iDreamPost

ఈ 5 మందిని వరల్డ్ కప్​కు ఎందుకు సెలక్ట్ చేయలేదు? పెద్ద మిస్టరీ!

  • Author singhj Updated - 05:27 PM, Tue - 5 September 23
  • Author singhj Updated - 05:27 PM, Tue - 5 September 23
ఈ 5 మందిని వరల్డ్ కప్​కు ఎందుకు సెలక్ట్ చేయలేదు? పెద్ద మిస్టరీ!

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్​ శర్మ సారథిగా 15 మందితో కూడిన టీమ్​ను ఎంపిక చేసింది. ఆసియా కప్​తో రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్​లకు ఛాన్స్ దక్కింది. మెగా టోర్నీలో భారత పేస్ దళాన్ని స్టార్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. వన్డే ఫార్మాట్​లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు.

వరల్డ్ కప్ టీమ్​లో హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్​లను పేస్ ఆల్​రౌండర్లుగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్​ను స్పిన్ ఆల్​రౌండర్లుగా చోటు కల్పించారు. కుల్దీప్ యాదవ్​ను స్పెషలిస్ట్ స్పిన్నర్​గా తీసుకున్నారు. అయితే సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్​కు మరోసారి నిరాశే మిగిలింది. వీళ్లతో పాటు సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, వికెట్ కీపర్ సంజూ శాంసన్​కు కూడా అవకాశం దక్కలేదు. రీసెంట్​గా జరిగిన వెస్టిండీస్ పర్యటనలో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ రాణించాడు.

ఆసియా కప్ జట్టులోనూ తిలక్ వర్మ చోటు సంపాదించాడు. కానీ ప్రపంచ కప్ విషయానికి వచ్చేసరికి.. సెలక్షన్ కమిటీ అనుభవానికే ఓటేసినట్లు అర్థమవుతోంది. అనుభవజ్ఞులనే కారణంతోనే తిలక్ వర్మను కాదని సూర్యకుమార్, రాహుల్​, శ్రేయస్​కు టీమ్​లో స్థానం కల్పించారని తెలుస్తోంది. మరో యువ ఆటగాడు సంజూ శాంసన్​కు అడపాదడపా అవకాశాలు ఇచ్చినా అతడు అంచనాల మేరకు రాణించలేకపోయాడు. మరోవైపు ఇచ్చిన ఛాన్సులను ఇషాన్ కిషన్ రెండుచేతులా ఒడిసిపట్టాడు. దీంతో సంజూకు చోటు దక్కలేదు. ధావన్ విషయానికొస్తే.. అతడు చాన్నాళ్లుగా వన్డే క్రికెట్ ఆడట్లేదు.

గతేడాది డిసెంబర్​లో ధావన్ లాస్ట్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ మధ్య ధావన్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటం.. ఇషాన్ కిషన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో లెఫ్టాండ్ బ్యాటర్లు అందుబాటులో ఉండటంతో ధావన్​ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని విశ్లేషకులు అంటున్నారు. వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ విషయంలో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్​లకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పాలి. స్వదేశంలో ప్రపంచ కప్ జరుగుతుండటంతో లెగ్ స్పిన్నర్ అయిన చాహల్, ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్​ను పక్కాగా తీసుకుంటారని అందరూ అనుకున్నారు.

చాహల్, అశ్విన్​లో ముఖ్యంగా చాహల్​కు టీమ్​లో ప్లేస్ పక్కా అని అనుకున్నా.. అతడికి మాత్రం చోటు దక్కలేదు. చాహల్ వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా అతడ్ని ఆసియా కప్ టీమ్​లోకి తీసుకోలేదు. 8వ నంబర్​లో తమకు బ్యాటింగ్ కూడా చేయగలిగే ప్లేయర్ కావాలంటూ చాహల్​ను రోహిత్ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు వరల్డ్ కప్​కు కూడా అతడ్ని తీసుకోలేదు. స్పిన్​కు అనుకూలించే స్వదేశీ పిచ్​లపై ఎంతో అనుభవం ఉన్న అశ్విన్​కు మొండిచేయి చూపడం కూడా చర్చనీయాంశంగా మారింది. బౌలింగ్​తో పాటు అవసరాన్ని బట్టి బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉన్న అశ్విన్​ను కాదని కుల్దీప్​ను ఎలా తీసుకుంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి.. ప్రపంచ కప్ కోసం సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టు మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అప్పుడు లక్షణ్, రాయుడు.. ఇప్పుడు తిలక్! తరాలు మారినా అదే అన్యాయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి