iDreamPost

కేశినేని సమన్యాయ రాజకీయం….!

కేశినేని సమన్యాయ రాజకీయం….!

సమకాలీన రాజకీయాల్లో సమన్యాయం అంటూ రాజకీయం చేసిన ప్రముఖ రాజకీయవేత్త ఎవరయా అంటే కచ్చితంగా చంద్రబాబునాయుడు పేరే వినిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్ర విభజనకు ముందు సమన్యాయం, రెండు కళ్లు అంటూ తనదైన రాజకీయం ప్రదర్శించారు. బహుశా అధినేత స్ఫూర్తితోనే అయ్యింటుంది… ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం విశాఖపట్నం గ్యాస్‌ దర్ఘుటన మృతుల ఎక్స్‌గ్రేషియా కేంద్రంగా సమన్యాయ రాజకీయం మొదలుపెట్టారు.

విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ అధినేత పెద్ద మనుసు చాటుకున్నాడంటూ సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ చర్యను హర్షించకపోగా…గోదావరి(కచ్చులూరు వద్ద) బోట్‌ యాక్సిడెంట్‌ ప్రమాదంతో ముడిపెట్టి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రయత్నించారు. కచ్చులూరు బోట్‌ ప్రమాదంలో మరణించిన వారికి సైతం కోటి రూపాయలు పరిహారం చెల్లించి ఉంటే బాగుండేది…ఇప్పుడయినా బ్యాలెన్స్‌ చెల్లించండి అంటూ డిమాండ్‌ చేశారు. దీంతో నష్టపరిహార ప్రకటననూ గతానికి ముడిపెట్టి లబ్ది పొందాలనే కేశినేని ప్రయత్నాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

గోదావరి పుష్కరాలు దుర్ఘటన(రూ.10 లక్షలు పరిహారం), తూర్పుగోదావరి జిల్లా నగరి వద్ద జరిగిన గెయిల్‌ గ్యాస్‌ విస్ఫోటనలకు(రూ.25 లక్షలు పరిహారం) సంబంధించి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భిన్న మొత్తాల్లో నష్టపరిహారం ప్రకటించింది. దీంతో ఇప్పుడదే విషయాన్ని పైకితెచ్చి కేశినేని నాని.. సమన్యాయం అంటే ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజంగా బాధితులకు మేలు చేయాలనే ఆలోచనే ఉంటే కేవలం కచ్చులూరు ప్రమాదానికే పరిమితం కాకుండా…పుష్కరాలు, నగరి గ్యాస్‌ ఘటనల మృతులకూ అదనపు పరిహారం డిమాండ్‌ చేసేవారని…కానీ, ప్రత్యేకించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలనే పోల్చడం వెనుక కేశినేని నాని ఉద్దేశం స్పష్టమవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అర్ధాంతరంగా, ఊహించని విధంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చింతించాల్సిన విషయమే…! అది గ్యాస్‌ దుర్ఘటనైనా…బోటు ప్రమాదమైనా….! అయితే ఈ రెండు ఘటనలను లోతుగా విశ్లేషిస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. బోటు ప్రమాదానికి సంబంధించి గోదావరిలో వరద కంటికి కనిపిస్తున్నప్పటికీ బోటు నిర్వాహకుల ప్రోత్సహించడం వల్లో లేదా ఏంకాదులే అనే అతి విశ్వాసం వల్లో…బాధితులు బోటెక్కారు. పైగా ప్రయాణంలో లైఫ్‌ జాకెట్లు అందుబాటులో ఉన్నా…వాటిని విప్పి పక్కనబెట్టారు. దీంతో ఆనాడు జరిగిన ప్రాణనష్టంలో స్వీయ నిర్లక్ష్యం కొంత స్పష్టవవుతోంది. కానీ, ప్రస్తుత గ్యాస్‌ దుర్ఘటనలో ప్రజలు ప్రమేయం మీసమెత్తుకూడా లేదు…ఎవరింట్లో వాళ్లుండగా మృత్యువు కబళించింది. కాబట్టి పరిహారంలోనూ ఈ విషయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సిందే.

ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వాన్ని ఎల్లవేళలా విమర్శించాల్సిన అవసరం లేదు. చెడును విమర్శించాలి…మంచిని హర్షించాలి..? ఆధునిక ప్రతిపక్ష నాయకులు హర్షించటం అనే మాటను పక్కనపెట్టి….అర్థం పర్థం లేని విమర్శలతో మంచిని సైతం విమర్శకు వాడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా విమర్శించాలనే లక్ష్యంతో మోకాలుకీ బోడిగుండికీ ముడిపెట్టి సరికొత్త డిమాండ్‌లను పైకి తెస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని సమన్యాయం ముఖ్యమంత్రిగారూ అంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి