iDreamPost

హీరోగా మారిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్!

హీరోగా మారిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్!

జబర్దస్త్ లో ఉన్న ఎంతో మంది సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అని గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చాడు. కెరీర్లో అంచలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి కమెడియన్ గా బుల్లితెరలో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు కెరీర్లో ఇంకో అడుగు పైకెక్కారు. రాకింగ్ రాకేష్ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్, మంత్రి రోజా, తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తనికెళ్ల భరణి, సాయి కుమార్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ భాగంగా మొక్కలు కూడా నాటారు.

రాకింగ్ రాకేష్ హీరోగా గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఎంపీ సంతోష్ క్లాప్ కొట్టారు. మంత్రి రోజా కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. తనికెళ్ల భరణి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సాయికుమార్ స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందజేశారు. గరుడవేగ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీగా వ్యవహరించిన అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగేదిగా తెలుస్తోంది. మరో బలగం సినిమా అంటూ ఇప్పటి నుంచే టాక్ మొదలైంది.

ఈ సినిమా ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. “సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్. రాకింగ్ రాకేష్ మంచి నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. “రాకేష్ నాకు కొడుకు లాంటివాడు అతను ఎప్పటి నుంచో లీడ్ రోల్ లో సినిమా చేయాలి అని ఎదురుచూస్తున్నాడు. అతని కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి. ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచాలి” అంటూ ఆకాంక్షించారు. రాకింగ్ రాకేష్ ప్రతిభను తనికెళ్ల భరణి ఆయన మాటల్లో వివరించారు. “రాకేష్ హీరోగా, నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. రాకేష్ మా గురువు రాళ్లపల్లి గారికి కూడా ఎంతో ఇష్టమైన శిష్యుడు. చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు పెద్దగా మారుతున్నాయి. ఈ సినిమా గొప్ప విజయం సాధించి.. రాకేష్ మరో 10 సినిమాలు తీసే స్థాయికి ఎదగాలి” అంటూ తనికెళ్ల భరణి కోరుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి