iDreamPost

వలస జీవులకు ఆహార సదుపాయం,రాష్ట్ర సరిహద్దు వరకు రవాణా ఏర్పాటు – జగన్ నిర్ణయం

వలస జీవులకు ఆహార సదుపాయం,రాష్ట్ర సరిహద్దు వరకు రవాణా ఏర్పాటు – జగన్ నిర్ణయం

దేశమంతటా వలస కూలీల అవస్థలు ఇప్పుడు అందరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధుల వెతలు అందరి మనసును కదిలిస్తున్నాయి. మీడియాలో కనిపిస్తన్నవి కొద్ది మేరకు మాత్రమే. కెమెరా కంటికి చిక్కని వేల మంది అనేక సమస్యలతో పయనం అవుతున్న తీరు పెద్ద సమస్యను తలపిస్తోంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదిలింది. వలస జీవుల సమస్యల పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని కదిలించింది. శుక్రవారం సాయంత్రం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రంగంలో దిగగా, ఈ రోజు ఉదయం నుంచే పలు చోట్ల కలెక్టర్లు స్వయంగా పరిస్థితిని పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వలస కూలీలను ఆదుకునే చర్యలు తీసుకుంటున్నారు.

లాక్ డౌన్ నిర్ణయం తీసుకునే సయమంలో వలస జీవులకు సంబంధించి కేంద్రం తగిన శ్రద్ధ పెట్టకపోవడంతో రానురాను సమస్య తీవ్రం అయ్యింది. ఇటీవల శ్రామిక్ రైళ్ల ద్వారా కొంతమందిని స్వస్థలాలకు చేర్చినా అది పూర్తిగా అక్కరకు రాలేదు. దాంతో నేటికీ అనేక మంది కాలినడకన దేశం ఆ మూల నుంచి ఈ మూలకు కూడా నడిచేందుకు సిద్ధం కావడం విస్మయకరంగా మారింది. కాలి కడుపులతో వారి పయనం విచారకరమైన రీతిలో సాగుతోంది. ఈ విషయంలో చివరకు సుప్రీంకోర్ట్ కూడా వారిని కదలకుండా ఆపలేం కదా అంటూ నిన్న చేసిన కామెంట్ మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొన్నిసహాయక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో వాటిని మరింత పెంచాలని తెలిపింది.

తాజాగా కరోనా నియంత్రణపై చర్యలపై సమీక్ష జరిపిన సీఎం ఈ   వలస కూలీల సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించి… రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇతర రాష్ట్రాల వలస కూలీల స్థితిగతులపై అధికారులతో చర్చించారు. మండుటెండలో పిల్లా,పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్ధితి చలించపోయేలా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భంలో మానవీయ కోణాన్ని కూడా మర్చిపోవద్దన్నారు. మన రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని ఆదేశించారు.

వలస కూలీలు కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం చేయాలని, దాని కోసం విధి, విధానాలు తయారు చేయాలని ఆదేశించారు. వలస కూలీలకు టిక్కెట్టు కూడా అడగవద్దని సీఎం తెలిపారు నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలలని సీఎం సూచించారు. వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

సీఎస్ తాడేపల్లి వద్ద రోడ్డున వెళుతున్న కొందరు వలస కూలీలతో స్వయంగా మాట్లాడి వారికి వసతి ఏర్పాటు చేశారు. ఆహారం అందించేందుకు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధికారులు రంగంలో దిగాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచే అనేక చోట్ల వలస కూలీలకు ఆకలి తీర్చే బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుంది. తగిన ఆహారం అందించి, రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణకు పూనుకుంది. ఆ క్రమంలోనే తమకు ఆలశ్యం అవుతుందంటూ కొందరు రోడ్డెక్కడంతో తాడేపల్లి వారధి వద్ద కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సహనం కోల్పోవడం చర్చనీయాంశం అయ్యింది.

వెంటనే అప్రమత్తమయిన అధికారులు వలస కూలీలకు ఊరట కల్పించేలా అన్ని చోట్లా తగిన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం ఇప్పుడు అందరినీ కొంత సంతృప్తి పరుస్తోంది. అన్ని చోట్లా హైవేలపై 50 కిలోమీటర్ల దూరంలో ఓ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. మంచినీరు అన్ని చోట్లా అందుబాటులో ఉంచుతున్నారు. ఆహారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆకలితో అల్లాడుతున్న వలస కూలీలకు కొండంత అండగా జగన్ ప్రభుత్వం ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. దారిలో ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్న వలస కూలీలను కాపాడేందుకు పూనుకుంటున్నారు. తగిన వాహనాల ద్వారా వారిని ఆయా రాష్ట్రాలకు తరలించేందుకు తగ్గట్టుగా సన్నద్దమవుతున్నారు. దాంతో అనేక చోట్ల వలస కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కూడా ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న సర్వీసు తమకు ఉపశమనం కల్పిస్తోందని చెబుతుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి