iDreamPost

రాజకీయాల్లోకి రాక.. క్లారిటీ ఇచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌

రాజకీయాల్లోకి రాక..   క్లారిటీ ఇచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌  ‌

రావడం లేటవుతుందేమో గానీ రావడమైతే మాత్రం పక్కా.. ఓ సినిమాలోని డైలాగ్‌ ఇది. దీన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ శ్రేణులు జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తాజాగా ఉపయోగిస్తున్నారు. జూనియర్‌ రాకతోనే టీడీపీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని టీడీపీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత జూనియర్‌ రాజకీయాల్లోకి రాకపై మొదలైన ప్రచారం.. ఇటీవల పంచాయతీ ఎన్నికల తర్వాత మరింత ఊపందుకుంది. ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా జూనియర్‌కు మద్ధతు ప్రకటిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు సమక్షంలోనే ఓ అభిమాని జూనియర్‌ ఎన్టీఆర్‌ను దించాలంటూ డిమాండ్‌ చేశారు.

టీడీపీలో, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో జూనియర్‌ ఎన్టీఆర్‌ నిశితంగానే గమనిస్తుంటారనడంలో సందేహం లేదు. అభిమానాలు, టీడీపీ శ్రేణుల్లో తన రాజకీయ ప్రవేశం ఎదురుచూస్తున్న విషయంపై తాజాగా స్పందించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఓ టీవీ షోలో పాల్గొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ను రాజకీయ ప్రవేశంపై స్పందించాలని కోరగా.. దీనికి ఇది సరైన వేదిక, సమయం కాదని, సమయం వచ్చినప్పుడు ఆ విషయంపై తప్పక మాట్లాడతానని చెప్పారు. అభిమానులకు ఎంత చేసిన తక్కువేనని, వారి ఆశలు తీర్చడమే తన పని అంటూ జూనియర్‌ వ్యాఖ్యానించారు.

సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని జూనియర్‌ చెప్పడంతో.. ఆయన రాజకీయాల్లోకి తప్పక వస్తారని తెలిపోయింది. అయితే అది ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్తేమి కాదు. 12 ఏళ్ల క్రితమే ఆయన ప్రజల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. తన తాత ఎన్టీఆర్‌ మాదిరిగా ఖాకీ చొక్కా వేసుకుని, అవే హావాబావాలతో ఆ ఎన్నికల ప్రచారంలో దుమ్ములేపారు. మంచి వాగ్థాటి కలిగిన జూనియర్‌ ఎన్టీఆర్‌కు రాజకీయంగా ఉజ్వల భవిష్యత్‌ ఉందని అప్పట్లోనే చర్చ జరిగింది. టీడీపీకి భవిష్యత్‌ నాయకుడనే చర్చ ప్రజల్లో సాగింది. ఈక్రమంలోనే చంద్రబాబు ఎన్నికల తర్వాత జూనియర్‌ను పూర్తిగా దూరం పెట్టారు. జూనియర్‌ను పోత్సహిస్తే.. తన కుమారుడు నారా లోకేష్‌కు భవిష్యత్‌ ఉండదని బాబు భయపడ్డారనే విశ్లేషణలు సాగాయి. దీనికి బలం చేకూరేలా జూనియర్‌ సినిమాలను చూడొద్దంటూ టీడీపీ శ్రేణులకు సందేశాలు వెళ్లాయి.

అయితే ఎవరు ఎన్ని చేసినా జరగాల్సింది జరుగుతుంది.. జరగనిది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదన్నట్లుగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడం ఖాయమైంది. ఇందుకు టీడీపీ పరిస్థితి, ఆ పార్టీలో నాయకత్వలేమి, చంద్రబాబు నాయకత్వంపై అపనమ్మకాలే తోడ్పడుతున్నాయి. జూనియర్‌ రాక అయితే ఖాయం.. అది ఎప్పుడు అన్నదే ఇప్పుడు తేలాల్సింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి