లకు సమాచారం ఇవ్వడంతో వారు నామినేషన్ల పేపర్లు రెడీ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిరువురు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అసెంబ్లీ ఆవరణలో ఉన్న పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి సమక్షంలో తమ నామినేషన్లు ధాఖలు చెయ్యబోతున్నారు.

కే.కేశవరావు ఇప్పటికే టీఆరెస్ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. అయితే అయన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగియడంతో కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. కేకే గతంలో కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ ప్రసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ తరుపున పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా కూడా వ్యవహరించారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉండేది. అయితే 2012-13 లో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆరెస్ లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో మంచి మేధావిగా పేరున్న ఈయన టీఆరెస్ పార్టీ సిద్ధాంతకర్తగా రాజకీయ వ్యవహారాల్లో కేసీఆర్ కి సలహాలు సూచనలిస్తూ 2014లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించారు.

రాజ్యసభకు టీఆరెస్ అభ్యర్థిగా ఎన్నికైన మరో నేత కేతిరెడ్డి సురేష్ రెడ్డి సుధీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీలకు అతీతంగా కేఆర్ సురేష్ రెడ్డి కి సౌమ్యుడిగా వివాదారహితుడిగా మంచి పేరుంది. మాజీముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆశీస్సులతో చిన్న వయసులోనే కాంగ్రెస్ టికెట్ పొంది 1989 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కేఆర్ సురేష్ రెడ్డి ఆతరువాత వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డ్ సృష్టించాడు.

ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని వరుస విజయాలు సాధించిన అతికొద్ది మంది నేతలలో కేఆర్ సురేష్ రెడ్డి ఒకరు. 1994 ఎన్నికల్లో హైదరాబాద్ నగరం మినహాయించి మిగతా తెంగాణ ప్రాంతం నుండి కేవలం ఇద్దరే ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో కేఆర్ సురేష్ రెడ్డి ఒకరు. కాగా మరొకరు వరంగల్ జిల్లా డోర్నకల్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్యా నాయక్ మరొకరు. 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా కేఆర్ సురేష్ రెడ్డి వ్యవహరించారు. ఆసమయంలో అసెంబ్లీలో తన వ్యవహారశైలితో కేఆర్ సురేష్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకూండా స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన నేతగా పలువురి ప్రశంసలు అందుకున్నారు.

అయితే 2009 అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజనలో బాల్కొండ నియోజకవర్గంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో కేఆర్ సురేష్ రెడ్డికి మంచి పట్టున్న నందిపేట, మాక్లూర్ మండలాల పరిధిలో మెజారిరిటి గ్రామాలు ఆర్మూర్ నియోజకవర్గంలో చేరాయి. ఈనేపథ్యంలో ఆర్మూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కేఆర్ సురేష్ రెడ్డి వరుసకు తనకు అత్తగారయ్యే ఏలేటి అన్నపూర్ణమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి తరుపున టీఆరెస్ మద్దతు తో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చెయ్యడం అన్నపూర్ణమ్మకు కలసివచ్చింది. అదేవిధంగా 2014 లో కూడా టీఆరెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో సురేష్ రెడ్డి ఓటమి చెవి చూశారు.

వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కొన్నాళ్ళు రాజకీయంగా స్తబ్దుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలక సమయంలో టిఆర్ఎస్ తమ అభ్యర్ధుపేర్లు ప్రకటించిన తరువాత టీఆరెస్ లో చేరడం విశేషం. అయితే ఆ ఎన్నికల్లో టికెట్ కూడా ఆశించకుండా టీఆరెస్ కు మద్దతిచ్చిన కేఆర్ సురేష్ రెడ్డి కు భవిష్యత్ లో రాజ్యసభ నుండి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి