iDreamPost

మూడు రాజధానులు మంచి ఆలోచన – జయప్రకాశ్ నారాయణ.

మూడు రాజధానులు మంచి ఆలోచన  – జయప్రకాశ్ నారాయణ.

అసెంబ్లీలో మూడు రాజధానులు రావొచ్చన్న జగన్ సంచలన ప్రకటన తర్వాత దీనిపై నిన్నటి నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు.. మీడియాలో.. ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇప్పటికే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల ప్రజలతో పాటు, పార్టీలకి అతీతంగా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో దీనిపై ఆయా ప్రాంతాల మేధావులు ఆచితూచి స్పందిస్తున్నారు.ఇదే అంశంపై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ స్పందిస్తూ రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే తప్పేంటీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జయప్రకాష్ నారాయణ పరిపాలన అంతా ఒకే చోట కేంద్రీకరించకూడదని, పరిపాలన లో వికేంద్రీకరణ జరగాలని నేను, లోక్ సత్తా మొదటి నుండి వాదిస్తున్నామని,మొదటినుండి మా లోక్ సత్తా సిద్దాంతం కుడా ఇదేనని, రాష్ట్ర రాజధాని అంటూ కొన్ని అంశాల వరకు ఉండాలి తప్ప అన్ని సంస్థలు ఒకేచోట పెట్టక్కర్లేదని తెలిపారు. కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఒక చోట, అసెంబ్లీ మరోచోట హైకోర్ట్ ఇంకో ప్రాంతంలో ఇలా ప్రాధాన్యతలను బట్టి ప్రజా సౌకర్యాన్ని బట్టి వేరు వేరు ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. ఇదే విధంగా మన రాష్ట్రంలో కూడా మూడు ప్రాంతాల్లో రాజధాని పెట్టుకోవడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అమరావతి పై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ ఏ ప్రభుత్వం ఐనా కక్ష సాధింపుతో నిర్ణయాలు తీసుకోదని తాను భావిస్తున్నానని, అయితే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ది చెందాలంటే మహా నగరాలు కూడా ఉండాలని, మహానగరం చుట్టు పక్కల ప్రాంతాలు చాలా వేగంగా అభివృద్ది చెందుతాయని, ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం సమకూరుతుందని రాష్ట్ర భవిష్యత్తుకి కుడా మంచిదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతి నిర్మాణాన్ని ఆపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.

అవసరమయితే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక కారిడార్లు, ప్రాంతీయ అభివృద్ది మండళ్లు, పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లాలకు మున్సిపాల్టీలకు సర్వాధికారాలు ఇవ్వాలని, స్థానిక సంస్థలను బలోపేతం చెయ్యాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి