iDreamPost
android-app
ios-app

టీమిండియా క్రికెటర్లకు అహంకారం ఎక్కువైంది: మాజీ కెప్టెన్‌

  • Published Jul 31, 2023 | 1:01 PM Updated Updated Jul 31, 2023 | 3:53 PM
  • Published Jul 31, 2023 | 1:01 PMUpdated Jul 31, 2023 | 3:53 PM
టీమిండియా క్రికెటర్లకు అహంకారం ఎక్కువైంది: మాజీ కెప్టెన్‌

భారీగా డబ్బు రావడంతో టీమిండియా క్రికెటర్లకు అహంకారం పెరిగిపోయిందని టీమిండియా మాజీ కెప్టెన్‌, 1983 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టు సారథి కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ డబ్బు కొన్నిసార్లు అహంకారం తీసుకొస్తుందని, ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు తమకంతా తెలుసని అనుకుంటున్నారని కపిల్‌ మండిపడ్డారు. అయితే.. కపిల్‌ ఆగ్రహంలో ఏమాత్రం తప్పులేదని భారత క్రికెట్‌ అభిమానులు సైతం ఆయనకు మద్దతు పలుకుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం టీమిండియా దారుణ ప్రదర్శనే కారణం. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో నెగ్గిన భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే గెలిచి, రెండో వన్డేలో ఓడింది.

అయితే.. వెస్టిండీస్‌ పర్యటన కంటే ముందు ఇంగ్లండ్‌లోని ఓవల్‌ లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడింది. ఆ ఫైనల్‌లో టీమిండియా చిత్తుగా ఓడి.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌ కావాల్సిన అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఓటమిపై స్పందించిన కపిల్‌ దేవ్‌.. భారత క్రికెట్‌ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మితిమీరిన డబ్బుతో వాళ్ల కళ్ళు నెత్తికి ఎక్కాయని, తమకు అంతా తెలుసని వాళ్లు అనుకుంటున్నారు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా పరిస్థితి బాగాలేనప్పుడు.. అక్కడే ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ను ఏ ఒక్కరూ కూడా కనీసం సంప్రదించలేదు. ఆటలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలా ఆడాలనే విషయంలో ఒక మాజీ క్రికెటర్‌ సూచనలు తీసుకునేందుకు కూడా ఏ ఒక్క క్రికెటర్‌ ముందుకు రాలేదని కపిల్‌ మండిపడ్డారు.

ఈ విషయంపై గతంలో సునీల్‌ గవాస్కర్‌ సైతం మాట్లాడారు. ఒక మాజీ క్రికెటర్ నుంచి సలహాలు తీసుకోవడానికి టీమిండియా క్రికెటర్లు సిద్ధంగా లేరు. అసలు వారికి మాజీలతో ఎలాంటి అవసరం లేదని ఫీలవుతున్నారని పేర్కొన్నాడు. ఇప్పుడు కపిల్‌ కూడా ఇదే విషయమై టీమిండియా క్రికెటర్లను తప్పుబట్టారు. కాగా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిన టీమిండియా ఇప్పుడు వెస్టిండీస్‌ లాంటి బతికి చెడ్డ టీమ్‌పై కూడా ఓటమి పాలైంది. రెండో వన్డేలో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో మరో సారి టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం వెస్టిండీస్‌పై కూడా గెలవలేని జట్టు వరల్డ్‌ కప్‌ ఎలా సాధిస్తుందంటూ మండిపడుతున్నారు క్రికెట్‌ అభిమానులు. కోహ్లీ, రోహిత్‌ లేకుంటే.. ఓ సాధారణ టీమ్‌లో టీమిండియా ఉందని అంటున్నారు. అయితే.. ఓ సీనియర్‌ క్రికెటర్‌గా సునీల్‌ గవాస్కర్‌ సలహాలను రోహిత్‌, కోహ్లీ తీసుకోలేదనే కోపం కూడా క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: చాహల్‌ను పిచ్చికొట్టడు కొట్టిన రోహిత్‌! చూసికూడా ఆపని కోహ్లీ