iDreamPost

రెండు లెటర్లు ఇవ్వండి.. 14 వేల కోట్లు ఇస్తా..!

రెండు లెటర్లు ఇవ్వండి.. 14 వేల కోట్లు ఇస్తా..!

పది లక్షలు కాదు, కోటి రూపాయలు కాదు, అక్షయ్‌కుమార్‌ ఇచ్చినట్లు 25 కోట్లు కాదు, రతన్‌ టాటా ఇచ్చినట్లు 500 కోట్లు కాదు, టాటా గ్రూప్‌ ఇచ్చినట్లు 1000 కోట్లు కాదు,.. ఏకంగా 14 వేల కోట్లు.. కరోనా పై పోరుకు తెలుగు రాష్ట్రాలకు ఇస్తానని ఓ ప్రముఖుడు ప్రకటించారు. ఇందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల నుంచి ఆయన ఒకటి కోరారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ మత ప్రబోధకుడు, గత ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పెట్టిన కేఏ పాల్‌.

కేఏ పాల్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయనను గుర్తిస్తారు. ఒక తెలుగు వ్యక్తి ప్రపంచ స్థాయిలో మత ప్రబోధకుడిగా పేరుగాంచారు. ఎన్నికల సమయంలో పాల్‌ చేసే ప్రచారం, ప్రసంగాలు టీవీ చానెళ్లలో విసృతంగా ప్రచారం అయ్యేవి. ఆయన మాటలను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు విరివిగా వచ్చేవి.

కరోనా అంశంపై కేఏ పాల్‌తో ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సదరు టీవీ ఛానెల్‌ హోస్ట్‌ కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలకు మీరెంత విరాళం ఇవ్వబోతున్నారనే ప్రశ్నకు కేఏ పాల్‌ సంచనల సమాధానం ఇచ్చారు. మూడు రూపాల్లో తాను సహాయం చేస్తానన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని తన ట్రస్ట్‌ ఆస్పత్రులను కరోనా వైద్య సహాయం కోసం ఉపయోగించుకునేందుకు ఇచ్చానని చెప్పారు. రెండో అంశం.. కరోనా వైరస్‌ త్వరగా నశించాలని ప్రార్థన చేస్తానన్నారు.

ఇక మూడో అంశం చాల ముఖ్యమైనది. తన బ్యాంకు ఖాతా నుంచి విరాళం ఇస్తే.. ఎంత వస్తుందన్న కేఏ పాల్‌.. తెలుగు రాష్ట్రాల సీఎంలు కరోనాపై సహాయం కోరుతూ ప్రపంచ దేశాలు ప్రధానులు, అధ్యక్షులను అడ్రెస్‌ చేస్తూ రెండు లేఖలు ఇస్తే తాను రెండు రాష్ట్రాలకు ఏడు వేల కోట్ల రూపాయల చొప్పున నిధులు ఇస్తానని చెప్పారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చేయాల్సింది.. లెటర్‌ పంపడమేనన్నారు. ఒక్క నిమిషం సయమం పట్టే లెటర్‌ రాస్తే తాను 14 వేల కోట్లు తెలుగు రాష్ట్రాలకు నిధులు తెస్తానన్నారు. కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు అంటే ప్రపంచంలో ఎవరికీ తెలియదని, వారు అడిగితే నిధులు ఇవ్వరు కాబట్టి వారి తరఫున ఆ లేఖలు పట్టుకుని తాను అడుగుతానన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని న్యూస్‌ ఛానెళ్లు, యూట్యూబ్‌ ఛానెళ్లు తనను ఓ జోకర్‌లా చూపించారని కేఏ పాల్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటే.. ఎనిమిది మంది కూడా తనను జోకర్‌ అనరని పాల్‌ చెప్పుకొచ్చారు. ప్రధానులు, సీఎంలు తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌ పోర్టుకు వచ్చారన్నారు.

14 వేల కోట్ల నిధులు ఇస్తానన్న పాల్‌ ప్రకటనను చూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాల్‌ ప్రకటనను సీరియస్‌గా తీసుకుని తెలుగు రాష్ట్రాల సీఎంలు లేఖలు రాస్తారా..? లేదా..? అన్నదే ప్రస్తుతం జరుగుతోన్న చర్చ. కేఏ పాల్‌ సరదాగా అంటున్నారా..? సీరియస్‌గా అన్నారా..? ఆయనలో ఆ సత్తా ఉందా..? అనే అంశాలు ఆలోచించకుండా తెలుగు రాష్ట్రాల సీఎంలు లేఖలు రాస్తే మంచిదే. నిధులు తెస్తే పాల్‌ హీరో అవుతారు. తేలేకపోతే.. ఇకపై ఛానెళ్లు కేఏ పాల్‌ ఇంటర్వ్యూలకు సమయం కేటాయించకుండా.. ప్రజా సమస్యలపై దృష్టి పెడతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి