iDreamPost

జ‌గ‌న్ త‌ప్పు చేస్తున్నాడా?

జ‌గ‌న్ త‌ప్పు చేస్తున్నాడా?

జ‌గ‌న్ త‌న పార్టీలో వ‌ల‌స‌ల‌కు గేట్లు ఎత్తేశాడు. స్థానిక ఎన్నిక‌ల్లో ఇదంతా లాభిస్తుంద‌నే కార‌ణం కావ‌చ్చు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి కాబట్టి వాళ్లు రాలేదు. ఇక మాజీలు, మిగిలిన నాయ‌కులు పోలోమంటూ చేరిపోతున్నారు. స‌హ‌జంగానే అధికార పార్టీకి ఆక‌ర్ష‌ణ ఎక్కువ‌. అక్క‌డుంటే ప‌నులు జ‌రుగుతాయ‌ని, వేధింపులు ఉండ‌వ‌ని, ర‌క‌రకాల కార‌ణాల‌తో చేరుతుంటారు. తెలుగుదేశం ఓడిపోయిన వెంట‌నే న‌లుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. వాళ్లంతా వ్యాపార‌స్తులు, రాజ‌కీయాలు వాళ్ల‌కెప్పుడూ వ్యాపార‌మే. పైగా బాబు ఆశీస్సులు కూడా ఉన్నాయంటారు. బీజేపీకి రాజ్య‌స‌భ‌లో బ‌లం అవ‌స‌రం. ఆ పార్టీ అన్ని విలువ‌లు వ‌దిలేసి చాలా కాల‌మైంది.

ఇప్పుడు జ‌గ‌న్‌కి ఆ అవ‌స‌రం ఏమొచ్చింది? వ‌చ్చిన ప్ర‌తి వాడిని చేర్చుకోవ‌డం వ‌ల్ల పార్టీలో కుమ్ములాట‌లు ఎక్కువై కొత్త స‌మ‌స్య‌లొస్తాయి. వ‌ల‌స‌ల వ‌ల్ల ఒక పార్టీని దెబ్బ‌తీయడం సాధ్యం కాదు. గ‌తంలో ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను లాగేసి వైసీపీని ఫినీష్ చేశాన‌ని చంద్ర‌బాబు సంబ‌ర‌ప‌డ్డాడు. త‌ర్వాత పార్టీ మారిన వారంతా ఓడిపోయి , వైసీపీ తిరుగులేని శ‌క్తిగా వ‌చ్చింది.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా TRSని చీల్చాడు. త‌ర్వాత అది బ‌ల‌హీన ప‌డ‌క‌పోగా ఇంకా బ‌ల‌ప‌డింది. ఇప్పుడు కూడా జ‌గ‌న్ ప‌థ‌కాలు ఇవన్నీ ఓట్లు తెస్తాయి త‌ప్ప‌, నాయ‌కుల వ‌ల్ల ఓట్లు రావు. స్థానిక ఎన్నిక‌లు కాబ‌ట్టి తెలుగుదేశానికి నాయ‌కులే లేకుండా చేయాల‌నుకోవ‌డం తాత్కాలికంగా ఉప‌యోగ‌ప‌డుతుంది త‌ప్ప‌, త‌ర్వాత ముఠా త‌గాదాలు ముదిరిపోతాయి.

ఉదాహ‌ర‌ణ‌కి జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ప్ర‌స్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స‌హ‌జంగానే ఇష్టం ఉండ‌దు. దానికి కార‌ణం ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి క‌లిసి ఆయ‌న్ని నియోజ‌క‌వ‌ర్గంలో కూడా తిర‌గ‌నివ్వ‌ని స్థితి క‌ల్పిస్తే, ఆయ‌న ప్ర‌జ‌ల స‌హ‌కారంతో నెగ్గుకొచ్చారు. నాయ‌కుల‌కి బ‌లం ఉంది, వాళ్లు ఓట‌ర్ల‌ని శాసించే ప‌రిస్థితే ఉంటే సుధీర్‌రెడ్డికి డిపాజిట్లు కూడా వ‌చ్చేవి కావు.

పాత నాయ‌కుల్ని , వారి వార‌సుల్ని వైసీపీ తుడిచిపెట్టింది. అనంత‌పురం జిల్లాలో అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాపు రామ‌చంద్రారెడ్డిల‌ను మిన‌హాయిస్తే వైసీపీ త‌ర‌పున గెలిచిన వాళ్లంతా కొత్త‌వాళ్లే. వీళ్లు దివాక‌ర్‌రెడ్డి, ప‌రిటాల కుటుంబీకుల్ని కూడా ఓడించారు.

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొత్త నాయ‌క‌త్వం వ‌చ్చింది. మ‌ళ్లీ పాత TDP నాయ‌కుల్ని చేర్చుకోవ‌డం వ‌ల్ల కుంప‌టిని తెచ్చి నెత్తిన పెట్టుకున్న‌ట్టే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి