iDreamPost

డ్యూయల్ రోల్ తో కమల్ మ్యాజిక్ – Nostalgia

డ్యూయల్ రోల్ తో కమల్ మ్యాజిక్ – Nostalgia

సాధారణంగా మన సినిమాల్లో డ్యూయల్ రోల్ అంటే ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పుడు విడిపోయి వేర్వేరుగా పెరగడమో లేదా ఒకడు తెలివైన వాడిగా మరొకడు అమాయకుడుగా ఉండటమో చాలా సార్లు చూశాం. కానీ ఆ ఫార్ములాకి భిన్నంగా ఆలోచించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దాని ఉదాహరణగా 1989లో వచ్చిన ఇంద్రుడు చంద్రుడుని చెప్పుకోవచ్చు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డబ్బు మీద ఆశ తప్ప ఇంకే ఎమోషన్స్ లేని ఓ దుర్మార్గ ముసలి మేయర్ అసిస్టెంట్లు చేసిన కుట్ర వల్ల చనిపోతాడు. అతని శవాన్ని వీళ్ళు దాచిపెడతారు.

సరిగ్గా అదే సమయంలో అచ్చం మేయర్ పోలికలు ఉన్న ఓ యువకుడు వీళ్ళకు కనిపిస్తాడు. దాంతో వాడికి డబ్బాశ చూపించి మేయర్ వేషం వేయించి తమ పనులు చేయించుకునే స్కెచ్ వేస్తారు. అంతా సవ్యంగా జరిగిపోతున్న తరుణంలో ఇతగాడు ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి స్టోరీ ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. ఇందులో ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. తమ రెగ్యులర్ శైలికి భిన్నంగా పరుచూరి బ్రదర్స్ చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే అందించారు. ఎంటర్ టైన్మెంట్ తో సాగుతూనే అవసరమైన చోటల్లా సీరియస్ టర్న్ తీసుకుంటూ ప్రేక్షకులను బాగా మెప్పించింది. రెండు పాత్రల్లో కమల్ నటన మాములుగా ఉండదు.

ముఖ్యంగా మేయర్ వేషం వేశాక ఒకపక్క కామెడీ చేస్తూనే మరోపక్క ఆసుపత్రిలో ఉన్న తల్లి కోసం తాపత్రయపడే కొడుగ్గా బెస్ట్ ఇచ్చేశారు. విజయశాంతి హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ఇళయరాజా అద్భుతమైన పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా లాలిజో లాలిజో ఊరుకో పాపాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనికి ఈవివి సత్యనారాయణ అసిస్టెంట్ గా చేయడమే కాదు చివర్లో చిన్న వేషంలో అలా తళుక్కున మెరుస్తారు. చరణ్ రాజ్, పిఎల్ నారాయణ, జయలలిత, గొల్లపూడి శ్రీవిద్య ఇతర కీలక తారాగణం. ఇది తెలుగులో రూపొందిన స్ట్రెయిట్ మూవీ. తెలుగులో ఇదే టైటిల్ సౌండింగ్ వచ్చేలా ఇందిరన్ చందిరన్ పేరుతో డబ్బింగ్ చేస్తే సూపర్ హిట్ అయ్యింది. మూడు దశాబ్దాలకు దగ్గరగా ఉన్నా కమల్ ఫ్యాన్స్ కే కాదు సగటు ప్రేక్షకులకు సైతం ఇంద్రుడు చంద్రుడు మంచి ఎంటర్ టైనర్ గా నిలిచిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి