iDreamPost

ట్రంప్ ఆర్ధిక పునరుద్ధరణ టీమ్ లో భారతీయ దిగ్గజాలు

ట్రంప్ ఆర్ధిక పునరుద్ధరణ టీమ్ లో భారతీయ దిగ్గజాలు

కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలైపోయిన విషయం అందరికీ తెలిసిందే. వైరస్ దెబ్బ అమెరికాలోని ఏఏ రంగాలను ఎంతెంత దెబ్బ తీసిందనే విషయమై ఇంకా స్పష్టమైన వివరాలు లేవులేండి. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐటి, ఆటోమొబైల్, సేవలు, ఉత్పత్తి, పర్యాటక రంగాలపై బాగా ప్రభావం చూపటం ఖాయమని ఆర్ధికవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. సో ఈ అంచనాల ప్రకారం లోతైన విశ్లేషణలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించాడు.

వివిధ రంగాలకు జరిగిన నష్టాలు, వాటినుండి ఎలా బయటపడాలనే విషయాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వటానికి డొనాల్డ్ ట్రంప్ వివిధ రంగాల్లోని సుమారు 200 మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్ధిక నిపుణులతో టీములను ఏర్పాటు చేశాడు. వైరస్ కారణంగా దెబ్బతిన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం ఎలా ? అన్న విషయంపైనే వీరంతా అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలి.

200 మంది టీములో మిగిలిన వాళ్ళ విషయాలు ఎలాగున్నా అమెరికా భారతీయులైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్యా నాదెళ్ళ, ఐబిఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రా సమాచార సాంకేతిక రంగం సమస్యలపై అధ్యయనం చేస్తారు. అలాగే ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టే విషయంలో అధ్యయనం చేసే బృందంలో ఫెర్నాడ్ రికార్డ్ బీవరేజెస్ సీఈవో ఆన్ ముఖర్జీ ఉన్నారు. ఆర్ధిక రంగం పునరుద్ధరణ టీములో అజయ్ బంగా ఉన్నాడు.

పై రంగాలే కాకుండా వ్యవసాయం, బ్యాంకింగ్, నిర్మాణం, కార్మిక, రక్షణ, ఇంధన రంగాలతో పాటు చాలా రంగాల పునరుద్ధరణకు పైన చెప్పిన 200 మంది పనిచేస్తారు. పైన చెప్పిన ప్రముఖులతో పాటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకుర్ బర్గ్, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్ సీఈవో మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కార్ల కంపెనీ సీఈవో బిల్ ఫోర్డ్, జనరల్ మోటార్స్ అధినేత మేరీ బర్రా ఇలా చాలామందే ఉన్నారు. మొత్తానికి అమెరికా ఆర్ధిక రంగాన్ని పునరుద్ధరించేందుకు ట్రంప్ నియమించిన 200 మంది ప్రముఖుల్లో భారతీయులు ఆరుమందికి చోటు దక్కటం గర్వకారణమనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి