iDreamPost

భారత ఆటగాళ్ల రికార్డ్స్ మీద ఇంజమామ్ ఆక్రోశం

భారత ఆటగాళ్ల రికార్డ్స్ మీద ఇంజమామ్ ఆక్రోశం

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం పాకిస్థాన్‌లో కూడా లాక్‌డౌన్ అమలులో ఉంది.ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన పాక్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ ఒకప్పటి తన సహచర క్రికెటర్ రమీజ్ రాజాతో కలిసి సోషల్ మీడియా వేదికగా మాట్లాడాడు. తాజా సంభాషణ సందర్భంగా జట్టు గెలుపు కోసం మాత్రమే పాక్ క్రికెటర్లు ఆడతారని ఇంజిమామ్ కితాబిచ్చాడు. కాగా భారత క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థపూరితంగా తమ రికార్డుల కోసం క్రికెట్ ఆడతారని పాకిస్థాన్ ఇంజిమామ్ ఆరోపించి తన అక్కసును వెళ్లగక్కాడు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అంతర్జాతీయ,దేశీయ క్రికెట్ నుండి 5 సంవత్సరాల పాటు నిషేధానికి గురైన మహమ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్,సల్మాన్ బట్ వంటి పాక్ ఆటగాళ్లు ఏ జట్టు విజయం కోసం ఆడారో ఇంజమామ్ గుర్తు చేసి ఉంటే బాగుండేది.

లైవ్ ఛాట్‌లో పీసీబీ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజిమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ “వాస్తవానికి పాకిస్థాన్ జట్టుతో పోలిస్తే భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ పేపర్‌పై మాత్రమే బలంగా కనిపిస్తుంది.కానీ పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు 30-40 పరుగులు చేసినా,అవి జట్టు కోసమే సాధించారు.అయితే భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీ సాధించిన వ్యక్తిగత స్వార్థంతో జట్టులో స్థానం నిలుపుకోవడానికి మాత్రమే ఆడారు తప్ప జట్టు విజయం కోసం కాదు. భారత్,పాక్ ఆటగాళ్ల మధ్య తేడా ఇదే’’ అని భారత ఆటగాళ్ల రికార్డులపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు.

ఇంకా పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యువ ఆటగాళ్లను ప్రోత్సహించేవాడని ఇంజమామ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫామ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రతిభ ఆధారంగా అతను జట్టులో అవకాశం ఇచ్చేవాడని ఇంజీ తెలిపాడు.1992లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్థాన్‌ వన్డే ప్రపంచకప్ గెలుపొందిన సంగతి తెలిసిందే.ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడిన ప్రతి మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌కు పరాభవమే ఎదురవడం విశేషం.

ఎనభై,తొంబై దశకాలలో తన బౌలింగ్ బలముతో భారత్‌పై పాకిస్తాన్ కొంత ఆదిక్యత ప్రదర్శించింది. బౌలింగ్ విభాగంలో కొంత మెరుగ్గా ఉన్న పాకిస్థాన్ బ్యాటింగ్‌ పరంగా మాత్రం దశాబ్దాలుగా తేలిపోతోంది. ఇక రికార్డుల పరంగా చూసినా పాక్ కంటే భారత బ్యాట్స్‌మెన్‌లే పరుగుల సాధనలో ముందుంటారు. రేపు బర్త్ డే జరుపుకోనున్న ఆల్ టైం గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే 70 శతకాలతో సచిన్ రికార్డు వైపు దూసుకెళ్తున్నాడు. కానీ పాకిస్థాన్ నుంచి ఈ స్థాయిలో బ్యాటింగ్ ప్రదర్శన చేసే ఆటగాడు భూతద్దంతో వెతికిన ఆ జట్టులో కనిపించడు. అయితే బాబర్ అజామ్‌ని కోహ్లీతో పోలుస్తూ పాక్ సంబరపడి పోతుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి