iDreamPost

హిజాబ్‌ తర్వాత మరో వివాదం..!

హిజాబ్‌ తర్వాత మరో వివాదం..!

కర్ణాటకలో హిజాబ్‌ వివాదం ముగిసిందని భావిస్తుండగా.. మరో కొత్త అంశంపై వివాదం చెలరేగుతోంది. ‘హలాల్‌’ మాంసాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ కొన్ని రైట్‌వింగ్‌ గ్రూపులు హిందువులకు పిలుపునివ్వడం వివాదానికి దారితీస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారం విస్తృతంగా సాగుతుండడంతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించడం తో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ‘హలాల్‌’ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం చెప్పడంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆయా గ్రూపులు చేస్తున్న డిమాండ్‌ పై ప్రభుత్వం అధ్యయనం చేసి, వారు చెబుతున్నది నిజమా..? కాదా..? అంచనా వేస్తుందని చెప్పారు. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టతనిస్తుందని తెలపడంతో హిజాబ్‌ తరహాలోనే హలాల్‌ అంశంపై కూడా వివాదం నెలకొనే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నిషేధం విధించాలంటూ బీజేపీ డిమాండ్‌..

హిందువులు హలాల్‌ మాంసాన్ని బహిష్కరించాలంటూ రైట్‌ వింగ్‌ గ్రూపులే కాదు.. బీజేపీ నేతలు కూడా పిలుపునిస్తున్నారు. రైట్‌వింగ్‌ గ్రూపుల కన్నా.. బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకు వేశారు. హలాల్‌ మాంసంపై నిషేధం విధించాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. హలాల్‌ ఆహారాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిటీ రవి ‘ఎకనామిక్‌ జిహాద్‌’గా అభివర్ణించడంతో ఈ అంశంపై కమలం పార్టీ ఎలాంటి వైఖరితో ఉందో తెలుస్తోంది. ఇదొక జిహాద్‌గా ముస్లింలు వాడుకుంటున్నారని, అలా వాడుకోవడం కుదరదని చెప్పడంలో తప్పేముందని సిటీ రవి ప్రశ్నిస్తున్నారు. హిందువుల నుంచి మాంసం కొనేందుకు ముస్లింలు నిరాకరిస్తున్నప్పుడు, మా దగ్గర మాంసం కొనాలని హిందువులను వారు ఎలా అడుగుతారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తుండడంతో అతి త్వరలో హలాల్‌ అంశం చుట్టూ వివాదం నెలకొనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంకా చల్లారని హిజాబ్‌ వివాదం..

కర్ణాటకలో రెండు నెలల క్రితం మొదలైన హిజాబ్‌ వివాదం ఇంకా ముగిసిపోలేదు. విద్యా సంస్థల్లోకి హిజాబ్‌ ధరించి రావడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. విద్యా సంస్థల్లో వివాదాలు చెలరేగాయి. విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. విద్యా సంస్థల నియమ నిబంధనలను పాటించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశం ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. తాజాగా కర్ణాటకలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థులను అనుమతించిన ఏడుగురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో కలకలం రేగింది. హిజాబ్‌ అంశం ఇలా ఉండగానే.. హలాల్‌ మాంసంపై వివాదం నెలకొనడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన కొన్ని వర్గాల్లో నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి