iDreamPost

అనంతలో జేసీ హల్‌చల్‌..!

అనంతలో జేసీ హల్‌చల్‌..!

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబం రాజకీయంగా ఏమి చేసినా సంచలనమే. నిరసన పేరుతో మంగళవారం జేసీ పవన్‌రెడ్డి అనంతపురంలో హల్‌చల్‌ చేయడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో మైనారిటీలు, దళితులు, బీసీలపై దాడులు జరుగుతున్నాయంటూ.. వాటిపై నిరసన వ్యక్తం చేసేందుకంటూ మంగళవారం అనంతపురంలో జేసీ పవన్‌ బైక్ ర్యాలీ కార్యక్రమం తలపెట్టారు. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు.

మూడు రోజుల నుంచి అనుమతి వ్యవహారంపై పోలీసులు, జేసీ పవన్‌కు మధ్య వివాదం నడుస్తోంది. అనుమతి ఇవ్వకపోయినా నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు జేసీ పవన్‌రెడ్డి యత్నించారు. టీడీపీ కార్యకర్తలు భారీగా జేసీ ఇంటికి చేరుకున్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేకపోయినా నిర్వహించేందుకు జేసీ పవన్‌రెడ్డి తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు పవన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సమయంలో హైడ్రామా చేటుచేసుకుంది. ర్యాలీ చేస్తానంటూ జేసీ పవన్‌.. అనుమతి లేదని పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఎంత చెప్పినా వినని జేసీ పవన్‌రెడ్డి ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. పవన్‌ను అనంతపురం రెండో పట్టణ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ తర్వాత విడుదల చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేయదలిస్తే.. పోలీసులు అనుమతి ఇవ్వలేదని జేసీ పవన్‌ విమర్శించారు. పోలీసులతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో తొలిసారి పోటీలో నిలిచిన జేసీ పవన్‌రెడ్డి.. అనంతపురం లోక్‌సభ నుంచి తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం.. అనంతపురం లోక్‌సభ టీడీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్‌గా పేరొందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిలు గత ఎన్నికల్లో వారసులను రంగంలోకి దించారు. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్‌ రెడ్డి, అనంతపురం లోక్‌సభ నుంచి జేసీ పవన్‌కుమార్‌ రెడ్డిలు పోటీ చేశారు. ఇద్దరూ ఓటమి చవిచూశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి