iDreamPost

తల్లిదండ్రులకు అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

  • Published Mar 29, 2024 | 5:41 PMUpdated Mar 29, 2024 | 5:41 PM

KVS Admission 2024-25: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌ కోసం ఎదురు చూస్తోన్న తల్లిదండ్రులకు శుభవార్త. పూర్తి వివరాలు మీ కోసం..

KVS Admission 2024-25: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌ కోసం ఎదురు చూస్తోన్న తల్లిదండ్రులకు శుభవార్త. పూర్తి వివరాలు మీ కోసం..

  • Published Mar 29, 2024 | 5:41 PMUpdated Mar 29, 2024 | 5:41 PM
తల్లిదండ్రులకు అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

చదువు లేకపోతే భవిష్యత్తు అంధకారం. మరి నాణ్యమైన విద్య అనేది నేటి కాలంలో సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. నర్సరీ నుంచే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు భరించలేం.. గవర్నమెంట్‌ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందదనే బాధ. అదుగో అలాంటి వారి కోసమే ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలలకు ఎంతో క్రేజ్‌ ఉంది. చాలా తక్కువ ఫీజుతో.. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తాయనే పేరు, గుర్తింపు తెచ్చుకున్నాయి కేవీలు. ఈ స్కూళ్లలో అడ్మిషన్స్‌కు విపరీతమైన పోటీ ఉంటుంది. ఇక ప్రతి ఏటా 1 నుంచి 11 వ తరగతి ప్రవేశాల కోసం కేవీలు షెడ్యూలు విడుదల చేస్తాయి. ఈ ఏడాదికి సంబంధించి కూడా షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్‌) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం అవుతుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకటో తరగతి అడ్మిషన్‌ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతుల అడ్మిషన్లకు కూడా వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ వంటి అంశాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా సెలక్ట్‌ చేస్తారు. అయితే 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. ఏం సబ్జెక్ట్స్‌ ఉంటాయి.. ఎన్ని మార్కులు అనే దానికి సంబంధించిన వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న రిలీజ్‌ చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూడు జాబితాల ద్వారా ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

కేవీల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతికి తప్ప) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు.

11వ తరగతి అడ్మిషన్ల కోసం..

అలాగే.. 11వ తరగతి తప్ప మిగతా క్లాస్‌ల వారి అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాల కోసం పదో తరగతి రిజల్ట్‌ కోసం వేచి ఉండాలి. టెన్త్‌ క్లాస్‌ ఫలితాలు వచ్చిన తర్వాత 10 రోజుల్లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. 11వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ముందుగా కేవీ విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అప్లై చేసుకునే సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని కేవీఎస్‌ వెల్లడించింది.

ముఖ్యమైన తేదీలు :

  • ఫుల్‌ నోటిఫికేషన్‌ విడుదల : మార్చి 31, 2024
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 1, 2024
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్‌ 15, 2024
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా రిలీజ్‌: ఏప్రిల్‌ 19, 2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి