iDreamPost

కడప టీడీపీ నేతల దారులన్నీ జగన్‌ ఇంటికే..!

కడప టీడీపీ నేతల దారులన్నీ జగన్‌ ఇంటికే..!

అధికారమనే గొడుకు కింద అన్ని రాజకీయ వర్గాలను కలిపి ఉంచగలను అనే నమ్మకంతో చంద్రబాబు రెండు మూడు దశాబ్ధాలుగా ఫ్యాక్షన్‌ గొడవలున్న వర్గాలను నాడు టీడీపీలోకి తీసుకెళ్లారు. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెరిగింది. ఈ డబ్బే అందరినీ కలిపి ఉంచగలదని చంద్రబాబు నమ్మారు. కానీ డబ్బు, అధికారాన్నీ మించిన లోతులు రాజకీయల్లో ఉంటాయని ఎన్నికలు సమీపించిన సమయంలో చంద్రబాబుకు అర్థమైంది.

తాను ఒక్కొక్కరిని శ్రద్ధగా ఒక దరికి చేర్చిన వర్గాలన్నీ 2018 చివరి నుంచీ చెల్లాచెదురు కావడం మొదలయ్యాయి. కానీ జమ్మలమడుగులో మాత్రం ఇరు వర్గాలకు అంగీకారమైన ఫార్ములాను సమర్థంగా ఒప్పించగలిగారు. వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసే లాగా, రామ సుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేలాగా చంద్రబాబు ఒప్పించగలిగారు. ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో సగటు రాజకీయ అభిమానికి ముందే తెలిసినా.. చంద్రబాబు, అంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, మరికొంత మంది కడప జిల్లాలో ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తాము, లోక్‌సభ కూడా పోటా పోటీగా ఉంటుందని నమ్మారు. కానీ ఫలితాలు మాత్రం అందరూ ఊహించినట్లుగానే కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానంలో 52 వేల ఓట్ల తేడాతో రామసుబ్బారెడ్డి ఓడిపోగా, కడప లోక్‌సభ స్థానంలో ఆదినారాయణరెడ్డి 3.80 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ రామసుబ్బారెడ్డి వర్గం వైఎస్సార్‌సీపీలోకి పోతుందని ప్రచారం జరిగింది. కానీ అంత కన్నా ముందే ఆదినారాయణ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. చేరినప్పుడు దర్శనాలే తప్పా ఆదినారాయణ రెడ్డికి బీజేపీలో దక్కిన ఆదరింపు ఏమీ లేదు.

జమ్మలమడుగు లాంటి అత్యంత సమస్యాత్మకమైన ఫ్యాక్షన్‌ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డిది కొంత మెతక స్వభావం. ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చి పెత్తనం చేసినా.. సర్ధుకొని పోయారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరతారని ప్రచారం జరిగింది. జగన్‌ అమెరికా పర్యటనలో రామసుబ్బారెడ్డి.. జగన్‌ను కలిశారని వార్తలొచ్చాయి. రామసుబ్బారెడ్డికి వైఎస్సార్‌ కుటుంబానికి ప్రత్యక్ష రాజకీయ వైరం లేకపోవడం, వైఎస్సార్‌ చేరదీసిన ఆదినారాయణ రెడ్డి విశ్వాసఘాతుకం చేసి టీడీపీలోకి వెళ్లడంతో రామసుబ్బారెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకోవడంలో ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. నిన్న ఆదివారం రామసుబ్బారెడ్డి తన వర్గంతో సమావేశమయ్యారు. ఈ రోజు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి నుంచి రామసుబ్బారెడ్డి చేరికపై కొంత వ్యతిరేకత ఉన్నా… ఆయన చేరికను అడ్డుకునే పరిస్థితిలేదు.

అంత్యంత ఆశ్చర్యకరంగా.. గత మూడు దశాబ్ధాలుగా వైఎస్సార్‌ కుటుంబంతో రాజకీయంగా ఢీకొంటున్న సతీష్‌ రెడ్డి పేరు కూడా వైఎస్సార్‌సీపీలో చేరే నాయకులు జాబితాలో కనిపిస్తోంది. సతీష్‌రెడ్డి చంద్రబాబు హయాంలో రాజకీయంగా కొంత హడావుడి చేసినా బి.టెక్‌ రవికి దక్కినంత ప్రాధాన్యత సతీష్‌రెడ్డికి దక్కలేదు. ఎమ్మెల్సీ పదవికి గడువు ముగిసినా సతీష్‌రెడ్డికి మరోసారి పదవి దక్కలేదు. సతీష్‌రెడ్డి మొదటి నుంచి ఫ్యాక్షన్‌ రాజకీయానికి దూరంగా ఉంటూ వచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున బి.టెక్‌ రవినే వైఎస్సార్‌సీపీకి ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. సతీష్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరడంపై పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చుగానీ టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని సతీష్‌రెడ్డి తెంచుకుంటారా..? అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ సతీష్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి వెళితే..జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యే అవకాశాలున్నాయి.

వైఎస్సార్‌సీపీలో చేరతారని వినిపిస్తున్న మరో ముఖ్యమైన పేరు.. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు. గతంలో పాలకొండరాయుడు పేరు కడప జిల్లాలో సంచలనంగా ఉండేది. కడప జిల్లాలో చాలా బలమైన నాయకుడిగా ఉండేవారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దుకావడంతో.. ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత (కాంగ్రెస్‌) శ్రీకాంత్‌ రెడ్డి, టీడీపీ నేత రెడ్డివారి రమేష్‌కుమార్‌ రెడ్డి రాయచోటి నియోజకవర్గానికి వలస వెళ్లారు. టీడీపీ తరఫున 2014, 2019లో స్థానిక నేత అయిన పాలకొండరాయుడు కుటుంబానికి కాకుండా.. టీడీపీ రమేష్‌కుమార్‌ రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చింది. పాలకొండ రాయుడు సామాజికవర్గం బలంగా ఉన్న పొరుగు నియోజకవర్గం రాజంపేటలో స్థానికేతరుడైన బత్యాల చెంగలరాయుడుకు టీడీపీ టిక్కెట్‌ ఇచ్చింది. దీనితో పాలకొండరాయుడికి రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో చెంగలరాయుడు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్తబ్దుగా ఉన్న రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చలనం తీసుకొచ్చాయి. ఎవరికి అవకాశం ఉన్న చోట వారు అధికార పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కడప జిల్లాలో గతంలో చక్రంలో తిప్పిన టీడీపీ నేతలందరూ.. అటు బీజేపీ, ఇటు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. రెడెప్పగారి సోదరులు రమేష్‌కుమార్‌ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, బి.టెక్‌ రవి మినహా టీడీపీ వాణి వినిపించే నాయకులు జిల్లాలో కనిపించడంలేదు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కడప జిల్లాలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి