iDreamPost

తండ్రీకొడుకుల ఎమోష‌న్ జేబుదొంగ‌ – Nostalgia

తండ్రీకొడుకుల ఎమోష‌న్ జేబుదొంగ‌ – Nostalgia

1975, శోభ‌న్‌బాబు ఒక రేంజ్‌లో దూసుకుపోయిన సంవ‌త్స‌రం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వెనుక‌ప‌డుతున్న కాలం. ఆ ఏడాది వ‌చ్చిన జేబుదొంగ సూప‌ర్‌హిట్‌. ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మ‌ణ డైలాగ్‌లు రాశారు. వి.మ‌ధుసూద‌న్‌రావు డైరెక్ట‌ర్‌.

దొర‌ల‌నైనా , దొంగ‌ల‌నైనా ప‌రిస్థితులే త‌యారు చేస్తాయ‌నే వాక్యం మీద ఈ క‌థ త‌యారైంది. ఒక పోలీస్ కొడుకు, దొంగ ద‌గ్గ‌ర పెరిగితే, దొంగే అవుతాడు. రావుగోపాల‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న‌ప్పుడు వీర‌య్య అనే దొంగ‌ని అరెస్ట్ చేస్తాడు. దాంతో వీర‌య్య కొడుకు చ‌నిపోతాడు. ఆ క‌క్ష‌తో అత‌ను రావుగోపాల్‌రావు కొడుకుని కిడ్నాప్ చేసి దొంగ‌గా పెంచుతాడు. అత‌నే హీరో.

ఒకానొక సంద‌ర్భంలో తండ్రీకొడుకులు క‌లుసుకుంటారు. కొడుకుకి తండ్రి తెలుసు, తండ్రికి అత‌నే కొడుక‌ని తెలియ‌దు. ఈ డ్రామాతోనే సినిమా. అయితే గంటా 15 నిమిషాలు ఉపోద్ఘాత‌మే ఉంటుంది. ఆ రోజుల్లో స్లో నెరేష‌న్ ఒక అల‌వాటు. ఎందుకంటే ప్రేక్ష‌కుల‌కి ఒక సుదీర్ఘ‌మైన సినిమా అవ‌స‌రం.

రాజ‌బాబు, ర‌మాప్ర‌భ‌, అల్లు రామ‌లింగ‌య్య కామెడీ ఎపిసోడ్‌. సంవ‌త్స‌రానికి రాజ‌బాబు 25-30 సినిమాలు చేస్తున్న రోజులు. రాజ‌బాబు ఉంటేనే పంపిణీదారులు ముందుకు వ‌చ్చే కాలం.

విల‌న్ స‌త్య‌నారాయ‌ణ డెన్‌లో అట్ట పెట్టెలు పెట్టుకుని స్మ‌గ్లింగ్ నుంచి క‌ల్తీ వ్యాపారం వ‌ర‌కూ ఎన్నో చేస్తుంటారు. దీనికి తోడు విగ్ మార్చుకుని స‌మాజంలో పెద్ద మ‌నిషిగా చెలామ‌ణి అవుతుంటాడు. దానికి తోడు ఫార్ములా కావాల‌ని ఒక సైంటిస్ట్‌ని కూడా వేధిస్తుంటాడు.

శోభ‌న్‌బాబు జేబు దొంగ‌త‌నాల నుంచి , ఎయిర్‌పోర్ట్‌లో సూట్‌కేసుల‌ను తారుమారు కూడా చేస్తుంటాడు. అత‌ను దొంగే కానీ, ప్ర‌జ‌ల మేలు కోరే దొంగ‌. ప‌ర‌మ రొటీన్‌గా సాగే ఈ సినిమా, రావుగోపాల్‌రావు, శోభ‌న్‌బాబు ఎమోష‌న్‌తో గ‌ట్టెక్కింది.

హీరోయిన్ మంజుల అందంగా క‌నిపిస్తుంది. కృష్ణ‌కుమారి త‌ల్లి పాత్ర‌ల‌లోకి మారిపోయింది. త‌ర్వాత రోజుల్లో విప్ల‌వ సినిమాలు తీసిన మాద‌ల రంగారావు దీంట్లో విల‌న్‌.

చివ‌ర్లో హీరోని , విల‌న్ చార్ట‌ర్డ్ విమానంతో ఛేజ్ చేస్తాడు. నేల మీద ఉన్న‌వాన్ని విమానంలో త‌ర‌మ‌డం ఎందుకు?
చేతికి దొరికిన వాళ్లంద‌రికి తెలివి త‌క్కువ‌గా రెండు నిమిషాలు టైం ఇవ్వ‌డం వ‌ల్ల విల‌న్ పినీష్ అయిపోతాడు.
ముర‌ళీమోహ‌న్ సెకండ్ హీరోగా ఉన్న జేబుదొంగ‌లో పాట‌ల‌న్నీ హిట్‌. (సంగీతం చ‌క్ర‌వ‌ర్తి)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి