iDreamPost

ఏకగ్రీవమైన కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు

ఏకగ్రీవమైన కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాజకీయవర్గాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకి వచ్చిన బెదిరింపు కాల్స్ పెను దుమారాన్ని రేపుతున్నాయి.కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి,మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్ ఖర్గే,ఆయన కుమారుడు ప్రియాంక్ తమకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

కర్ణాటక డిజిపి ప్రవీణ్ సూద్ కు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో ప్రియాంక్ ఖర్గే జూన్ 7 న తమ కుటుంబానికి చెందిన ల్యాండ్ లైన్ నెంబర్‌కు కాల్ వచ్చిందని, దానిని తన తండ్రి అందుకున్నారని తెలిపారు. ఫోన్‌లో అవతలవైపు మాట్లాడిన వ్యక్తి రాబోయే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు బెదిరించాడు. అదే సమయంలో ఉదయం 12:36 మరియు 12:53 మధ్య అపరిచిత నెంబర్‌ నుండి తన సెల్ ఫోన్‌కు కనీసం 10 మిస్డ్ కాల్స్ వచ్చాయని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. బెదిరింపు కాల్స్ కొనసాగినప్పుడు అజ్ఞాత వ్యక్తి తెల్లవారుజామున ఒంటిగంటకు ఫోన్ చేసి మళ్లీ తమ కుటుంబాన్ని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరోవైపు అజ్ఞాత వ్యక్తి హిందీ,ఇంగ్లీషు భాషలలో మాట్లాడినట్లు ప్రియాంక్ ఖర్గే తెలిపాడు.అపరిచిత నెంబర్‌లను గుర్తించి,తమను బెదిరించి భయాందోళనలకు గురి చేస్తున్న అజ్ఞాత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర పోలీసులను అభ్యర్థించాడు.ఇదిలావుండగా ఈ విషయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పను డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను బెదిరించడం గురించి ఒకపక్క చర్చ నడుస్తుండగా మరోవైపు నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 19న నిర్వహించాల్సిన రాజ్యసభ ఎన్నికల కోసం మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సహా ఐదుగురు నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్‌ల పరిశీలన దశలో స్వతంత్ర అభ్యర్థి సంగమేశ్ చిక్కనరగుండ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.

దీంతో నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులు మాత్రమే తుది పోటీలో నిలిచారు.కావున ఎన్నికలు నిర్వహణ అవసరం లేదు.అయితే అభ్యర్ధులకు నామినేషన్‌ల ఉపసంహరణకు ఈ నెల 12 వరకు గడువు ఉంది.నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం ఐనప్పటికి ఉపసంహరణ గడువు ముగిచిన తర్వాత రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంకే విశాలాక్షి లాంఛనంగా ప్రకటించనున్నారు. జేడీఎస్ నేత దేవె గౌడ, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ నేతలు ఈరన్న కదడి,అశోక్ గస్టి నలుగురు రాజ్యసభకు ఎన్నికైనట్లలేనని ఎన్నికల అధికారులు తెలిపారు.

కర్ణాటకలో నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీవ్ గౌడ (కాంగ్రెస్), బీకే హరి ప్రసాద్ (కాంగ్రెస్), ప్రభాకర్ కోరే (బీజేపీ), కుపేంద్ర రెడ్డి (జేడీఎస్) యొక్క పదవీ కాలం ఈ నెల 25న ముగుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి