iDreamPost

యడ్యూరప్ప ముంగిట మరో గండం

యడ్యూరప్ప ముంగిట మరో గండం

యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి కలిసొచ్చినట్లు లేదు. అందినట్లే అంది చేజారిపోతూ ఉంటుంది. తాజా పరిస్థితులు పదవీకాలం పూర్తయ్యేంతవరకు కూర్చిలో కూర్చోనిచ్చేలా కనిపించడం లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. న్యాయస్థానాల్లో ఆయనకు ప్రతికూల తీర్పులు వెలువడుతుండడంతో ముఖ్యమంత్రి మార్పు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. కాగా… యడ్యూరప్ప మాత్రం వచ్చే రెండేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తన దాఖలైన కేసులను కొట్టివేయాలని, విచారణను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన యడ్యూరప్పకు ఎదురుదెబ్బతగిలింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు కోరుతూ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బెంగుళూరులోని వార్తూల్ వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఐటీ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని అక్రమంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు కోసం డీనోటిఫై చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2006లో బీజేపీ జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో డీనోటిఫై చేయగా 2013లో ఆయనపై లోకాయుక్తలో కేసు నమోదైంది.

క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మైకేల్ కున్హా నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పేలవంగా సాగిందని వ్యాఖ్యానించిన కోర్టు ప్రజా ప్రతినిధుల క్రిమినల్ నేరాలపై సీరియస్ గా వ్యవహరించాలని లోకాయుక్తకు సూచించింది. యడ్యూరప్ప అవినీతి కేసును లోకాయుక్తనే విచారణ జరుపాలని హైకోర్టు సూచించింది. కాగా… గతంలోనే లోకాయుక్త అవినీతి విషయంలో యడ్యూరప్ప పాత్రపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అవినీతి కేసు విచారణ వేగవంతమైతే యడ్యూరప్పకు చిక్కులు తప్పవని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు దిశలో ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యడ్డీ తీరుపై అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే… రాజ్య సభ సభ్యుల ఎంపిక విషయంలోనూ ఆయన చేసిన సిఫారసులను పట్టించుకోలేదని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు కూడా అనుమతి ఇవ్వడంలేదని తెలుస్తోంది. యడ్యూరప్పను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని పార్లమెంటరీ వ్వవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. యడ్యూరప్ప మాత్రం ముఖ్యమంత్రి మార్పు జరగబోదని, వచ్చే రెండేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజలు అవినీతి ఆరోపణలను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు.

యడ్యూరప్పకు మొదటి నుంచీ ముఖ్యమంత్రి కలిసిరావడం లేదు. 2007లో యడ్యూరప్ప తొలిసారి సీఎం కుర్చీని దక్కించుకున్నారు. నిండా ఎనిమిది రోజులు కూర్చిలో కూర్చోకుండానే పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. 2008లో రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా మూడేళ్ల పాటు మాత్రమే అధికారం చెలాయించగలిగారు. అవినీతి ఆరోపణలతో 2011లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. చివరగా 2018లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా ప్రభుత్వం మైనార్టీలో పడడంతో మళ్లీ రాజీనామా చేశారు. 2019లో ముఖ్యమంత్రి కుర్చీ దక్కినా  ఇప్పుడు అవినీతి ఆరోపణలతో మరోమారు ఆయన మెడకు చిక్కుకున్నాయి. మరి ఈ సారైనా గండం నుంచి బయటపడతారో లేదో వేచిచూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి