iDreamPost

అంతరిక్ష రంగం ఏలేందుకు భారత్ అడుగులు..!

అంతరిక్ష రంగం ఏలేందుకు భారత్ అడుగులు..!

ప్రస్తుతం అంతరిక్ష రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ప్రయోగ ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రపంచ దేశాలు యత్నాలు వేగవంతం చేశాయి. పౌండు బరువున్న ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చాలంటే 2011లో నాసా 30వేల డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌ ఆ ఖర్చును 1,200 డాలర్లకు తగ్గించింది. భవిష్యత్తులో ఈ ధరలు తగ్గేకొద్దీ అంతరిక్ష మార్కెట్‌ మరింత విస్తరిస్తుంది. ఈ విషయాన్ని భారత్‌ కూడా గుర్తించింది. ప్రస్తుతం ఇస్రోకు కేటాయిస్తున్న 14వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవు. ఈ నేపథ్యంలో దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.

Indian start-ups take giant leap into space with first payloads launched on  ISRO rocket - BusinessToday

అంతరిక్ష రంగంలో భారత్‌..

చాలా ఏళ్లపాటు భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఏకఛత్రాధిపత్యం ఉంది. కానీ, దాని బడ్జెట్‌ పరిమితులతో అనుకున్నంత వేగంగా పరిశోధనలు జరగడంలేదు. దీంతో ఈ రంగంలో ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఐరోపా దేశాల్లో బోయింగ్‌, స్పేస్‌ఎక్స్‌, ఎయిర్‌బస్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ వంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భారత్‌లో కూడా ఇస్రో బీహెచ్‌ఈఎల్‌ సహకారంతో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ తయారీకి వివిధ కంపెనీలను కలిపి కన్సార్టియం ఏర్పాటుకు యత్నిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాకెట్ల ఖర్చు (లాంఛ్‌వెహికల్స్‌) గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం - వికీపీడియా

ప్రపంచంలోనే భారత అంతరిక్ష రంగం ఆరోస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా స్పేస్‌టెక్‌ కంపెనీల్లో కేవలం 3.6శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి. 2019 నాటికి భారత అంతరిక్ష రంగం విలువ 7 బిలియన్‌ డాలర్లు. ఇది 2024 నాటికి దాదాపు 50 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. అంతరిక్ష కార్యకలాపాల అంతర్జాతీయ విపణి పరిమాణం ఇప్పుడు 400 బిలియన్‌ డాలర్లు ఉంటే, సమీప భవిష్యత్తులో ఇది 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

అంతరిక్ష యుద్ధం జరిగితే ఏమవుతుంది... భారత్‌కు కలిగే నష్టమేంటి? | What is  Space War What happened if space is going to start nk– News18 Telugu

ఈ విభాగంలో అమెరికా అత్యధికంగా 56.4శాతం కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. కానీ, ఇక్కడ భారత్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం మన సొత్తు. కేవలం 75 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించింది. భారత్‌లో ఈ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పెరుగుతున్న స్టార్టప్‌లు..
భారత్‌లో ఇప్పటికే దాదాపు 50కుపైగా స్పేస్‌ స్టార్టప్‌లు ఇస్రో వద్ద రిజిస్టర్‌ అయ్యాయి. వీటిల్లో రాకెట్లు తయారు చేసేవి, ఉపగ్రహాలు నిర్మించేవి ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ పర్యవేక్షణలోని అగ్నికుల్‌ సంస్థ రాకెట్‌ ఇంజిన్లను నిర్మిస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ రాకెట్లను తయారు చేస్తున్నాయి. ఇక బెంగళూరుకు చెందిన బెలాట్రిక్స్ ఏరోస్పేస్‌ రాకెట్లను, ఉపగ్రహ ఇంజిన్లను రూపొందిస్తోంది. ఇక డిజంత్రా స్పేస్‌ ఉపగ్రహ విడిభాగాలను నిర్మిస్తోంది. భారత్‌ అంతరిక్ష విధానాలను ఇటీవల మరింత సరళీకరించింది. ఇస్రో అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదలాయిస్తోంది.

ISRO successfully launches 36 satellites in its heaviest LVM3-M2 rocket

మరోవైపు స్పేస్‌ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు కూడా 2021లో 198శాతం పెరిగి 67 మిలియన్‌ డాలర్లకు చేరాయి. 2020లో వచ్చిన పెట్టుబడులు 22 మిలియన్‌ డాలర్లు మాత్రమే.రాకెట్‌ ప్రయోగాలు ఎంటీసీఆర్‌ (మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌) ఒప్పందం కిందకు వస్తాయి. క్షిపణి టెక్నాలజీ వ్యాప్తిని నిరోధించే ఈ ఒప్పందంలో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాకెట్‌ ప్రయోగాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇన్-స్పేస్‌ అనే నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు కంపెనీలు భారత్‌లోని మౌలికవసతులను వినియోగించుకొనేలా ఇది సాయం చేస్తుంది. ప్రైవేటు సంస్థలకు , ఇస్రోకు మధ్య వారథిగా పనిచేస్తుంది.

India's Own Satellite Turns 7; Learn How AstroSat Is Boosting Country's  Space Sector - Science

ప్రైవేటు రంగం రాకతో పెనుమార్పులు..
స్పేస్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థల రాకతో భవిష్యత్తులో ఉపగ్రహాల వినియోగం భారీగా పెరగనుంది. కంపెనీలు సొంతంగా ఉపగ్రహాలు ప్రయోగించి.. డేటా మ్యాపింగ్‌, వాతావరణం అంచనా వేయడం, పారిశ్రామిక సర్వేలు, నీరు- ఇంధనం గుర్తించడం, వ్యవసాయం, రహదారులు, కమ్యూనికేషన్లు ఇలా విస్తృత అవసరాలకు వినియోగించవచ్చు. భవిష్యత్తులో డైరెక్ట్‌ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులోకి వస్తే.. సెల్‌టవర్ల వినియోగం నిలిపివేసే అవకాశం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి