iDreamPost

చిరంజీవి రుద్రవీణ కాపీ సినిమానా – Nostalgia

చిరంజీవి రుద్రవీణ కాపీ సినిమానా – Nostalgia

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన రుద్రవీణ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కంటెంట్ పరంగా ఎన్నో ప్రశంసలు అవార్డులు అందుకుంది. సంప్రదాయమే జీవిత పరమావధిగా భావించి సమాజాన్ని పట్టించుకోని ఓ గొప్ప సంగీత విద్వాంసుడి కొడుకు గ్రామ శ్రేయస్సు కోసం తన సర్వం త్యాగం చేసే యువకుడి కథే రుద్రవీణ. ఇది మెగా ఫ్యామిలీ ప్రొడక్షన్ లో వచ్చిన మొదటి సినిమా. నాగబాబు నిర్మాతగా వ్యవహరించగా అప్పటికే వచ్చేసిన చిరు మ్యాచో మాస్ స్టార్ ఇమేజ్ ముందు జనాల అంచనాలు అందుకోలేక రుద్రవీణ ఫెయిలయ్యింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నర్గీస్ దత్ అవార్డు ఇవ్వడం గొప్ప అచీవ్ మెంట్. కాని రుద్రవీణకు సంబంధించి ఇది కాపీ సినిమా అనే వివాదం అప్పట్లో చెలరేగింది. మీడియా ఈ స్థాయిలో అప్పుడు లేదు కాని దీని గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అదేంటో చూద్దాం.

1984లో విప్లవ అభ్యుదయ చిత్రాల కథానాయకుడు దర్శకుడు మాదాల రంగారావు జనం మనం అనే సినిమా తీశారు. రుద్రవీణ తరహాలోనే గ్రామవికాసం కోసం పాటు పడే ఓ యువకుడి కథ ఇది. ఇందులో సున్నితమైన అంశాలను ఘాటుగా డీల్ చేయడంతో కొంతకాలం నిషేధించారు. జాతీయ అవార్డుల కోసం పంపితే తిరస్కరణకు గురయ్యింది. రిలీజ్ అయ్యాక ఓ మాదిరిగా ఆడింది. తన సినిమాను కాపీకొట్టి దర్శకులు బాలచందర్ రుద్రవీణ తీశారని, 13 రీళ్ల దాకా రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇదంతా చెప్పడం అ టైంలో సంచలనం రేకెత్తించింది.

చిరంజీవి తనకు కాల్ చేసి అన్నయ్యా రెండు సినిమాల కథ ఒకటే అని టాక్ వచ్చింది నేనోసారి చూస్తా అని చెప్పారని రంగారావు ప్రస్తావించడం విశేషం. తనను ఎంతో అభిమానంతో అన్న అని పిలిచే చిరంజీవి మీద గౌరవంతోనే వ్యవహారాన్ని కోర్ట్ దాకా తీసుకెళ్లలేదని లేదంటే చర్యలు వేరుగా ఉండేవని రంగారావు హెచ్చరించడం అప్పట్లో సెన్సేషన్. ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. రుద్రవీణ కన్నా నాలుగేళ్ల ముందు వచ్చిన జనం మనంకు తమిళ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అందులోని సభ్యుల్లో ఒకరు బాలచందర్ గారే. తర్వాత ఈ వివాదం గురించి ఇరువర్గాల నుంచి ఏవేవో వర్షన్లు వినిపించాయి కాని అసలు నిజం ఏంటో తెలియలేదు. ఇప్పుడా జనం మనం తాలుకు ఆడియో మాత్రమే ఆన్ లైన్ లో ఉండగా సినిమా దొరకడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి