iDreamPost

108 అప్‌గ్రేడెడ్‌.. సకల సదుపాయాలతో 1,060 కొత్త వాహనాలు సిద్దం

108 అప్‌గ్రేడెడ్‌.. సకల సదుపాయాలతో 1,060 కొత్త వాహనాలు సిద్దం

అర్ధరాత్రో అపరాత్రో ఆపదొస్తే దిక్కెవరు అనే సందేహాన్ని పటాపంచెలు చేస్తూ ఏ సమయంలోనైనా నేనున్నానంటూ రోడ్డుమీదకొచ్చిందే ఆపద్బంధు. దీనికంటే కూడా 108గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితం. 2005 ఆగస్టు్‌ 15న ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం ఓ సంచలనం. ఎక్కడ ఏ మారుమూల పల్లెలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా 108కు ఫోన్‌ చేస్తే చాలు కుయ్‌ కుయ్‌ మంటూ పది నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆస్పత్రికి బాధితున్ని తరలించేది. కాలక్రమంలో పలు ప్రభుత్వాలు మారినా ఈ పథకాన్ని కొనసాగిస్తూనే వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 108 వాహనాలకు నిధులు కేటాయించకపోవడంతో అరకొరగా వాహనాలు మాత్రమే సేవలు అందించేవి. ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే వాహనాల్లో డీజిల్‌ లేదని, సిబ్బంది లేరని సమాధానాలు వచ్చేవి. 108 వాహనాలు మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మొత్తంగా 450 మాత్రమే వాహనాలు ఉండగా, అందులో కేవలం 100లోపు వాహనాలు మాత్రమే సేవలు అందించేవి.

ఇలాంటి సందర్భంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రావడంతోనే 108కు పునర్‌వైభవాన్ని తెచ్చే దిశగా నిధులు కేటాయించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,080 వాహనాలను కొనుగోలు చేయించారు. వాటిలో అన్ని సదుపాయాలు ఉండేలా డిజైన్‌ చేయించారు. ఈ వాహనాల్లో అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్‌’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ వెంటిలేటర్లను అమర్చుతున్నారు. డిఫ్రిబ్యులేటర్‌ (గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్‌ (రక్తంలో ఆక్సిజన్‌ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్యపరికరాలుంటాయి. అంటే ఆస్పత్రి వరకు కూడా ఎదురుచూడకుండా 108 వాహనాల్లోనే వైద్యం అందించేందుకు వీలుగా వీటిలో సదుపాయాలు ఏర్పాటు చేశారు. జూలై1న ఈ వాహనాలను ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆదేశించారు. దీంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

లక్షల మందికి 108 సేవలు

2005 ఆగస్ట్‌ 15న తొలిసారి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతిలలో పథకాన్ని ప్రవేశపెట్టారు. సరిగ్గా ఏడాదికల్లా రాష్ట్రమంతా పథకాన్ని విస్తరించారు. ఎక్కడ ఏ మారుమూల పల్లెలో గుండెపోటు లేదా పాముకాటు, జ్వరం ఏదైనా కానీ 108కు ఫోన్‌ చేస్తే చాలు వచ్చి బాధితుణ్ని సురక్షితంగా ఆస్పత్రికి చేరుస్తుంది. ఇక ప్రమాద బాధితులకు ఒకవిధంగా దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. 2005 ఆగస్ట్‌ 15 నుంచి 2014 మే 31 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో 86,61,402 మందిని ఆపదనుంచి కాపాడిన ఘనత 108ది. ఏపీలో ఈ పథకం ప్రారంభమయ్యాక దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ప్రారంభించారు.

గర్భిణులకూ వరమే

ఇప్పటి వరకూ గర్భిణులు పురిటి నొప్పులొస్తే ఆస్పత్రికెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. వీరికి కూడా 108 తోబుట్టువుగా నిలబడింది. రాష్ట్రం విడిపోయే నాటికి 18.41 లక్షల మంది గర్భిణులు 108లో ఆస్పత్రులకు వెళ్లి పురుడు పోసుకున్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీలో 3 లక్షల మంది, తెలంగాణలో 1.36 లక్షల మంది 108లో సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి ప్రసవమయ్యారు. ఈ పథకాన్ని ప్రపంచ దేశాలే ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి