iDreamPost

వాహ్ డైలాగ్ అంటే ఇది – Nostalgia

వాహ్  డైలాగ్ అంటే ఇది – Nostalgia

ఇప్పుడంతా ట్రెండీ యుగం. హీరో అల్ట్రా స్టైలిష్ గా ఉంటూ రెండు మూడు సులువైన డైలాగులు చెప్పేసి, ఈజీగా ఫైట్లు చేసేసి, నాలుగు కామెడీ ట్రాక్స్ పండించేసి పని కానిచ్చేస్తున్నాడు. నటన పరంగా పెద్దగా ఛాలెంజ్ గా ఫీలయ్యే సబ్జెక్టులు దర్శకరచయితలు తయారు చేయడం లేదు, అటు రిస్క్ అనిపించేవి హీరోలూ ట్రై చేయడం లేదు. అప్పుడెప్పుడో యాభై ఏళ్ళ క్రితం వచ్చిన దానవీర శూరకర్ణలో ‘ఏమంటివి ఏమంటివి జాతి నెపమున’ అంటూ ఎన్టీఆర్ గుక్కతిప్పుకోకుండా చెప్పే సంభాషణకు అప్పట్లో థియేటర్లు చప్పట్లతో మారుమ్రోగిపోయేవి. ఇప్పటికీ తెలుగు వాచకం బాగా రావాలంటే దీన్ని ప్రాక్టీసు చేసే హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు.

అయినా ‘ళా’కు ‘లా’ కు తేడా తెలియని ఇప్పటితరం నుంచి అంత అవుట్ పుట్ ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే కేవలం డివిఎస్ కర్ణనే ఇలాంటి వాటికి ప్రాతిపాదికన తీసుకుంటాం కాని నటశేఖర్ కృష్ణ కూడా ఇలాంటివి ఎన్నో చేశారు. టక్కున చెప్పమంటే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంది కాని దానికి ధీటుగా నిలిచే మరో ఉదాహరణ ఇది.

1984లో కృష్ణ, శ్రీదేవి జంటగా “కంచు కాగడా” అనే భారీ సినిమా వచ్చింది. ఆధునిక యుగంలోనూ రాచరిక పాలన సాగించే దుర్మార్గుల విధానాలను ప్రశ్నించే శక్తివంతమైన పాత్రలో కృష్ణ ఇందులో జీవించేశారు. ముందు దొంగగా ఉంటూ ఆ తర్వాత ప్రజల బాగు కోసం పాటు పడే నక్సలైట్ గా రెండు షేడ్స్ ని అద్భుతంగా పండించారు. సత్యమూర్తి కథకు త్రిపురనేని మహారథి సంభాషణలు ప్రాణంగా నిలిచాయి. మాస్ సినిమాలతో బ్రాండ్ ఏర్పరుచుకున్న కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఓ విభిన్న కథాంశంతో రూపొందిన కంచుకాగడా ఘనవిజయం సాధించింది. అప్పటిదాకా కృష్ణ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం.

ఈ సినిమా క్లైమాక్స్ లో నిరంకుశుడిగా జనాన్ని దోచుకుంటున్న రావు గోపాల్ రావుని ప్రశ్నించే సన్నివేశంలో కృష్ణ ఐదు నిమిషాల పాటు పలికే సంభాషణలు, ఉచ్చారణ, ఎమోషన్స్ ని పలికించే తీరు తెలుగు భాషలో ఎంత గొప్ప భావ వ్యక్తీకరణ ఉందో కళ్ళకు చెవులకు నిరూపిస్తాయి. దోపిడీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే అణిచివేత విప్లవానికి ఎలా దారి తీస్తుందో చెప్పే విధానం వాహ్ అనిపిస్తుంది. ఎంతైనా ఇలాంటి సన్నివేశాలు సినిమాలు ఇప్పటి మరియు రాబోయే తరానికి పాఠాలుగా చూపించుకోవచ్చు. ఈ సీన్ లో గొప్పదనం తెలియాలంటే ముందు దీన్ని చదివి సీన్ చూసినా లేక సీన్ చూసి ఇది చదివినా అర్థమైపోతుంది

డైలాగు పూర్తి వర్షన్ ఇది :

“తీరిందా నీ రక్త దాహం, ఆరిందా నీ అధికార పిపాస. దెయ్యాల తోడబుట్టి పిశాచాల జోడు కట్టి మానవాస్తికల మీద రాక్షస రాజ్యాన్ని స్థాపించిన ఫణింద్రా, ఏమిటీ శవాల ప్రదర్శన. ఎండనకా వాననకా శ్రమించి రేయింబవళ్లు రైతులు పండించిన పంటను పన్నుల పేరుతో దోచుకోవడానికా, పసిపాపల నోళ్లు కొట్టి కన్నె శీలాలు కొల్లగొట్టి వేటకుక్కల్లాంటి నీ భటులు ప్రజల నెత్తురు పీలుస్తుంటే వికటాట్టహాసం చేయడానికా, పేదల జీవితాన్ని దుర్భరం చేసి వాకిట వైతరణి నదులు ప్రవహింపజేసి వాళ్ళ గుండెల పై గోరీలు కట్టడానికా, దగా మోసం కుట్ర కుత్సితాలతో సమాజాన్ని కుళ్లబెట్టి అమాయక ప్రజల బ్రతుకుల్లో విషపు వానలు కురిపించడానికా, ఎందుకు ఎందుకు నీకీ జనరల్ పదవి”

“పదవి. పదవి కోసం ఉద్యమాన్ని బలిపెట్టేందుకు నేను నీ ప్రతినిధుల్లాంటి బ్రష్టుడిని కాను. మీలా హంసతూలికా తల్పాల మీద శయనించడం చేతగాక కాదు మేము అడవుల్లో రాళ్లను కౌగలించుకుని నిద్రిస్తున్నది. పంచభక్ష్య పరామన్నాలు ఆరగించి అరిగించుకునే శక్తి లేక కాదు కాయకసర్లతో కడుపు నింపుకుంటున్నది. సమాజపు చక్రబంధంలో చిక్కి మీ దుష్ట పాలకుల కబంధ హస్తాల్లో నలుగుతున్న నిరుపేదల గుండె శోకం మము అభిషేకిస్తే, కార్మిక వీరుల కర్షక ధీరుల విలాపాగ్నులు విషాదాశ్రువులు మా రక్తాన్ని ఉడుకెత్తిస్తే, గుండె నెత్తుర్లు తర్పణ చేసి పోరాడుతున్నాం. ఆ బడుగు ప్రజల కన్నీటి పగ తీరేంత వరకు ఆ బాధాతప్త జీవుల బ్రతుకులకు బంగారు బాట నిర్మించేంత వరకు మీ రావణ రాజ్యం అంతమయ్యేంత వరకు ఈ ఉద్రేకం ఆరదు ఈ ఉద్యమం ఆగదు”

“ప్రజల్ని బానిసలుగా భావించే నీలాంటి నియంతలెందరు నరహంతకులీ ప్రపంచానికి శాపంగా దాపురించారో మానవ జాతి ప్రగతికి ప్రతిబంధకమయ్యారో వాళ్ళేమయ్యారు, ఎక్కడున్నారు, ఏ దేశంలో గెలిచారు ఏ కాలంలో నిలిచారు. ఓర్పు నశించిన ప్రజల ఆగ్రహానికి ఆహుతయ్యారు. చెలరేగిన విప్లవాగ్నుల్లో మాడి మసయ్యారు”

“అసాధ్యం. విప్లవం నిరుపేదల వేదం. కష్టజీవుల జీవ నాదం. తరతరాలదీ పోరాటం యుగయుగాలదీ సంఘర్షణ. ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా ఏ వ్యవస్థలోనైనా ఎప్పుడు పాలకులు తమ బాధ్యతను విస్మరిస్తారో, స్వార్థం బలిసి ప్రజల్ని పీడిస్తారో, ఆ పీడన నుంచే విప్లవం పుడుతుంది. రోదన నుంచి రోషం పుడుతుంది, ఆక్రోశం నుంచి ఆవేశం పుడుతుంది. ఆ రోషావేషాలే అగ్ని బాణాలై, శ్రమ జీవుల స్వేద బిందువులే తుపాకీ గుళ్ళయ్, రక్తాశ్రువులే విచ్చు కత్తులై నీ వంటి నియంతలను నామరూపాల్లేకుండా నాశనం చేస్తాయ్. మీరు ఏర్పరుచుకున్న కుటిల వ్యవస్థ భస్మీపటలం అవుతుంది. ఆ శ్మశాన భూమి నుంచే మీ బూడిదల మీద నుంచే నూతన వ్యవస్థ మొలకెత్తుతుంది. సరికొత్త సమాజం వర్థిల్లుతుంది. ఈ చరిత్ర రహస్యం తెలుసుకుంటావని నువ్వే స్వయంగా ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పగిస్తావని ఆశించాను. కానీ అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటి వాడికి జ్ఞానోదయం కావడం అసంభవం. జరగబోయే రక్తపాతానికి నువ్వే బాధ్యుడివి”

కొన్ని సెకండ్ల గ్యాప్ తో కృష్ణ ఏకధాటిగా ఈ సీన్ లో డైలాగులు చెప్పడం గమనించవచ్చు. ఒక్క ఆంగ్ల పదం లేకుండా కేవలం తెలుగులోనే విచ్చు కత్తుల్లాంటి పదాలతో త్రిపురనేని చేసిన పద విన్యాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. అర నిమిషం డైలాగ్ కే అలిసిపోయినట్టు ఎక్స్ ప్రెషన్లు ఇచ్చే ఇప్పటి హీరోలు వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి