వన్డే వరల్డ్ కప్‌కు ముంగిట ఆసియా కప్‌ను దక్కించుకొని ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. ఇప్పుడు మరో సిరీస్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌లో ఆడే టీమిండియా జట్టును ప్రకటించింది. ఇందులో రెండు వన్డేలకు కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పేటల్ను ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతడి ప్లేసులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో హైదరాబాదీ తిలక్ వర్మకు చోటు దక్కింది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేలో హిట్‌మ్యాన్ తిరిగి జట్టు పగ్గాలు చేపడతాడు. మూడో వన్డేకు కోహ్లీ, పాండ్యా అందుబాటులో ఉంటారు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అదృష్టానికి ఆమడ దూరంలో నిలబడే ఈ యంగ్ బ్యాటర్‌కు మరోమారు సెలెక్టర్ల నుంచి మొండిచేయి ఎదురైంది. ఎంతో ప్రతిభ కలిగిన సంజూ కెరీర్ మొదట్లో ధోని కారణంగా వైట్ బాల్ క్రికెట్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత పంత్, ఇషాన్, రాహుల్ కారణంగా తుది జట్టులో ప్లేస్ దొరకట్లేదు.
వచ్చిన అరకొర ఛాన్సులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు సంజూ శాంసన్. దీంతో అతడు టీమ్‌లో నిలదొక్కుకోలేకపోతున్నాడు. తాజాగా ఆసీస్‌తో సిరీస్‌కు అతడ్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ మ్యాచుల్లో ఆడే ఛాన్స్ సంజూకు దక్కింది. అటు కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ ఖాయమవుతుండగా.. ఆసియా కప్-2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా సెలెక్ట్ అయ్యాడు. దీంతో కౌంటీల్లో ఆడాలనే ఆలోచనను ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విరమించుకున్నాడు. ఒకవేళ కేఎల్ రాహుల్ కోలుకోకపోతే వన్డే ప్రపంచ కప్ టోర్నీకి రిజర్వ్ ప్లేయర్‌గా సంజూను ఆడించాలని సెలక్షన్ కమిటీ అనుకుందని సమాచారం.
చైనాలో జరగాల్సిన ఆడియా క్రీడలకు ఈ కారణం వల్లే సంజూను ఎంపిక చేయలేదట. కానీ రాహుల్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం, ఇషాన్ మిడిలార్డర్లో కుదురుకోవడంతో సంజూ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఇప్పుడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు అతడికి టీమ్‌లో ప్లేస్ దక్కలేదు. వన్డేల్లో వరుసగా ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్న టీమ్ మేనేజ్మెంట్ సంజూను పట్టించుకోకపోవడం గమనార్హం. ఒకవైపు అతడికి కౌంటీల్లో ఆడే ఛాన్స్ పోవడం, మరోవైపు ఆసీస్‌తో సిరీస్‌లోనూ చోటు దొరక్కపోవడంతో సంజూ ఫ్యాన్స్ తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు. ఈ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించాక.. సంజూ తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నవ్వుతున్న ఎమోజీని ఎఫ్బీలో పోస్ట్ చేశాడు సంజూ.
ఇదీ చదవండి: దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే టీమ్‌లోకి అశ్విన్.. రోహిత్ ప్లాన్ ఏంటి?