iDreamPost

23 ఏళ్లుగా తెలుగులోకి రాలేదు! కమల్ సినిమా కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూపులు?

  • Author ajaykrishna Published - 03:57 PM, Wed - 23 August 23
  • Author ajaykrishna Published - 03:57 PM, Wed - 23 August 23
23 ఏళ్లుగా తెలుగులోకి రాలేదు! కమల్ సినిమా కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూపులు?

ఓటిటిలు వచ్చాక ఏ భాషలో సినిమాలైనా ఇట్టే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు కేవలం నెల, రెండు నెలల వ్యవధిలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేగాక ఒరిజినల్ భాషతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ముఖ్యంగా ఏ భాషలో విడుదలయినా.. తెలుగులోకి తప్పకుండా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇలా అన్ని భాషల సినిమాలు నెలల వ్యవధిలో తెలుగులోకి వస్తుంటే.. ఓ సినిమా మాత్రం దాదాపు 23 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘హే రామ్’.

కమల్ హాసన్ సినిమాలకు తెలుగులో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలకు.. ఛాలెంజింగ్ క్యారెక్టరైజేషన్స్ కి కమల్ ఓ దిక్సూచి లాంటి నటుడు. అలాంటి లెజెండ్.. తెలుగులో స్వాతిముత్యం, సాగరసంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం, ఇది కథ కాదు, సొమ్మొకడిది సోకోకొకడిది లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాలు.. మరెన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగునాట సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. తెలుగులో తప్పకుండా అనువాదం అయ్యేవి. కానీ.. 23 ఏళ్లుగా ఆయన చేసిన హే రామ్ మూవీ.. తెలుగు ప్రేక్షకులకు అందని ద్రాక్షలాగే ఉండిపోయింది.

2000 ఏడాదిలో విడుదలైన హే రామ్.. బాక్సాఫీస్ వద్ద ఎన్నో వివాదాలను ఎదుర్కొని.. మూడు నేషనల్ అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కట్ చేస్తే.. ఈ మాస్టర్ పీస్ డైరెక్ట్ హిందీలో రూపొందింది. ఈ సినిమాలోనే కింగ్ షారుఖ్.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించాడని కమల్ చాలాసార్లు చెప్పారు. గాంధీ హత్య.. ఇండో పాక్ విభజన.. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను చాలా ఆసక్తికరంగా కమల్ ప్రెజెంట్ చేశారు. కొన్నేళ్ల క్రితం ఈ సినిమా తమిళ వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా వచ్చేసింది. కానీ.. తెలుగు మాత్రం రాలేదు. మరి అప్పట్లో థియేట్రికల్ గా ఎందుకు రాలేదో తెలియదు. కానీ.. ఇప్పుడు ఓటిటిలు వచ్చేశాయి కాబట్టి.. ఇప్పటికైనా హే రామ్ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇకనైనా తెలుగులోకి వచ్చే మార్గం చేస్తారేమో చూడాలి. మరి కమల్ సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి