iDreamPost

మే 3 తర్వాతే మొదలవ్వనున్న అసలైన కష్టాలు ?

మే 3 తర్వాతే  మొదలవ్వనున్న  అసలైన కష్టాలు ?

అవును కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ నిర్ణయం కారణంగా దేశంలోని కొన్ని కోట్లమంది జనాలు ఎవరిళ్ళకు వాళ్ళే పరిమితమైపోయారు. ఒకవైపు లాక్ డౌన్ ఉన్న మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తునే ఉంది. అదే అసలు లాక్ డౌన్ అన్నదే లేకపోతే ఈ పాటికే దేశంలో బాధితుల సంఖ్య లక్షల్లో పెరిగిపోయేదనటంలో సందేహం లేదు. సరే ఇప్పటి వరకు బాగానే ఉంది. మే 3వ తేదీన తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తారో లేకపోతే పాక్షికంగా సడలిస్తారో తెలీదు. రెండింటిలో ఏది జరిగినా అప్పుడు మొదలవుతుంది అసలైన కష్టాలు.

ఎలాగంటారా కరోనా వైరస్ కు ప్రత్యేకంగా మందు లేదన్న విషయం మనకందిరికీ తెలిసిందే. కరోనాపై విజయం సాధించాలంటే సామాజిక దూరం పాటించటం, ఎవరిని ముట్టుకోకుండా దూరంగా ఉండటం, వ్యక్తిగత శుభ్రత పాటించటమే ప్రధాన ఆయుధాలు. లాక్ డౌన్లో ఉన్నాం కాబట్టి పైవన్నీ సాధ్యమయ్యాయి. మరి మే నెల 3 తర్వాత పరిస్దితేంటి ? కూరగాయల కోసమో, సరుకుల కోసమో, లేకపోతే ఆఫీసులకు వెళ్ళటమో, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, బంధువుల ఇళ్ళకు వెళ్ళటం లేకపోతే వాళ్ళు రావటం ఒక్కసారిగా ఎక్కువైపోతాయి. తాజా సమాచారం ప్రకారం బాధితుల సంఖ్య 19 వేలు కాగా చనిపోయిన వారి సంఖ్య 603గా నమోదైంది.

క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వాళ్ళకు లాగ ఎవరికి వాళ్ళు దాదాపు నెలన్నర రోజులు ఎవరిళ్ళకు వాళ్ళే పరిమితమైపోయారు కాబట్టి ఒక్కసారిగా కరువా కాలమా అన్నది తెలీకుండా రోడ్లపైన పడతారు. పబ్లిక్ ప్లేసేస్ లో ఎక్కడ తిరిగినా ఎవరి ద్వారా వైరస్ మనకు సోకుతుందో తెలీదు. బస్సులు, రైళ్ళు, మెట్రోల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికి వైరస్ ఉందో అన్న అనుమానం. బస్సులు, రైళ్ళల్లో ప్రయాణం చేసేటపుడు, కూరగాయల మార్కెట్లకు వెళ్ళినపుడు సామాజిక దూరం పాటించటం సాధ్యంకాదు.

రద్దీలో తిరిగేటపుడు మనమీద ఎవరు పడతారో తెలీదు, మనం ఎవరిని రాసుకుంటు తిరుగుతామో చెప్పలేం. ఇటువంటి పరిస్ధితుల్లో స్వేచ్చగా బయట తిరగలేము. అలాగని ఇంట్లో కూర్చోలేము. దాంతో సమస్య మొదలవుతుంది. చాలా దేశాల్లో జరిగిందిదే. వైరస్ కు పుట్టినిల్లయినా చైనాలోని వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తేయగానే పోలోమంటూ ప్రపంచంలోని జనాలందరూ వచ్చి వూహాన్లో పడిపోయారు. అలాగే వూహాన్ జనాలు కూడా బయట తిరిగేశారు. తర్వాత ఏమైంది ? కనుమరుగైపోయిందని అనుకున్న కరోనా వైరస్ మళ్ళీ తిరగబెట్టింది. మళ్ళీ బాధితులు సంఖ్య, మరణాలు పెరిగిపోతున్నాయి. సింగపూర్లో కూడా లాక్ డౌన్ ఎత్తేస్తే కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో మళ్ళీ కంప్లీట్ లాక్ డౌన్ పెట్టేశారు.

కాబట్టి మనం ఇపుడు లాక్ డౌన్లో ఉన్నట్లే మే 3వ తేదీ తర్వాత కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండకపోతే అంతే సంగతులు. అసలే కరోనా వైరస్ కు జనాలంటే అమితమైన ప్రేమ. ఆడ, మగ, ముసలి, చిన్న తేడా లేకుండా అందరినీ ఓ చూపు చూసేస్తుంది. ఒకసారి అంటుకున్నదంటే బబుల్ గమ్ లాగ ఎంతకీ వదలదన్న విషయం గుర్తుంచుకోవాలి . మే 3వ తేదీ తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి